హాలీవుడ్‌కి వెళితే దిగజారకూడదన్న కింగ్
ప్రజలకు ఎక్కువగా తెలియని భారతీయ నటీనటులు, సాంకేతిక నిపుణులు హాలీవుడ్ లో చాలామంది ఉన్నారు.
By: Tupaki Desk | 15 Aug 2024 5:30 PM GMTబాలీవుడ్ నుంచి చాలా మంది స్టార్లు హాలీవుడ్ కి వెళ్లారు. అక్కడ సత్తా చాటారు. ఇర్ఫాన్ ఖాన్, దీపిక పదుకొనే, ప్రియాంక చోప్రా, టబు, ఐశ్వర్యారాయ్, అనీల్ కపూర్, నర్గీస్ ఫక్రీ సహా ఎందరో హాలీవుడ్ కి వెళ్లి నిరూపించారు. ఇటీవలే మంకీ మ్యాన్ చిత్రంతో దేవ్ పటేల్ కూడా హాలీవుడ్ లో ప్రవేశించాడు. తెలుగమ్మాయి అవంతిక సైతం హాలీవుడ్ లో రాణిస్తోంది. ప్రజలకు ఎక్కువగా తెలియని భారతీయ నటీనటులు, సాంకేతిక నిపుణులు హాలీవుడ్ లో చాలామంది ఉన్నారు.
అయితే ఇంతమంది తారలు హాలీవుడ్ లో చోటు దక్కించుకుంటే, భారతదేశాన్ని ఏల్తున్న కింగ్ ఖాన్ షారూఖ్ ఎందువల్ల ఇన్నేళ్లలో హాలీవుడ్ కి వెళ్లలేదు? ఇదే ధర్మ సందేహం అభిమానులకు కలిగింది. మీడియా దీనిని ప్రశ్నించింది. దానికి కింగ్ ఖాన్ షారూఖ్ సమాధానం ఎంతమాత్రం ఆశ్చర్యపరచలేదు. దానికి కారణం అతడు హాలీవుడ్ కి వెళితే తనపై ఉండే అంచనాలకు తగ్గట్టే, తన అభిమానులకు నచ్చే పాత్రలో అవకాశం కావాలని కోరుకున్నారు. తన గౌరవాన్ని తగ్గించేది లేదా తన ఫ్యాన్స్ ని నిరాశపరిచేది అయితే తాను నటించడానికి సిద్ధంగా లేడు. దిగజార్చేది ఏదీ చేయకూడదనేది అతడి ఆలోచన. వెరైటీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో SRK తాను ఇంకా హాలీవుడ్‌లోకి ఎందుకు ప్రవేశించలేదు? అన్నది ఓపెనయ్యాడు.
హాలీవుడ్ పెద్ద పరిశ్రమ. ఇంకా అక్కడ నేను ఎంచుకునేంత స్థాయిలో లేను. షరతులు పెట్టే స్థితిలో ఉన్నానని అనుకోను. కానీ అవకాశం వచ్చినప్పుడు - నేను తగినంతగా ఇంగ్లీష్ మాట్లాడగలనని ఆశిస్తున్నాను! అంటూ తనదైన ఫన్, సర్కాజమ్ ని జోడించి మాట్లాడారు షారూఖ్. భారతీయ ప్రేక్షకులు నాకు ఇచ్చిన హోదాకు తగిన పాత్ర కావాలి. ఎవరూ నిరాశ చెందకూడదు. నేను ఒక భారతీయ కథను ప్రపంచవ్యాప్తంగా అంగీకరించాలని కోరుకుంటున్నాను. నేను దానిలో చిన్న భాగం కాగలనని ఆశిస్తున్నాను! అని కూడా ఖాన్ తన మనసులో మాట బయటపెట్టారు.
నేను చాలా చంచలంగా సంతోషంగా వెళతాను. కానీ ప్రజలు నన్ను ఎంతగా ఆరాధిస్తారో.. దానికి తగ్గట్టుగా ఉంటాను. నేను వారిని పూర్తిగా గౌరవిస్తాను. నేను చేసే పనిని ప్రజలు ఆసక్తిగా చూస్తారు. వారు నాకు చాలా గౌరవం ఇచ్చారు. నాకు, నా కుటుంబానికి మన దేశంలో ఉపఖండంలో ప్రతిదాన్ని అందించారు. హిందీ సినిమా లేదా హాలీవుడ్ సినిమా లేదా ఇంకేదైనా దానికి నేను పూర్తి బాధ్యత వహిస్తాను! అని అన్నారు. ఏదైనా సినిమాలో నేను ఒక పాత్రను పోషించేటప్పుడు నాకు దక్కాల్సిన గౌరవం ముఖ్యం. కాబట్టి నాకు అలాంటి పాత్రను ఎవరూ ఆఫర్ చేయలేదని నేను అనుకోను. నాకు అక్కడ ఏజెంట్ లేరు. నిజం చెప్పాలంటే నేను కూడా దాని కోసం వెతకలేదు! అని ఖాన్ వెల్లడించారు. ఒక పెద్ద హాలీవుడ్ సినిమాను చూసినట్టు ఒక భారతీయ సినిమాను ప్రేక్షకులంతా చూడాలనేది నా కల అని కూడా అన్నారు.
షారుఖ్ ఖాన్ తదుపరి ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ `కింగ్`లో కనిపించనున్నాడు. సుజోయ్ ఘోష్ దీనికి దర్శకుడు. ఈ సినిమా గురించి ఖాన్ మాట్లాడుతూ ``ఇది యాక్షన్ డ్రామా.. ఇది హిందీ చిత్రం. ఆసక్తికరంగా ఉంటుంది. నేను కొంతకాలంగా అలాంటి సినిమా చేయాలనుకుంటున్నాను. ఏడెనిమిదేళ్లుగా ఇలాంటిది కావాలనుకున్నాను. సుజోయ్ సరైన ఎంపిక అని మేం భావించాం. ఎందుకంటే ఇది చాలా ఎమోషనల్‌గా కరెక్ట్‌గా ఉండాలని మేం కోరుకుంటున్నాము. కూల్, మాస్, యాక్షన్, ఎమోషనల్ సినిమా చేయడానికి అందరం కలిసి పని చేస్తున్నాం`` అన్నారు.