రెడ్ కార్పెట్‌పై నుంచి వృద్ధుడిని నెట్టేసిన స్టార్ హీరో
కింగ్ ఖాన్ షారూఖ్ ఏ వేడుకకు వెళ్లినా అక్కడ విపరీతమైన సందడి నెలకొంటోంది
By: Tupaki Desk | 13 Aug 2024 4:30 PM GMTకింగ్ ఖాన్ షారూఖ్ ఏ వేడుకకు వెళ్లినా అక్కడ విపరీతమైన సందడి నెలకొంటోంది. పఠాన్-జవాన్-డుంకీ చిత్రాలతో వరుస విజయాలు అందుకున్న షారూఖ్, ఐపీఎల్ లోను తన కేకేఆర్ టీమ్ ని గెలిపించుకుని రెట్టింపు ఉత్సాహంలో ఉన్నాడు. ఇటీవల వరుస ఈవెంట్లలోను పాల్గొంటున్నాడు. ప్రస్తుతం ఓ విదేశీ అవార్డుల ఈవెంట్లో అతడు అరుదైన గౌరవం అందుకున్నాడు. అదే సమయంలో అతడి పేరు రాంగ్ రీజన్స్‌తో మీడియా హెడ్ లైన్ లోకి వచ్చింది.
ఇటీవల జరిగిన 77వ లోకర్నో ఫిల్మ్ ఫెస్టివల్‌లో 'కెరీర్ అచీవ్‌మెంట్ అవార్డు'తో సత్కారం అందుకున్న తొలి భారతీయ స్టార్‌గా షారుక్ ఖాన్ చరిత్ర సృష్టించాడు. స్విట్జర్లాండ్‌లో జరిగిన ఈ ఫెస్టివల్‌లో అతడి ఘనమైన ఎంట్రీ సహా ప్రసంగానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అయితే ఈ వీడియోల్లో ఒక క్లిప్ అందరి దృష్టిని విపరీతంగా ఆకర్షించింది. దానికి కారణం.. షారూఖ్ ఫోటోలకు పోజులిచ్చేటప్పుడు రెడ్ కార్పెట్ పై ఉన్న ఒక వృద్ధుడిని నెట్టివేస్తున్నట్లు కనిపించింది. క్లిప్‌లో సూపర్‌స్టార్ కెమెరాలకు పోజులిస్తుండగా..కెమెరామెన్‌లు SRK ఫోటోల్ని తీయడానికి ఫ్రేమ్ నుంచి ఒక వృద్ధుడిని పక్కకు పంపాలని కోరడంతో షారూఖ్ ఆ వ్యక్తి వద్దకు వెళ్లి అతడిని నెమ్మదిగా నెట్టాడు.
కానీ ఇది నెటిజనులకు మరోలా కనిపించింది. ఖాన్ పరిహాసం సరికాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అతడు పరిహాసానికి దిగినా కానీ, ఆ వీడియోని చూపిస్తూ ఇది సరికాదని కొందరు దూషించారు. అతడి ప్రవర్తనను తప్పు పట్టారు. అయితే సోషల్ మీడియాల్లో షారూఖ్ అభిమానులు తమ ఫేవరెట్ ని సమర్థించారు. తమ దేవుడు ప్రజల విషయంలో మర్యాదపూర్వకంగా ప్రవర్తిస్తాడని .. ఆ వృద్ధుడు షారూఖ్ కి బాగా తెలిసిన వ్యక్తి అని సర్ధి చెబుతున్నారు. అంతేకాదు ఆ వ్యక్తితో కలిసి షారూఖ్ రెడ్ కార్పెట్ మీద నడుస్తున్న వీడియో క్లిప్‌ను షేర్ చేస్తున్నారు.
ఇదే ఈవెంట్లో షారూఖ్ ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. అవార్డులు ఉత్సాహం నింపుతాయని, తనను నటుడిగా ముందుకు సాగడానికి, మరిన్ని గొప్ప ప్రయత్నాలు చేయడానికి సహకరిస్తాయని కింగ్ ఖాన్ అన్నారు. కెరీర్ మ్యాటర్ కి వస్తే.. SRK తదుపరి 'కింగ్'లో నటిస్తున్నాడు. ఇందులో ఆయన కుమార్తె సుహానా ఖాన్ కీలక పాత్రలో నటిస్తుండగా, అభిషేక్ బచ్చన్ మరో ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నారు. సుజోయ్ ఘోష్ దర్శకత్వం వహిస్తున్నారు.