భారీ లాభానికి ఇల్లు అమ్మేసిన సూపర్‌స్టార్
ముంబైలో రియల్ వ్యాపారం జోరు మరో రేంజులో ఉంది. స్టార్లు సూపర్ స్టార్లు స్థిరాస్థి రంగంలో పెట్టుబడులు పెట్టి భారీ లాభాలను ఆర్జిస్తున్నారు.
By: Tupaki Desk | 2 April 2025 4:30 PMముంబైలో రియల్ వ్యాపారం జోరు మరో రేంజులో ఉంది. స్టార్లు సూపర్ స్టార్లు స్థిరాస్థి రంగంలో పెట్టుబడులు పెట్టి భారీ లాభాలను ఆర్జిస్తున్నారు. అంతేకాదు.. ఒక్కో ప్రాపర్టీని 10 రెట్ల లాభానికి అమ్మడం ఎలానో ఇంతకుముందు బచ్చన్ లు నిరూపించారు. ఒబెరాయ్ లు, కపూర్ కుటుంబం, టాండన్ కుటుంబం, కాజోల్ దేవగన్, శ్రద్ధా కపూర్ లాంటి వాళ్లు రియల్ ఎస్టేట్ పెట్టుబడులతో లాభాల పంట పండించుకుంటున్నారు. కేవలం రెండు మూడేళ్లకే కోట్లకు కోట్లు లాభాలు కళ్లజూస్తున్నారు. నిజానికి హైదరాబాద్, కోల్ కతా లాంటి చోట్ల లేని బిజినెస్ ముంబైలో సాధ్యమవుతోంది.
ప్రస్తుతం కింగ్ కాన్ షారూఖ్ తన `మన్నత్` ని రీమోడలింగ్ చేస్తున్న క్రమంలో రెండేళ్ల పాటు వేరొక చోటికి అద్దెకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఇంతలోనే ఇప్పుడు SRK- గౌరీ ముంబైలోని వారి ప్రీమియం ఆస్తులలో ఒకదాన్ని కూడా అమ్మేశారు. వారి ప్రస్తుత నివాసం మన్నత్ ని రిపెయిర్లు, ఎస్టాబ్లిష్ మెంట్ చేయడానికి ఏర్పాట్లు సాగుతుండగానే ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఒక రియల్ ఫర్మ్ వెల్లడించిన ఆస్తి రిజిస్ట్రేషన్ పత్రాల ప్రకారం.. గౌరీ ఖాన్ ముంబై దాదర్ (పశ్చిమ)లోని కోహినూర్ అల్టిస్సిమోలోని తమ ఆస్తిని విక్రయించారు. ఖాన్‌లు రూ. 8.5 కోట్లతో ఆస్తిని కొనుగోలు చేసి, రూ. 11 కోట్లకు అమ్మడం ద్వారా 37 శాతం లాభం పొందారు. వారు తాత్కాలికంగా పాలి హిల్‌కు మారిన తర్వాత పరిణామమిది.
షారూఖ్ తమ కుటుంబ నివాసం కోసం `పూజ కాసా`లోని నాలుగు అంతస్తులను లీజుకు తీసుకున్నారు. ఈ భవనం చిత్ర నిర్మాత వాషు భగ్నాని పిల్లలు జాకీ భగ్నాని, దీప్షికా దేశ్‌ముఖ్‌ల సొంతం. కొత్త స్థలం మన్నత్ అంత పెద్దది కాకపోయినా ఖాన్‌ల భద్రతా బృందం, సిబ్బందికి వసతి కల్పించడానికి తగినంత స్థలం ఉందని తెలుస్తోంది. ఈ విలాసవంతమైన డ్యూప్లెక్స్ అపార్ట్‌మెంట్‌లకు ఖాన్ నెలకు రూ. 24.15 లక్షల అద్దె చెల్లిస్తున్నట్లు సమాచారం. సెక్యూరిటీ డిపాజిట్ ఒక్కో అపార్ట్‌మెంట్‌కు రూ. 32.97 లక్షలు.
షారుఖ్ ఖాన్ 2001లో మన్నత్‌ను రూ. 13 కోట్లకు కొనుగోలు చేశాడు. ఢిల్లీ - దుబాయ్‌లలో అతడికి మరో ఐదు ఆస్తులు కూడా ఉన్నాయి. షారూఖ్ తన తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత ఈ ఇల్లును కొన్నాడు.