అనురాగ్ కశ్యప్ విమర్శలను తిప్పికొట్టిన శంకర్
ది హాలీవుడ్ రిపోర్టర్ తో ఇంటర్వ్యూలో గేమ్ ఛేంజర్ మేకింగ్ పై శంకర్ విధానాన్ని తప్పు పడుతూ అనురాగ్ కశ్యప్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.
By: Tupaki Desk | 4 Jan 2025 2:26 PM GMTమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన భారీ పొలిటికల్ యాక్షన్ ఎంటర్ టైనర్ 'గేమ్ ఛేంజర్' సంక్రాంతి కానుకగా విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ది హాలీవుడ్ రిపోర్టర్ తో ఇంటర్వ్యూలో గేమ్ ఛేంజర్ మేకింగ్ పై శంకర్ విధానాన్ని తప్పు పడుతూ అనురాగ్ కశ్యప్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. అయితే అనురాగ్ వ్యాఖ్యలకు శంకర్ ఆశ్చర్యం వ్యక్తం చేసారు. తాను అన్నదానిని అనురాగ్ సరిగా అర్థం చేసుకోలేదని అన్నారు.
శంకర్ ఇన్‌స్టా రీల్స్ ని నేటితరం ఇష్టపడుతున్నారని, వేగంగా ఆలోచన మారుతుందని .. అందుకే అదే ఫార్ములాను 'గేమ్ ఛేంజర్'కు ఆపాదించానని వ్యాఖ్యానించగా, ఆ ఆలోచన సరికాదని అనురాగ్ అన్నారు. ప్రేక్షకులకు కోరుకునేది అందించడం అనే భావనను అనురాగ్ తప్పు పట్టాడు. ప్రేక్షకులు విభిన్న అభిరుచులు ఉన్న వ్యక్తుల కలయిక అని .. ఒక్కొక్కరికి ఒక్కోరకం నచ్చుతుందని అనురాగ్ అన్నారు.
అయితే దీనిని శంకర్ తాజా ఇంటర్వ్యూలో ఖండించారు. దర్శకుడు శంకర్ మాట్లాడుతూ ''రీల్స్ గురించి నేనేమీ చెప్పలేదు. ప్రజలు థియేటర్లలో కళ్లు తిప్పనివ్వనంతగా సినిమా ఉండాలి. ఒకవేళ వారు కళ్లు తిప్పేంత సమయం ఇస్తే మేకర్స్ ఫెయిలైనట్టే. ఆ రేంజులో సినిమా తీయాలి'' అని అభిప్రాయం వ్యక్తం చేసారు. ఎడిటర్ రూబెన్ గేమ్ ఛేంజర్ ను ఆ స్థాయిలో చూపించడంలో విజయం సాధించాడని కొనియాడారు. ఈ సినిమా ఎడిటింగ్ వల్ల వేగంగా కనిపిస్తుందని శంకర్ తెలిపారు. అనురాగ్ ఇలా అన్నారని నాకు తెలియదు.. ఆశ్చర్యపోతున్నానని కూడా శంకర్ అన్నారు.
ప్రస్తుత తరం ప్రేక్షకులు ఎంత అసహనానికి గురవుతున్నారనే విషయాన్ని ప్రస్తావించారు. కేవలం పది నిమిషాల్లో ప్రేక్షకులు తేలిగ్గా పరధ్యానంలో పడతారని, ఆ సమయంలో సోషల్ మీడియాలోకి వెళ్లి సినిమా గురించి మాట్లాడుకునే అవకాశం ఉందని దర్శకుడు అభిప్రాయపడ్డాడు. అయితే శంకర్ థియేటర్ లో కూర్చున్న ప్రేక్షకులకు గేమ్ ఛేంజర్ సమయం ఇవ్వదని.. ఇది వేగంగా సాగే స్క్రీన్ ప్లే తో ఆకట్టుకుంటుందని డల్లాస్ ప్రచార వేదికపై అన్నారు.
గేమ్ ఛేంజర్ లో రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా నటించారు. శంకర్ దర్శకత్వం వహించారు. ఇది భారీ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్. ఈ చిత్రంలో చరణ్ ఐఎఎస్ గా, ముఖ్యమంత్రిగా నటించారు. అతను రాజకీయ వ్యవస్థలో అవినీతిపై పోరాడుతూ న్యాయమైన ఎన్నికలను నిర్వహించడానికి పోరాడేవాడిగా కనిపిస్తాడు. ఇన్ స్టా రీల్స్ లాంటి సినిమా తీశానని శంకర్ ఎక్కడా అనలేదు. ఇన్ స్టా రీల్స్ చూసినంత ఈజీగా యూత్ గేమ్ ఛేంజర్ ని చూసేలా తీశానని మాత్రమే అన్నారు.