Begin typing your search above and press return to search.

నమ్మకం లేని సీక్వెల్స్.. కిక్ ఇవ్వట్లే సామీ..

‘బాహుబలి’ సిరీస్ తర్వాత సౌత్ లో సీక్వెల్స్ ట్రెండ్ బాగా పెరిగింది.

By:  Tupaki Desk   |   2 Oct 2024 3:30 PM GMT
నమ్మకం లేని సీక్వెల్స్.. కిక్ ఇవ్వట్లే సామీ..
X

‘బాహుబలి’ సిరీస్ తర్వాత సౌత్ లో సీక్వెల్స్ ట్రెండ్ బాగా పెరిగింది. ‘బాహుబలి 2’ తర్వాత ‘కేజీఎఫ్’ రెండు భాగాలుగా వెంటవెంటనే వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. ఆ తరువాత చిన్న సినిమాలలో ‘డీజే టిల్లు’ ఫ్రాంచైజ్ లో రెండో సినిమా జెట్ స్పీడ్ లో వచ్చి సెన్సేషనల్ హిట్ అయ్యింది. ప్రస్తుతం సౌత్ లో అన్ని భాషలలో పాన్ ఇండియా సినిమాలు తెరకెక్కుతున్నాయి. తెలుగులో ఇంకా ఎక్కువ మూవీస్ సిద్ధం అవుతున్నాయి. ఇలా తెరకెక్కుతోన్న పాన్ ఇండియా సినిమాలు షూటింగ్ దశలో ఉండగానే మేకర్స్ సీక్వెల్స్ ఉంటాయని ప్రకటిస్తున్నారు.

సినిమాపై హైప్ పెంచడానికి ఈ సీక్వెల్ ప్రకటనలు ఉపయోగపడుతున్నాయి. కానీ రెండు భాగాలుగా సినిమా చేయాలనే ప్రయత్నంలో దర్శకులు మొదటి పార్ట్ ని అసంతృప్తిగా ముగిస్తున్నారనే మాట వినిపిస్తోంది. పార్ట్ 2 కోసం కొన్ని ఇంటరెస్టింగ్ ఎలిమెంట్స్ ఉంచాలని ప్రయత్నం చేస్తూ మొదటి పార్ట్ ని కూడా చాలా బలహీనమైన స్క్రీన్ ప్లేతో చెబుతున్నారనే ప్రచారం నడుస్తోంది. వీటికి ఉదాహరణ కూడా చూపిస్తున్నారు. నిజానికి ‘పుష్ప’ మూవీకి హిందీలో మాత్రమే బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది.

తెలుగులో మిశ్రమ స్పందనలు వచ్చాయి. అయితే మేకర్స్ ఈ పార్ట్ 2పైన ఫోకస్ చేసి హైప్ క్రియేట్ చేశారు. తమిళంలో ‘లియో’ మూవీని రెండు భాగాలుగా చేస్తానని లోకేష్ కనగరాజ్ చెప్పారు. ‘లియో’ మొదటి పార్ట్ కి మిశ్రమ స్పందనలు వచ్చాయి. ఇక ‘భారతీయుడు 2’ ఫలితం ఏంటనేది అందరికి తెలిసిందే. అలాగే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వచ్చిన ‘సలార్’ ని రెండు భాగాలుగా చేయనున్నట్లు ఎనౌన్స్ చేశారు. ‘సలార్’ రిలీజ్ అయిన 6 నెలల్లోనే ‘సలార్ పార్ట్ 2’ షూటింగ్ స్టార్ట్ అవుతుందనే ప్రచారం నడిచింది.

అయితే ‘సలార్’ మూవీ కమర్షియల్ హిట్ అయిన కొన్ని బలమైన సీక్వెన్స్ తప్ప చెప్పుకోదగ్గ కథనం లేదని రివ్యూలు వచ్చాయి. క్లైమాక్స్ తో పార్ట్ 2కి ప్రశాంత్ నీల్ లీడ్ ఇచ్చారు. కానీ ఎందుకనో ఈ సీక్వెల్ పక్కన పెట్టి ప్రభాస్ వేరే ప్రాజెక్ట్స్ తో బిజీ అయ్యారు. ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో ‘డ్రాగన్’ చేసుకుంటున్నారు. ఇప్పుడు ‘దేవర’ మూవీ రెండు భాగాలుగా ఉంటుందని కొరటాల ప్రకటించాడు. అయితే మొదటి పార్ట్ కే మిశ్రమ రివ్యూలు వచ్చాయి.

కథనం చాలా బలహీనంగా ఉందని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్ కారణంగా ఈ సినిమాకి ఆదరణ లభిస్తోంది. దీని తర్వాత ‘దేవర 2’ వెంటనే వచ్చే అవకాశం ఉందా అంటే లేదని చెప్పాలి. ప్రస్తుతం ఎన్టీఆర్ ‘వార్ 2’తో పాటు ‘డ్రాగన్’ సినిమాలు చేస్తున్నారు. ఈ రెండు పూర్తయ్యే సరికి రెండేళ్లు టైం పడుతుంది. ఆ తరువాత ‘దేవర 2’ రావొచ్చు. నిజానికి సీక్వెల్స్ పై పబ్లిక్ లో పెద్ద అటెన్షన్ క్రియేట్ కావడం లేదు. కేవలం సినిమాకి హైప్ తీసుకురావడం కోసం మాత్రమే రెండు భాగాలుగా మూవీ చేస్తున్నామనే ప్రకటనలు ఇస్తున్నట్లు అనిపిస్తోంది.

కథని రెండు భాగాలుగా చెప్పాలనే ప్రయత్నంలో మొదటి పార్ట్ కథనం సరిగ్గా చెప్పడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ఇంపాక్ట్ సీక్వెల్స్ పై హైప్ తగ్గిస్తున్నాయని సినీ విశ్లేషకులు అంటున్నారు. చెప్పాల్సిన కథ అంతా ముందు చెప్పేసాక క్లైమాక్స్ లో నెక్స్ట్ సీక్వెల్స్ ని లీడ్ ఇస్తే కొత్త కథని చెప్పడానికి స్కోప్ దొరుకుతుందని, అప్పుడు పబ్లిక్ లో హైప్ క్రియేట్ చేయొచ్చని విశ్లేషకులు అంటున్నారు. హాలీవుడ్ మేకర్స్ ఈ ఫార్ములాని ఎక్కువగా ఫాలో అవుతారని వారి సినిమాలు చూస్తే తెలుస్తుంది. మరి మన దర్శకులు ఫాలో అవుతున్న ఈ ఫార్ములా ఇంకా ఎంత కాలం కొనసాగుతుందో చూడాలి.