Begin typing your search above and press return to search.

స్టార్ రైట‌ర్స్ బ్రేక‌ప్‌కి కార‌ణం?

షోలే.. జంజీర్.. దీవార్.. డాన్.. ఇవ‌న్నీ బాలీవుడ్ లో సంచ‌ల‌న విజ‌యాలు సాధించిన 90ల నాటి క్లాసిక్స్

By:  Tupaki Desk   |   3 July 2024 9:30 AM GMT
స్టార్ రైట‌ర్స్ బ్రేక‌ప్‌కి కార‌ణం?
X

షోలే.. జంజీర్.. దీవార్.. డాన్.. ఇవ‌న్నీ బాలీవుడ్ లో సంచ‌ల‌న విజ‌యాలు సాధించిన 90ల నాటి క్లాసిక్స్. అయితే వీట‌న్నిటి సృజ‌న వెన‌క దాగి ఉన్న ర‌చ‌యితలు స‌లీం-జావేద్. స‌ల్మాన్ ఖాన్ తండ్రి స‌లీం ఖాన్.. ష‌బానా ఆజ్మీ భ‌ర్త జావేద్ అక్త‌ర్.. హిందీ చిత్ర‌సీమ ఎదుగుద‌ల‌లో కీల‌క ద‌శ‌లో భాగ‌స్వాములుగా ఉన్నారు. అద్భుత‌మైన స్క్రిప్టుల‌ను వీరు సృష్టించ‌డ‌మే గాక‌.. మేటి ర‌చ‌యిత‌లుగా భారీ పారితోషికాల‌ను అందుకున్నారు. అయితే సలీం ఖాన్ - జావేద్ అక్తర్ ఇద్ద‌రూ విడిపోయి ఎవ‌రి దారిలో వారు ప్ర‌యాణించ‌డం ప‌రిశ్ర‌మ‌ను ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. తాజాగా షబానా అజ్మీని ఓ ఇంట‌ర్వ్యూలో ఆమె భర్త జావేద్ అక్తర్ - సలీం ఖాన్‌ల అనుబంధం గురించి ప్ర‌శ్నించారు.

నిజానికి ఈ జోడీ అనుబంధం 1982 వరకు కొనసాగింది. అటుపై ఇద్దరూ విడిపోవాలని నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత జావేద్ సాహిత్యం రాయడం ప్రారంభించారు. స‌లీంఖాన్ స్క్రిప్టు ర‌చ‌యిత‌గానే కొన‌సాగారు. సలీం-జావేద్‌గా ప్రసిద్ధి చెందిన వీరిద్దరూ పలు బ్లాక్‌బస్టర్ సినిమాలకు స్క్రిప్ట్‌లు రాశారు. వీటిలో షోలే, జంజీర్, దీవార్ , డాన్ స‌హా ఎన్నో క్లాసిక్స్ ఉన్నాయి.

ఐదుసార్లు జాతీయ చలనచిత్ర అవార్డు గెలుచుకున్న సలీం ఖాన్ కుమారుడు, నటుడు అర్బాజ్ ఖాన్ టాక్ షో `ది ఇన్విన్సిబుల్స్‌`లో పాల్గొన్న ష‌బానా ఈ అంశాన్ని ప్రస్తావించారు. సలీం-జావేద్ తమ కెరీర్‌లో గరిష్ట స్థాయికి చేరుకున్నారు! అని అర్బాజ్ త‌దుప‌రి ఎపిసోడ్ టీజర్‌లో గుర్తు చేసుకున్నారు. ``ఈరోజు వరకు సలీం-జావేద్ ఎందుకు విడిపోయారో నాకు తెలియదు`` అని షబానా స్పందించ‌డం ఈ టీజ‌ర్ లో క‌నిపించింది. షబానా అజ్మీ కూడా జావేద్ అక్తర్- స‌లీం ఖాన్ ల‌ మ‌ధ్య ప‌రిష్కారం కోసం ప్ర‌య‌త్నించ‌డం గురించి ఓపెనైంది. `అది కష్టం` అని నొక్కి చెప్పింది. ఈ ఎపిసోడ్‌లో షబానా జావేద్ మొదటి భార్య హనీ ఇరానీ .. వారి పిల్లలు ఫర్హాన్ అక్తర్ - జోయా అక్తర్‌లతో తన సంబంధం గురించి కూడా చర్చించారు.

ఈ సంవత్సరం ప్రారంభంలో ఓ ఇంటర్వ్యూలో జావేద్ అక్తర్ త‌న స్నేహితుడు సలీం ఖాన్ నుంచి విడిపోవడం గురించి ప్ర‌స్థావించారు. ``మేము క‌లిసి కెరీర్ ప్రారంభించినప్పుడు.. ఒక‌రికోసం ఒక‌రుగా ప‌నిచేసాం. మేము చాలా సమయం కలిసి గడిపాము.. సముద్రం పక్కన కూర్చుంటాము.. కథల గురించి మాట్లాడుకుంటాము. అతను నా గదికి వస్తాడు.. నాకు పేయింగ్ గెస్ట్ రూమ్ ఒకటి ఉంది.. లేదా నేను అతని ఇంటికి వెళ్తాను.. అది చిన్నది. కానీ మేం పెద్దగా మరింత విజయవంతం అయినప్పుడు మా జీవితంలోకి చాలా మంది వ్యక్తులు ప్రవేశించారు. అప్పుడు నిద్రాణంగా ఉన్న కోరికలన్నీ, నిద్రాణమై ఉన్న ఆసక్తులన్నీ... జీవితంలోని ప్రధాన సమస్య లేదా ప్రధాన ఆసక్తిని మేల్కొలుపుతాయి. అవి పూర్త‌యితేనే మ‌నం సంతృప్తికరమైన స్థితికి చేరుకుంటాం. ఆపై ఇతర ఆసక్తులు ఉద్భవించడం ప్రారంభిస్తాయి`` అంటూ న‌ర్మ‌గ‌ర్భంగా మాట్లాడారు. త‌మ మ‌ధ్య‌కు చాలా మంది వ్య‌క్తులు ప్ర‌వేశించార‌ని జావేద్ స్ప‌ష్ఠంగా చెప్పారు. ఆ త‌ర్వాత త‌మ స్నేహం బ‌ల‌హీన ప‌డింద‌ని అన్నారు.

తాము విడిపోవడానికి డబ్బు, క్రెడిట్‌తో సంబంధం లేదని ఈ సంద‌ర్భంగా ఆయన స్పష్టం చేశారు. మ‌నం చ‌లారకాల వ్యక్తులను కలుస్తుంటాం. క్రమంగా స్నేహితులు కూడా వేర్వేరు అవుతారు...అదే మా విష‌యంలోను జరిగింది.. అని జావేద్ అన్నారు. మేము ఒక‌రితో ఒక‌రం ఫైటింగులేవీ చేయ‌లేదు.. ర‌చ‌యిత‌లుగా క్రెడిట్ గురించి ఎటువంటి సమస్య లేదు.. డబ్బు గురించి ఎప్పుడూ సమస్య లేదు.. కానీ మేం విడిపోయాము.. అని వెల్ల‌డించారు. నాటి సంబంధం ఇప్పుడు లేదని, మేము ఇప్పుడు సాయంత్రం కలిసి కూర్చోవడం లేదని, మాకు మా స్వంత స్నేహితులు ఉన్నారని అంతా గ్ర‌హించార‌ని అన్నారు. ఇది మా ప‌ని పైనా ప్ర‌భావం చూపింద‌ని జావేద్ వివ‌రించారు.