Begin typing your search above and press return to search.

శంకర్‌ ఆ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ కష్టమేనా?

శంకర్‌ గత కొన్ని సంవత్సరాలుగా ఏ సినిమా తీసినా ఆ సినిమా నిర్మాతలకు లాభాలు కాదు కదా పెట్టుబడి కూడా రావడం లేదు.

By:  Tupaki Desk   |   28 Feb 2025 2:00 PM IST
శంకర్‌ ఆ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ కష్టమేనా?
X

ఇండియన్‌ 2 సినిమాతో దర్శకుడు శంకర్‌ పై నమ్మకం తగ్గింది. గేమ్‌ ఛేంజర్‌ సినిమాతో శంకర్ ఇకపై ఒకప్పుడు తీసిన గొప్ప సినిమాల మాదిరిగా సినిమాలను తీయలేడని కన్ఫర్మ్‌ అయింది. ఈ మాట ఎవరో అంటున్న మాట కాదు... ఆయనను విపరీతంగా అభిమానించే అభిమానులు అంటున్న మాట. ఆయన సినిమాలు అంటే పడి చచ్చే వారు సైతం ఇప్పుడు ఆయన సినిమాలు తీయక పోవడం మంచిది అనే అభిప్రాయంను వ్యక్తం చేస్తున్నారు. శంకర్‌ సినిమా అంటే ప్రేక్షకులు, ఫ్యాన్స్ మాత్రమే కాకుండా నిర్మాతలు కూడా భయపడే పరిస్థితి నెలకొంది. శంకర్‌ గత కొన్ని సంవత్సరాలుగా ఏ సినిమా తీసినా ఆ సినిమా నిర్మాతలకు లాభాలు కాదు కదా పెట్టుబడి కూడా రావడం లేదు.

ఇండియన్ 2 సినిమాతో లైకా ప్రొడక్షన్స్ వారు భారీ మొత్తంలో నష్టపోయారు. ఐ సినిమాతోనూ నిర్మాతలు నష్టపోయిన విషయం తెల్సిందే. గత పదేళ్లుగా శంకర్‌కి గడ్డు కాలం కొనసాగుతున్న విషయం తెల్సిందే. ఆయన చేసిన ప్రతి సినిమా బాక్సాఫీస్‌ వద్ద బొక్క బోర్లా పడుతూనే ఉంది. అయినా ఇన్నాళ్లు ఆయన సినిమాలు చేశాడు, ఆయనతో సినిమాలను చేసేందుకు నిర్మాతలు ముందుకు వచ్చారు. కానీ ఇకపై ఆ పరిస్థితి కనిపించడం లేదు. గేమ్‌ ఛేంజర్ సినిమాతో దిల్‌ రాజు ఎంత నష్టపోయాడు అంటే గతంలో ఎప్పుడూ లేనంతగా అనే సమాధానం వస్తుంది. ఒకానొక సమయంలో దిల్‌ రాజు గేమ్‌ ఖతం అనే స్థాయిలో ప్రచారం జరిగింది. లక్కీగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ఆయన బయట పడ్డాడు.

శంకర్‌తో సినిమా అంటే ఇప్పటికీ కొందరు హీరోలు ఆసక్తిగా ఉన్నా నిర్మాతలు మాత్రం రిస్క్ చేయడం మా వల్ల కాదు బాబోయ్‌ అంటూ చేతులు ఎత్తేస్తున్నారు. శంకర్‌తో సినిమాను చేయాలి అంటే వందల కోట్ల బడ్జెట్‌ కావాల్సిందే. పాటలకు పదుల కోట్లు ఖర్చు చేసే అలవాటు ఉన్న శంకర్‌తో సినిమాను చేయాలి అంటే మా వల్ల కాదు అంటూ చాలామంది ముందే చెప్పేస్తున్నారు. శంకర్‌ ప్రస్తుతం కొత్త ప్రాజెక్ట్‌ను మొదలు పెట్టేందుకు రెడీ అవుతున్నాడు. అయితే ఆయనకు భారీగా డబ్బులు పెట్టేందుకు నిర్మాత కావాల్సి ఉంది. కానీ ఆ నిర్మాత ఎవరు అనేది ఇంకా స్పష్టత లేదు. పలువురు నిర్మాతల వద్దకు శంకర్‌ వెళ్లారని తెలుస్తోంది.

చాలా ఏళ్లుగా శంకర్‌ 'వెల్పారి' అనే ప్రాజెక్ట్ చేయాలని కోరుకుంటున్నాడు. తమిళ నవల వెల్పారి హక్కులు కొనుగోలు చేసి సినిమాగా మలిచేందుకు సైతం శంకర్ గతంలో వర్క్ స్టార్ట్‌ చేశాడు. అయితే ఆ సినిమాను చేసేందుకు కాస్త ఎక్కువ బడ్జెట్‌ కావాల్సి ఉందని, అంతే కాకుండా స్టార్‌ కాస్ట్‌ కూడా చాలా పెద్దగా అవసరం ఉందని ఇన్నాళ్లు వెయిట్‌ చేశాడు. ఇప్పుడు శంకర్‌ని నమ్మి ఆ సినిమాలో నటించేందుకు స్టార్స్‌ సిద్ధంగా లేరు, అంత భారీ బడ్జెట్‌ను ఖర్చు చేసేందుకు నిర్మాతలు సిద్ధంగా లేరు. కనుక శంకర్ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ కష్టమే అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.