Begin typing your search above and press return to search.

బాలీవుడ్ లో 'జ‌వాన్' చ‌రిత్రకెక్కింది!

షారుక్ ఖాన్ క‌థానాయ‌కుడిగా న‌టించిన `జ‌వాన్` బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డు వ‌సూళ్ల‌తో దూసుకుపోతున్న సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   30 Sep 2023 10:13 AM GMT
బాలీవుడ్ లో జ‌వాన్ చ‌రిత్రకెక్కింది!
X

షారుక్ ఖాన్ క‌థానాయ‌కుడిగా న‌టించిన `జ‌వాన్` బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డు వ‌సూళ్ల‌తో దూసుకుపోతున్న సంగ‌తి తెలిసిందే. రిలీజ్ అయి నెల రోజులు గ‌డుస్తున్నా! థియేట‌ర్లు ఇంకా హౌస్ క‌లెక్ష‌న్ల‌తో క‌ళ‌క‌ళ‌లాడు తున్నాయి. ఇప్ప‌టికే వ‌ర‌ల్డ్ వైడ్ 1043 కోట్ల కు పైగా వ‌సూళ్ల‌ని సాధించింది. తాజాగా సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్ వ‌ద్ద స‌రికొత్త రికార్డు సృష్టించింది. కేవ‌లం హిందీ వెర్ష‌న్ లో 584 కోట్లు రాబ‌ట్టింది. దీంతో హిందీ ప‌రిశ్ర‌మ‌లో అత్య‌ధిక వ‌సూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.

ఇంత‌కు ముందు ఈ రికార్డు `గ‌ద‌ర్ -2` పేరిట ఉండేది. తాజాగా ఆ రికార్డును `జ‌వాన్` బ్రేక్ చేసింది. ఈ విష‌యాన్ని రెడ్ చిల్లీస్ ఎంట‌ర్ టైన్ మెంట్ అధికారికంగా ఓ పోస్ట‌ర్ వేసి ప్ర‌క‌టించింది. దీంతో షారుక్ అభిమానులు సంబ‌రాలు చేసుకుంటున్నారు. ఇప్ప‌టికే షారుక్ గ‌త సినిమా ప‌ఠాన్ 1000 కోట్ల‌కు పైగా వ‌సూళ్లు సాధించిన సంగ‌తి తెలిసిందే. ఆ వెంట‌నే జ‌వాన్ (1000కోట్లు) రూపంలో అంచ‌నాలు మించి దూసుకుపోతుంది.

స్థానిక వ‌సూళ్ల‌లోనూ రికార్డు సృష్టించ‌డంతో షారుక్ పేరు ఇంటా బ‌య‌టా మారుమ్రోగిపోతుంది. రికార్డుల కా బాప్ అంటూ అభిమానులు సోష‌ల్ మీడియా వేదికంగా సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. `డంకీ`తోనూ షారుక్ భాయ్ ఇదే జోరు కొన‌సాగిస్తార‌ని ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. మొత్తానికి షారుక్ రూపంలో బాలీవుడ్ కి అతి పెద్ద ఊర‌ట ల‌భించింద‌ని చెప్పొచ్చు. కోవిడ్ ద‌గ్గ‌ర నుంచి స‌రైన విజ‌యాలు లేవ‌ని బాలీవుడ్ తీవ్ర విమ‌ర్శ‌లు మూట‌గ‌ట్టుకున్న సంగ‌తి తెలిసిందే.

భారీ అంచనాల మ‌ధ్య రిలీజ్ అయిన సినిమాల‌న్నీ భారీ న‌ష్టాలు తెచ్చిపెట్టాయి. మ‌రోవైపు ఇత‌ర ప‌రిశ్ర‌మ‌ల నుంచి రిలీజ్ అయిన సినిమాలో భారీ వ‌సూళ్లు సాధిస్తున్నాయి. దీంతో హిందీ ప‌రిశ్ర‌మ‌లో మ‌రింత విమ‌ర్శ‌ల‌కు గురైంది. స‌రిగ్గా ఇదే స‌మ‌యంలో `ప‌ఠాన్` విజ‌యం తో ఇండ‌స్ట్రీకి బూస్టింగ్ లా నిలిచింది. తాజాగా `జ‌వాన్` విజ‌యంతో ఆ ఉత్సాహం రెట్టింపు అయింది.