Begin typing your search above and press return to search.

అర్జున్‌ రెడ్డి లాంటి అబ్బాయిలు ఉంటారా?

కబీర్‌ సింగ్‌ సినిమా విడుదల అయ్యి చాలా కాలం అయ్యింది. ఇప్పుడు షాహిద్‌ ఆ సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

By:  Tupaki Desk   |   4 Dec 2024 4:30 PM GMT
అర్జున్‌ రెడ్డి లాంటి అబ్బాయిలు ఉంటారా?
X

విజయ్‌ దేవరకొండ హీరోగా సందీప్‌ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన అర్జున్‌ రెడ్డి సినిమా ట్రెండ్‌ సెట్టర్ మూవీ అనడంలో సందేహం లేదు. ఒక హీరో పాత్రను అలా కూడా చూపించవచ్చు అంటూ దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగ చేసిన ప్రయోగం సూపర్‌ హిట్‌ అయ్యింది. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా హిందీలో ఈ సినిమా కబీర్‌ సింగ్‌ అని రీమేక్ అయ్యి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. తెలుగు లో విజయ్ దేవరకొండ పోషించిన పాత్రను హిందీలో షాహిద్‌ కపూర్‌ పోషించిన విషయం తెల్సిందే. కబీర్‌ సింగ్‌ సినిమా విడుదల అయ్యి చాలా కాలం అయ్యింది. ఇప్పుడు షాహిద్‌ ఆ సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో షాహిద్‌ కపూర్‌ మాట్లాడుతూ... అర్జున్‌ రెడ్డి సినిమాను మొదటి సారి చూసినప్పుడు ఇలాంటి అబ్బాయిలు ఉంటారా, అసలు ఇలాంటి అబ్బాయిలతో అమ్మాయిలు ఎలా ప్రేమలో పడుతారు అనుకున్నాను. ఆ తర్వాత నాకు తెలిసింది అలాంటి అబ్బాయిలు ఉంటారు, అలాంటి వారితో అమ్మాయిలు ప్రేమలో పడతారు అని తెలుసుకున్నాను. ఆ సినిమాలోని కొన్ని సన్నివేశాలు నాకు పర్సనల్‌గా అస్సలు నచ్చలేదు. ఈ సమాజంలో కొందరు అబ్బాయిలు ఇలా ఉన్నారు, మనం ఎలా ఉండాలి అనుకుంటే అలా ఉండాలి అనేది మన నిర్ణయం అనే విషయాన్ని చెప్పడానికి ఆ సినిమాను చేశాను.

నిజ జీవిత సంఘటల ఆధారంగానే సినిమాలు రూపొందుతాయి. కబీర్ సింగ్ సైతం నిజ జీవిత కథల ఆధారంగానే రూపొందింది. చాలా సన్నివేశాలు మన చుట్టూ జరుగుతున్నవే అనిపిస్తాయి. అలాంటి అబ్బాయిలను ప్రేమించే అమ్మాయిలు ఉన్నప్పుడు, అలాంటి అబ్బాయిల గురించి ఎందుకు సినిమాలు తీయకూడదు అనుకున్నాను. అందుకే కబీర్‌ సింగ్‌ సినిమాలో నటించేందుకు ఒప్పుకున్నాను. ఇష్టం లేని కొన్ని సీన్స్ చేశాను, కష్టం అనిపించినా వాటిని ప్రేక్షకుల ముందుకు తీసుకు వెళ్లాను. ఇది చూసి నేర్చుకోవడం కాకుండా జనాలు ఎలా బతకాలి అనుకుంటే అలా బతికేయవచ్చు అనేది ఈ సినిమాలో చూపించే ప్రనయత్నం చేశాం అని అన్నారు.

2019లో హిందీలో కబీర్‌ సింగ్ రూ.60 కోట్ల బడ్జెట్‌తో రూపొంది ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కబీర్‌ సింగ్‌ హిందీ బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.380 కోట్ల వసూళ్లు నమోదు చేసింది. సినిమాను మరింతగా ప్రమోట్‌ చేసి ఉంటే కచ్చితంగా రూ.500 కోట్ల వసూళ్లు నమోదు అయ్యేవి అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి కబీర్‌ సింగ్‌ వంటి సినిమాను హిందీ ప్రేక్షకులకు అందించడంతో సందీప్‌ వంగకి వెంటనే యానిమల్‌ సినిమాను చేసే అవకాశం దక్కింది. ఆ సినిమా ఏకంగా రూ.1000 కోట్ల సినిమాగా బాక్సాఫీస్ వద్ద నిలిచింది. రణబీర్ కపూర్‌ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్‌గా యానిమల్ సినిమా వచ్చింది.