ఐటి శాఖపై స్టార్ హీరో కోర్టు పోరాటం నేర్పిన పాఠం
యుకేలో అతడు అప్పటికే చెల్లించిన పన్నులకు క్రెడిట్ ఇవ్వడానికి ఇన్ కం ట్యాక్స్ కార్యాలయం నిరాకరించింది. 84.17 కోట్ల లావాదేవీ విషయంలో ఆదాయపన్ను శాఖ పట్టుబట్టింది.
By: Tupaki Desk | 11 March 2025 4:00 AM ISTమహేష్ బాబు నటించిన 1-నేనొక్కడినే సినిమాని మెజారిటీ భాగం బ్రిటన్ లో తెరకెక్కించారు. ఆ సినిమాకి పన్ను మినహాయింపు ద్వారా చాలా ఆదాయం 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థకు వెనక్కి వచ్చిందని ముచ్చటించుకున్నారు. లండన్ - యుకేలో సినిమా తీయడం ద్వారా చాలా వరకూ పన్ను బెనిఫిట్ పొందవచ్చు. అక్కడి ప్రభుత్వం డబ్బును వెనక్కి ఇస్తుంది. తద్వారా నిర్మాతకు చాలా కలిసొస్తుందని మీడియాలో కథనాలొచ్చాయి.
ఇప్పుడు కింగ్ ఖాన్ షారూఖ్ ఖాన్ ఓ కోర్టు కేసులో గెలవడానికి ఇలాంటి ఒక కాజ్ సహకరించింది. తన రా.వన్ చిత్రానికి సంబంధించిన యుకే పన్ను ఆదాయం విషయంలో కోర్టులో విచారణ సాగుతోంది. ఆదాయపు పన్ను శాఖపై తాను వేసిన కేసులో ఇప్పుడు కింగ్ ఖాన్ గెలుపొందారు. ఆదాయపు పన్ను అప్పీలేట్ ట్రిబ్యునల్ (ITAT) ఖాన్ పక్షాన నిలిచింది. 2011-12 సంవత్సరానికి పన్ను పునఃఅంచనాను రద్దు చేసింది. ఆ ఏడాది ఖాన్ తన ఆదాయం గురించి ప్రకటించాడు. యకేలో విధించిన పన్ను ఆదాయం గురించి కూడా నిజాయితీగా చెప్పాడు.
యుకేలో అతడు అప్పటికే చెల్లించిన పన్నులకు క్రెడిట్ ఇవ్వడానికి ఇన్ కం ట్యాక్స్ కార్యాలయం నిరాకరించింది. 84.17 కోట్ల లావాదేవీ విషయంలో ఆదాయపన్ను శాఖ పట్టుబట్టింది. అయితే చట్టపరమైన కాలపరిమితి ముగిసిన తర్వాత అధికారులు పన్నును తిరిగి అంచనా వేయడం సరికాదని కోర్టు ఇప్పుడు తీర్పునిచ్చింది. రా.వన్ సినిమా కోసం బ్రిటన్ లోని విన్ ఫోర్డ్ ప్రొడక్షన్ ద్వారా పన్ను చెల్లింపు జరిగింది. దీనివల్ల భారతదేశం పన్ను ఆదాయాన్ని కోల్పోయిందని అధికారులు వాదించారు. విదేశీ పన్ను క్రెడిట్ విషయమై ఖాన్ వాదనను తిరస్కరించారు. ఎట్టకేలకు ముంబైలోని ITAT ఖాన్‌కు అనుకూలంగా పునఃఅంచనాను రద్దు చేసింది. కాలపరిమితి ముగిసింది.. కొత్త ఫలితాలు ఏవీ లేవు... కొత్త వివరాలు ఏవీ సమర్పించలేదు. పన్ను అధికారి తన మనసు మార్చుకున్నాడు గనుక ఇది తిరిగి అంచనా వేయడానికి సరైన కారణం కాదు అని పేర్కొంది.
ఎట్టకేలకు రా.వన్ పన్ను ఉపశమనం కేసులో ఖాన్ కోర్టులో నెగ్గారు. ఖాన్ నిజాయితీగా ప్రతిదీ పన్ను ఆదాయం గురించి బహిరంగంగా చూపించారు. ఆదాయాన్ని చెల్లింపు చేసే వ్యక్తి దాచకపోతే పన్ను అధికారులు సాధారణంగా నాలుగేళ్ల తర్వాత పన్ను రిటర్న్‌లను సమీక్షించలేరు. మరొక దేశంలో ఇప్పటికే పన్ను చెల్లించిన విషయాన్ని సరిగ్గా ఆధారాలతో చెబితే.. భారతదేశం దానిపై మళ్ళీ పన్ను విధించదు. విదేశీ పన్ను క్రెడిట్ క్లెయిమ్‌లు చట్టం ద్వారా రక్షణ ఉంటుంది. పన్ను చెల్లింపుదారులు తమ క్లెయిమ్‌లకు మద్దతుగా వారి విదేశీ ఆదాయం, పన్ను చెల్లింపులు, పన్ను ఒప్పంద నియమాల రికార్డులను తమ వద్ద దాచుకోవాలి. విదేశీ పన్ను క్రెడిట్ ప్రయోజనాలను పొందడానికి గడువులోగా ఫారమ్ 67ని సమర్పించడం చాలా అవసరం. రా.వన్ విషయంలో ఖాన్ ఐటి శాఖతో పోరాటం, ఇప్పుడు చాలా మంది నిర్మాతలకు ఒక మంచి విషయాన్ని నేర్పిస్తోంది.