ట్విట్టర్లో ‘జవాన్’ వార్
షారుఖ్ ఖాన్ సినిమా జవాన్ ఇంకొన్ని గంటల్లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
By: Tupaki Desk | 7 Sep 2023 5:53 AM GMTషారుఖ్ ఖాన్ సినిమా జవాన్ ఇంకొన్ని గంటల్లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఐతే ముందు రోజంతా ఈ సినిమా మీద ట్విట్టర్లో పెద్ద ఎత్తున హ్యాష్ ట్యాగ్ వార్ నడుస్తోంది. ముందేమో బాయ్‌కాట్ జవాన్ అంటూ ఒక హ్యాష్ ట్యాగ్ హల్ చల్ చేసింది. తర్వాతేమో అన్‌ప్యారల్ సక్సెస్ అంటూ ఇంకో హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అయింది. బాలీవుడ్లో పెద్ద సినిమాలు రిలీజవుతుంటే బాయ్‌కాట్ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ కావడం కొత్తేమీ కాదు. ఇలా పదుల సంఖ్యలో సినిమాలు నెగెటివిటీని ఎదుర్కొన్నాయి. ఒక బ్యాచ్ అదే పనిగా హిందీ సినిమాలను కొన్నేళ్లుగా టార్గెట్ చేస్తూ ఉంది. ముఖ్యంగా హిందూ అతివాద బ్యాచ్ ముస్లిం హీరోలను ఇలాంటి నెగెటివ్ హ్యాష్ ట్యాగ్స్‌తో టార్గెట్ చేస్తోందనే ఆరోపణలున్నాయి. ఒక దశ వరకు వాళ్ల ఆటలు బాగానే సాగాయి. కానీ ఈ బాయ్‌కాట్ ఉద్యమం శ్రుతి మించడం.. వాటి వెనుక చెడు ఉద్దేశాలున్నాయని నెటిజన్లు అర్థం చేసుకోవడంతో వీటిని తిప్పికొట్టడం మొదలుపెట్టారు.
షారుఖ్ చివరి సినిమా జవాన్ మీద కూడా ఈ బాయ్‌కాట్ బ్యాచ్ విషం చిమ్మాలని చూస్తే.. షారుఖ్ అభిమానులే కాక న్యూట్రల్ నెటిజన్లు కూడా తిరగబడ్డారు. బాయ్‌కాట్ ఉద్యమం కాస్తా బూమరాంగ్ అయి సినిమాకు సానుభూతి వచ్చింది. అది భారీ ఓపెనింగ్స్‌కు దారి తీసింది. సినిమా అనుకున్నదానికంటే పెద్ద విజయం సాధించింది. అది బాయ్‌కాట్ బ్యాచ్‌కు చెంపపెట్టులా మారింది. ఐతే షారుఖ్ కొత్త సినిమా మీద కూడా అదే తరహాలో నెగెటివిటీ స్ప్రెడ్ చేయాలని చూశారు. షారుఖ్ పాత కామెంట్లు పట్టుకుని.. ఇంకేవో కారణాలు చూపించి జవాన్‌ను బాయ్‌కాట్ చేయాలంటూ హ్యాష్ ట్యాగ్ పెట్టి వైరల్ చేయడం మొదలుపెట్టారు. హిందూ సనాతన ధర్మాన్ని తూలనాడిని ఉదయనిధి స్టాలిన్.. జవాన్ సినిమాను తమిళనాడులో రిలీజ్ చేస్తున్నాడంటూ అది కూడా బాయ్‌కాట్ చేయడానికి ఒక కారణంగా చూపించారు. కానీ కాసేపటికే షారుఖ్ ఫ్యాన్స్ రిటార్ట్ మొదలుపెట్టారు. జవాన్ సినిమా, షారుఖ్ మీద పాజిటివ్ హ్యాష్ ట్యాగ్స్ పెట్టి వాటిని వైరల్ చేశారు. ఇలా రోజంతా ఈ వార్ నడిచింది. ఐతే నెగెటివిటీ ప్రస్తుతానికి జవాన్ మీద ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపుతున్నట్లు కనిపించడం లేదు.