స్టార్ హీరోకి పబ్లిక్ ముందే ఝలకిచ్చిన మిస్సు
ఒకసారి గౌరీఖాన్ పీసీకి అవకాశం ఇవ్వొద్దని షారూఖ్ తో వాదించిందని కూడా హిందీ మీడియాలో కథనాలొచ్చాయంటే వ్యవహారం ఏ స్థాయికి చేరుకుందో కూడా ఊహించాలి.
By: Tupaki Desk | 21 May 2024 3:00 AM GMTప్రియాంక చోప్రా ఇప్పుడు గ్లోబల్ స్టార్ గా వెలిగిపోతోంది. అయితే కెరీర్ ఆరంభం షారుఖ్ ఖాన్ తో ఉన్న గొప్ప అనుబంధం గురించి చాలా కాలం పాటు మీడియాలో వార్తా కథనాలు వెలువడ్డాయి. ఒకసారి గౌరీఖాన్ పీసీకి అవకాశం ఇవ్వొద్దని షారూఖ్ తో వాదించిందని కూడా హిందీ మీడియాలో కథనాలొచ్చాయంటే వ్యవహారం ఏ స్థాయికి చేరుకుందో కూడా ఊహించాలి.
ఈ జంట నడుమ కెమిస్ట్రీ ఒకప్పుడు నిరంతరం వార్తల్లో నిలిచేది. ఫర్హాన్ అక్తర్ `డాన్`లో వీరిద్దరూ మొదటి సారి జంటగా నటించారు. ఆ ఇద్దరి నడుమా కెమిస్ట్రీలో స్పార్క్ ఉందని అభిమానులు విస్మయం చెందారు. అదే క్రమంలో ఖాన్ సరసన ప్రియాంక చోప్రా వరుస చిత్రాల్లో అవకాశాలు అందుకోవడంతో రకరకాల రూమర్లు పుట్టుకొచ్చాయి. డాన్ తర్వాత ఆ ఇద్దరి మధ్యా సాన్నిహిత్యం గౌరీఖాన్ కి నచ్చలేదని తన స్నేహితుడు కరణ్ జోహార్ అండతో కుట్ర చేసిందని కథనాలొచ్చాయి. నిజానికి పీసీ హిందీ సినీరంగప్రవేశం చేయక ముందే కింగ్ ఖాన్ షారూఖ్ తో ఒకరకంగా అనుబంధం కలిగి ఉంది. ఆసక్తికరంగా ప్రియాంక పాల్గొన్న మిస్ ఇండియా ఫైనలిస్ట్ ఎంపికల్లో జడ్జిగా ఖాన్ వ్యవహరించారు. ఆ పోటీలో అతడి నుంచి ఒక క్లిష్ఠమైన ప్రశ్నను పీసీ ఎదుర్కొంది.
ఫైనల్స్ పోటీలో జడ్జిలలో ఒకరైన మిస్టర్ ఖాన్ ఫైనలిస్ట్ కంటెస్టెంట్ అయిన పీసీని ఒక ఆసక్తికరమైన ప్రశ్న అడిగారు. అందాల రాణి ప్రియాంక చోప్రాకు వివాహం చేసుకోవడానికి మూడు రంగాల నుంచి ముగ్గురు ప్రముఖ వ్యక్తుల లభ్యతపై ఆప్షన్ ని ఇచ్చాడు. అంతేకాదు ఆ ముగ్గురిలో ఉన్న తననే పీసీ ఎంపిక చేసుకుంటుందని కూడా సరదాగా వ్యాఖ్యానించాడు. కానీ పీసీ సమాధానం ఆశ్చర్యం కలిగించింది. తన ఎంపిక అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ ఆసక్తికరమైన ఎపిసోడ్ ని ఎవరూ మర్చిపోలేరు.
