పార్ట్ 3 అటకెక్కినట్లేనా...?
కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో దాదాపు ముప్పై ఏళ్ల క్రితం వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్ ఇటీవల వచ్చింది.
By: Tupaki Desk | 2 Dec 2024 5:45 AM GMTకమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో దాదాపు ముప్పై ఏళ్ల క్రితం వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్ ఇటీవల వచ్చింది. ప్రారంభించిన నాలుగు అయిదు సంవత్సరాలకు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పలు కారణాల వల్ల సినిమా వాయిదాలు పడుతూ వచ్చింది. ఒకానొక సమయంలో సినిమా అసలు వచ్చే అవకాశం ఉందా అని అంతా భావించారు. కమల్ విక్రమ్ సూపర్ హిట్ కావడంతో ఇండియన్ 2 సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు దర్శకుడు శంకర్ తిరిగి వర్క్ మొదలు పెట్టారు. ఈ ఏడాదిలో ఇండియన్ 2 సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఇండియన్ 2 సినిమా బిగ్గెస్ట్ ఫ్లాప్‌గా బాక్సాఫీస్ వద్ద నిలిచింది.
ఇండియన్ 2 సినిమా విడుదల సమయంలో పార్ట్ 3 ఉంటుంది అంటూ అధికారికంగా ప్రకటించారు. షూటింగ్ సైతం పూర్తి చేశారని, అసలు కథ పార్ట్ 3లోనే ఉంటుంది అంటూ ప్రమోషన్ సమయంలో చెప్పుకొచ్చారు. దాంతో పార్ట్ 3 పై అంచనాలు, ఆసక్తి పెరిగింది. కానీ ఇండియన్ 2 సినిమాలో మ్యాటర్ లేదని, పార్ట్ 3 లో ఏం ఉంటుంది అనే అభిప్రాయంను పలువురు వ్యక్తం చేస్తున్నారు. పార్ట్ 2 వచ్చిన ఆరు నెలల లోపు పార్ట్ 3 తో వస్తామని దర్శకుడు శంకర్‌తో పాటు ఇతర యూనిట్ సభ్యులు ప్రకటించారు. కానీ ఇప్పుడు పార్ట్ 3ని అటకెక్కించారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
శంకర్ గత చిత్రాల ఫలితాల నేపథ్యంలో ఇండియన్ 3 సినిమాను థియేటర్‌లో విడుదల చేయడం సాధ్యం కాదని ఇప్పటికే నిర్ణయించిన మేకర్స్ ఓటీటీ వారితో చర్చలు జరిపినట్లుగా ఆ మధ్య వార్తలు వచ్చాయి. కానీ ఇప్పటి వరకు ఏ విషయము గురించి క్లారిటీ ఇవ్వలేదు. అసలు ఇండియన్ 3 సినిమా ఒకటి ఉందని అంతా మరచి పోయారు అనిపిస్తోంది. ఇండియన్ 3 సినిమాను ఓటీటీ ద్వారా జనవరిలో స్ట్రీమింగ్ చేయాల్సి ఉన్నా ఇప్పటి వరకు ఎలాంటి హడావిడి లేకపోవడంతో సినిమాను విడుదల చేసి ట్రోల్ మెటీరియల్ చేయడం తప్ప మరేం లేదు అని వారు భావిస్తూ ఉన్నారు అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.
శంకర్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన గేమ్ ఛేంజర్ సినిమా జనవరిలో సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఆ సినిమా ఫలితాన్ని బట్టి ఇండియన్ 3 సినిమా ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే విషయమై చర్చించే అవకాశాలు ఉన్నాయి. గేమ్ ఛేంజర్ భారీ విజయాన్ని సొంతం చేసుకుంటే ఇండియన్ 3 ని థియేటర్ రిలీజ్ కి రెడీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఒక వేళ ఫలితం తారుమారు అయితే అప్పుడు ఇండియన్ 3 మేకర్స్ ఏం చేస్తారు అనేది చూడాలి. కమల్ హాసన్ లుక్ విషయంతో పాటు, కథ పై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఇండియన్ 3 సినిమా విడుదల విషయంలో గందరగోళం నెలకొంది.