గేమ్ ఛేంజర్ : శంకర్‌కి ఆ విషయంలో అసంతృప్తి
చాలా కష్టపడి తీసిన ఆ సన్నివేశాలు తొలగించడం బాధగా అనిపించింది. సినిమాలోని కీలక సన్నివేశాలను ట్రిమ్ చేయడం అసంతృప్తిని కలిగించింది అంటూ శంకర్ పేర్కొన్నారు.
By: Tupaki Desk | 15 Jan 2025 6:25 AM GMTరామ్ చరణ్ డ్యూయెల్ రోల్‌లో నటించిన గేమ్ ఛేంజర్ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాకు భారీ వసూళ్లు నమోదు అవుతున్నాయి అంటూ చిత్ర యూనిట్ సభ్యులు సోషల్ మీడియా ద్వారా కలెక్షన్స్ పోస్టర్స్‌ను షేర్ చేస్తున్నారు. ఆ కలెక్షన్స్ పోస్టర్స్‌పై రామ్ గోపాల్ వర్మతో పాటు ఎంతో మంది నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. ఆ విషయాన్ని పక్కన పెడితే గేమ్ ఛేంజర్ సినిమా దర్శకుడు శంకర్ ఇటీవల ఒక తమిళ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సినిమాను తాము తీసినప్పుడు ఏకంగా అయిదు గంటల నిడివితో వచ్చిందని చెప్పుకొచ్చాడు. అందులో సగానికి పైగా ట్రిమ్ చేశామని పేర్కొన్నాడు.
సినిమాలోని హీరో హీరోయిన్ లవ్ ట్రాక్, కామెడీ ట్రాక్, కొన్ని యాక్షన్ సన్నివేశాలు, పాటలు ఇలా చాలా వరకు తొలగించాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నాడు. చాలా కష్టపడి తీసిన ఆ సన్నివేశాలు తొలగించడం బాధగా అనిపించింది. సినిమాలోని కీలక సన్నివేశాలను ట్రిమ్ చేయడం అసంతృప్తిని కలిగించింది అంటూ శంకర్ పేర్కొన్నారు. ఈమధ్య కాలంలో పెద్ద హీరోల సినిమాలు మూడు గంటలకు పైగా ఉంటున్నాయి. కానీ ఈ సినిమా మూడు గంటల లోపు నిడివితో వచ్చింది. మరీ ఎక్కువ ల్యాగ్ చేయకుండా క్రిస్పీగా ఉండే విధంగా నిర్మాత దిల్ రాజు ఈ ప్లాన్ చేశారు అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
చాలా సినిమాలు మూడు గంటలు అంతకు మించిన నిడివితో ప్రేక్షకుల ముందుకు వచ్చి నెగటివ్ టాక్ వచ్చిన తర్వాత రెండు మూడు రోజులకు కట్ చేసి కొత్త వర్షన్‌ను విడుదల చేయడం మనం చూస్తూ ఉంటాం. అందుకే గేమ్ ఛేంజర్ సినిమా నుంచి అనవసర సన్నివేశాలను తొలగించి ప్రేక్షకులను ట్రాక్ లోనే ఉంచి, కథ నుంచి డైవర్ట్ కాకుండా జాగ్రత్తగా ఎడిట్ చేసినట్లుగా అనిపిస్తుంది. అయితే ఎడిటింగ్ విషయంలో దర్శకుడు శంకర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్నాయి. అదేంటి శంకర్ సర్‌కి తెలియకుండానే ఎడిటింగ్ జరిగిందా అనే అనుమానాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు.
రామ్ చరణ్ కి జోడీగా ఈ సినిమాలో కియారా అద్వానీ నటించింది. అంజలి కీలక పాత్రలో నటించింది. సునీల్ తన కామెడీతో నవ్వించలేక పోయాడు. బ్రహ్మానందం ఒక్క సన్నివేశంలో కనిపించి పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. మొత్తంగా గేమ్ ఛేంజర్ సినిమాకు పండుగ కలిసి రావడంతో మంచి వసూళ్లు నమోదు అవుతున్నాయి. విడుదలైన మూడు నాలుగో రోజు సైతం బాక్సాఫీస్ వద్ద సందడి కనిపించడంకు కారణం పండుగ అనడంలో సందేహం లేదు. రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో సినిమాను చేస్తున్నాడు. ఇదే ఏడాదిలో ఆ సినిమా వస్తుందా అనేది చూడాలి.