మిస్ ఇండియా 2000 ఫైనలిస్టుని ప్రకటించిన సందర్భంగా పీసీని మిస్టర్ ఖాన్ ఒక జడ్జి హోదాలో ప్రశ్నించారు. పీసీని చూస్తూ ``నేను మీలాగే తెలివైనవాడినే.. అందగత్తె సమక్షంలో సౌమ్యంగా ఉంటాను`` అని పీసీని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నించాడు. అక్కడితో ఆగకుండా చాలా సుదీర్ఘమైన ప్రశ్న అడిగాడు. మీరు క్రింది వారిలో ఒకరిని వివాహం చేసుకుంటే అది ఎవరు? చెప్పండి.. అంటూ గ్యాలరీలో ఉన్న అజహర్ భాయ్ (నాటి టీమిండియా కెప్టెన్) లాంటి భారతీయ క్రీడాకారుడు.. మిమ్మల్ని ప్రపంచమంతా తీసుకెళ్ళి మీ దేశాన్ని మిమ్మల్ని గర్వించేలా చేస్తాడు. లేదా స్వరోవ్ స్కీ వంటి ఉచ్చారణ కష్టతరమైన పేరుగల కళాత్మక వ్యాపారవేత్త ఇక్కడ ఉన్నారు. అతను మిమ్మల్ని ఖరీదైన ఆభరణాలు చక్కటి హారాలతో అలంకరిస్తాడు. మీరు మీ ఇంటికి ఎప్పటికీ షాన్డిలియర్ ని కొనుగోలు చేయవలసిన అవసరం లేదు.
అయితే మూడవ ప్రశ్న.. ఏంటి అంటే.. మీరు నాలాంటి హిందీ చలనచిత్ర నటుడిని పెళ్లాడుతారు! అంటూ కొంత గర్వంగానే అన్నాడు. ఇలాంటి ఊహాజనిత వివాహ ప్రతిపాదన గురించి సంక్లిష్టమైన ఎంపిక మీ ముందు ఉంచాను. మీరు సమాధానం చెప్పే ముందు... జవాబు ఏదైనప్పటికీ జడ్జిగా నా మార్కులను పక్షపాతంతో వేయను. అజర్ భాయ్- స్వరోవ్ స్కీని మీరు పట్టించుకోరని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను... అని ఖాన్ సరదాగా వ్యాఖ్యానించారు.
అయితే ఈ సుదీర్ఘ ప్రశ్నకు సమాధానమిచ్చిన ప్రియాంక చోప్రా ఈ మూడు ఎంపికలు ఎంత కష్టమైనవో తాను ఊహించగలనని ఒప్పుకుంది. కానీ చాలా స్పాంటేనియస్ ఆన్సర్ తో అక్కడ ఉన్న వారందరినీ ఆకట్టుకుంది. సమాధానం విషయంలో పీసీ చాలా స్పష్టంగా ఉంది. ``నేను ఈ ముగ్గురిలో ఎవరిని ఎంచుకోవాలి? అని ఆలోచిస్తే.. క్రీడాకారుడినే ఎంపిక చేసుకుంటాను...`` అని ఠకీమని చెప్పేసింది. ఆ క్షణం ప్రేక్షకుల నుండి ఉరుములు మెరుపులతో కూడిన కరతాళ ధ్వనులు వినిపించాయి. ఎందుకంటే నేను ఇంటికి తిరిగి వచ్చినప్పుడు లేదా నా భర్త ఇంటికి తిరిగి వచ్చినప్పుడు భారతదేశ సేవికుడిగా అతని గురించి గర్వపడతాను. అతడికి మద్దతుగా నేను ఉంటాను. ``ఏయ్ చూడు.. నువ్వు బాగా ఆడావు.. నువ్వే బెస్ట్!`` అని పొగిడేస్తాను. నా భర్త నా దేశం గర్వించే విజయాలను తీసుకురాగలిగే బలమైన వ్యక్తిత్వం కలిగి ఉంటే గర్వపడతాను! అని పీసీ తెలిపింది.
నిజానికి ఆరోజు కింగ్ ఖాన్ షారూఖ్ గెస్ మాత్రమే పీసీ జీవితంలో నిజమైంది. గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా తానొకటి తలిస్తే దైవమొకటి తలచిన చందంగా ఒక నటుడిని మాత్రమే పెళ్లాడింది. గాయకుడు కం నటుడు నిక్ జోనాస్ ని పెళ్లాడి లైఫ్ లో సంతోషంగా ఉంది. ఈ జంటకు మాల్తీ మేరీ అనే కుమార్తె జన్మించింది. నాటి ఊహ ప్రకారం... క్రీడాకారుడిని పెళ్లాడాలనే పీసీ ఆశ మాత్రం నెరవేరలేదు. అయినా తనను ప్రేమించానని పెళ్లాడుతానని ప్రపోజ్ చేసిన నిక్ జోనాస్ ని వెంటనే పెళ్లాడి ఘటికురాలినని నిరూపించింది. పెళ్లిళ్లు స్వర్గంలో జరుగుతాయి. వాటిని భూమ్మీద ఎవరూ నిర్ణయించలేరని పెద్దలు అంటారు. అందువల్ల అన్ని గెస్ లు నిజాలు కావు అన్నమాట!