కమ్ములతో క్రేజీ కాంబినేషన్.. సెట్టయితే కిక్కే..
ఇప్పటికే నానితో పనిచేయాలనే ఆసక్తి శేఖర్ కమ్ముల వద్ద ఉందని సమాచారం.
By: Tupaki Desk | 13 Sep 2024 2:30 AM GMTటాలీవుడ్‌లో మరో ఆసక్తికర కాంబినేషన్‌పై ఇప్పుడు చర్చలు జోరుగా సాగుతున్నాయి. నేచురల్ స్టార్ నాని, క్లాస్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల కలిసి ఓ సినిమా చేయబోతున్నారా? అంటే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ ఇద్దరూ ఒకే ప్రాజెక్ట్‌లో పనిచేసే అవకాశం ఉన్నట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే నానితో పనిచేయాలనే ఆసక్తి శేఖర్ కమ్ముల వద్ద ఉందని సమాచారం.
అదే విధంగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నటించడానికి నాని కూడా ఉత్సాహంగా ఉన్నాడని వార్తలు వస్తున్నాయి. ఇక ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన కథ కూడా శేఖర్ కమ్ముల దగ్గర సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రత్యేకంగా నానికి సరిపోయే కథను రాసినట్లు సమాచారం. శేఖర్ కమ్ముల, కథానాయికగా సాయి పల్లవిని తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
సాయి పల్లవి ఇప్పటికే కమ్ములతో చేసిన రెండు సినిమాల్లోనూ తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. ఫిదా, లవ్ స్టొరీ మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. దీంతో ఈ కాంబినేషన్ కూడా ప్రేక్షకులకు కొత్తగా అనిపించకపోవచ్చు, కానీ మళ్లీ వారి నటనలోని సహజత్వం ఆకట్టుకునే అవకాశముంది. ఇక శేఖర్ కమ్ముల విషయానికి వస్తే, ప్రస్తుతం ఆయన ధనుష్‌తో "కుబేర" అనే సినిమాను రూపొందిస్తున్నారు.
ఈ సినిమా షూటింగ్ వేగంగా సాగుతున్నప్పటికీ, కమ్ముల ఈమధ్య తన స్టైల్ కు భిన్నంగా, ఒకే సమయంలో రెండు మూడు కథలను సిద్ధం చేస్తున్నారు. కుబేర పూర్తి అయిన వెంటనే, ధనుష్‌తో మరో సినిమా చేసే అవకాశముందని ఆ మధ్య మరో టాక్ వచ్చింది. అయితే, ధనుష్ డేట్లు అందుబాటులో లేకపోతే, శేఖర్ కమ్ముల తన తదుపరి ప్రాజెక్ట్‌గా నానితో సినిమా మొదలుపెట్టే అవకాశముందని తెలుస్తోంది.
మరోవైపు, నాని తన ప్రాజెక్టులను కూడా గట్టిగా ప్లాన్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం నాని హిట్ 3 కోసం సిద్ధమవుతున్నాడు, అలాగే సుజిత్ డైరెక్షన్‌లో ఒక సినిమాకు కమిట్ అయ్యాడు. దసరా దర్శకుడు కూడా నానితో ప్రాజెక్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. వీటిలో శేఖర్ కమ్ముల ప్రాజెక్ట్‌కు నాని ఎప్పుడు డేట్లు ఇస్తాడో వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఈ ఊహాగానాలపై అధికారిక ప్రకటన కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. కానీ నాని, శేఖర్ కమ్ముల కాంబినేషన్ సెట్టయితే మాత్రం సినిమా చాలా కొత్తగా ఉంటుంది అని చెప్పవచ్చు.