ప్రభాస్, అల్లు అర్జున్ కాదు.. ఈ హీరో పారితోషికంలో టాప్!
అతడు పుష్ప 2 కోసం ఏకంగా 235 కోట్ల పారితోషికం అందుకున్నారని, రజనీకాంత్, దళపతి విజయ్ తర్వాత ఆ స్థాయిని అందుకున్నాడని కూడా ప్రచారమైంది.
By: Tupaki Desk | 13 Dec 2024 8:30 PM GMTబాహుబలి 2 తర్వాత డార్లింగ్ ప్రభాస్ టాలీవుడ్ నుంచి తొలి 100 కోట్ల పారితోషికం అందుకున్న హీరో అంటూ ప్రచారం సాగింది. సలార్, కల్కి 2898 ఏడి చిత్రాలకు 200 కోట్లు పైగా పారితోషికం ప్రభాస్ అందుకున్నాడని ప్రచారమైంది. ఆ తర్వాత టాలీవుడ్ లో అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోగా అల్లు అర్జున్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అతడు పుష్ప 2 కోసం ఏకంగా 235 కోట్ల పారితోషికం అందుకున్నారని, రజనీకాంత్, దళపతి విజయ్ తర్వాత ఆ స్థాయిని అందుకున్నాడని కూడా ప్రచారమైంది.
పుష్ప 2 ఘనవిజయంతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే పది మంది స్టార్లలో ఒకరిగా ఎదిగారు. అతడి పారితోషికం, లాభాల్లో వాటాలు కలుపుకుని భారీ మొత్తం పే చెక్ అందుకుంటున్నాడని తాజాగా `ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా` కథనం ప్రచురించింది.
అయితే భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటుల జాబితాలో బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ అగ్రస్థానంలో ఉన్నాడని కూడా సదరు కథనం పేర్కొంది. గత ఏడాది పఠాన్, జవాన్, డంకీ వంటి బ్లాక్ బస్టర్లలో షారూఖ్ నటించాడు. పఠాన్ అతడికి గ్రేట్ కంబ్యాక్ ఇచ్చిన సినిమా. ఈ సినిమా కోసం SRK 55 శాతం లాభాల వాటా నుండి రూ.350 కోట్లకు పైగా సంపాదించాడని, అతను భారతదేశంలో అత్యధిక పారితోషికం పొందే స్టార్ అని ది హాలీవుడ్ రిపోర్టర్ పేర్కొంది. జవాన్ సొంత బ్యానర్ సినిమా గనుక నటుడిగా పారితోషికం తీసుకోలేదు. కానీ పఠాన్ తో వచ్చిన దానికంటే జవాన్ కి ఎక్కువ మొత్తం ఆర్జించాడని కూడా సదరు కథనం వెల్లడించింది.
నిజానికి దక్షిణాది స్టార్లలో దళపతి విజయ్ `ది గోట్` చిత్రం కోసం 275 కోట్లు అందుకున్నాడని ప్రచారమైంది. రజనీకాంత్ నటించిన జైలర్ ఘనవిజయం సాధించగా, పారితోషికం లాభాల్లో వాటా కలుపుకుని రజనీకాంత్ 200 కోట్లు పైగా ఆర్జించారని కథనాలొచ్చాయి. ఆర్.ఆర్.ఆర్ స్టార్లు రామ్ చరణ్, ఎన్టీఆర్ వంద కోట్లు అంతకుమించి ఆర్జిస్తున్నారని, ఒక్కో సినిమాకి భారీ మొత్తం పారితోషికాలు వసూలు చేస్తున్నారని ప్రచారం ఉంది.
సల్మాన్ ఖాన్ పారితోషికం, లాబాల్లో వాటా కలుపుకుని దాదాపు 200 కోట్లు ఆర్జిస్తుండగా, అమీర్ ఖాన్ 60 శాతం లాభాల వాటాను అందుకుంటున్నాడు. హృతిక్ రోషన్ ఒక్కో చిత్రానికి రూ.100 కోట్లకు పైగా సంపాదిస్తున్నాడు. అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్, రణబీర్ కపూర్ వంటి స్టార్లు సుమారు 80 కోట్ల వరకూ అందుకుంటున్నారని కథనాలొస్తున్నాయి.