విజయవాడలో 'మనదేశం' కోసం ప్రత్యేక వేడుక
విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ నటించిన తొలి చిత్రం 'మనదేశం' విడుదలై 75 వసంతాలు పూర్తయిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 6 Dec 2024 10:30 AM GMTవిశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ నటించిన తొలి చిత్రం `మనదేశం` విడుదలై 75 వసంతాలు పూర్తయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా విజయవాడలో వేడుక నిర్వహించాలని తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి నిర్ణయించింది. డిసెంబర్ 14న ఈ వేడుక విజయవాడలో జరుగుతుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్ల కోసం బుధవారం హైదరాబాద్ కార్యాలయంలో ఈ సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి, తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి, తెలంగాణ స్టేట్ చిత్ర వాణిజ్య మండలి, తెలుగు ఫిలిం ఇండస్ట్రీస్ ఎంప్లాయిస్ ఫెడరేషన్, తెలుగు సినీ రైటర్స్ అసోసియేషన్, తెలుగు సినీ దర్శకుల సంఘం ప్రతినిధులు అందరూ పాల్గొని వేడుక గురించి చర్చించారు. ఈ వేడుకకు సినీ ప్రదర్శకులు, సినీ పంపిణీదారులు, సినీ నిర్మాతలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొంటారని తెలిపారు.
వాస్తవానికి ఈ వేడుకలు జనవరిలోనే ప్రారంభమయ్యాయి. ఎన్టీఆర్ 28వ ( జనవరి 18) వర్థంతి సందర్భంగా `మన దేశం` సినిమా 75 సంవత్సరాల విజయోత్సవ వేడుకలు హైదరాబాద్ లోని ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో జరిగాయి. ఎన్టీఆర్ సెంటనరీ సెలబ్రేషన్స్ కమిటీ ఆధ్వర్యంలో ` మనదేశం` చిత్ర నిర్మాత శ్రీమతి కృష్ణవేణి, ఆ చిత్ర దర్శకుడు ఎల్.వి. ప్రసాద్ కుమారుడు రమేష్ ప్రసాద్, పూర్ణా పిక్చర్స్ అధినేత విశ్వనాథ్ ను ఈ సందర్భంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ సెంటనరీ సెలబ్రేషన్స్ కమిటీ ఛైర్మన్ జనార్థన్ మాట్లాడారు. ` 'మనదేశం' సినిమా 75 సంవత్సరాల వేడుకలు, ఎన్టీఆర్ 28వ వర్థంతి కార్యక్రమం రోజున జరుపుకుంటున్నాం. ఎందరో నాయకులు వస్తారు వెళ్తారు. కానీ ప్రజలకు సేవ చేసిన వారే చిరకాలం గుర్తుంటారు. అలాంటి గొప్ప నాయకుడు ఎన్టీఆర్. 40 ఏళ్ల తర్వాత దేశానికి ఎలాంటి అవసరాలు ఉంటాయో ఊహించి ముందే చెప్పిన గొప్ప దూరదృష్టి గల నాయకుడు ఆయన. నటుడిగా ఎన్టీఆర్ గొప్పదనం గురించి ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరికీ తెలుసు` అన్నారు