శంకర్.. 30 ఏళ్ల కెరీర్లో తొలిసారి!
దర్శకుడిగా శంకర్ వైభవం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. పేరుకు తమిళ దర్శకుడే కానీ.. తెలుగులోనూ ఆయన తిరుగులేని ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు.
By: Tupaki Desk | 16 July 2024 11:30 AM GMTదర్శకుడిగా శంకర్ వైభవం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. పేరుకు తమిళ దర్శకుడే కానీ.. తెలుగులోనూ ఆయన తిరుగులేని ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఆయన తొలి సినిమా ‘జెంటిల్‌మన్’ తమిళంతో పాటు తెలుగులోనూ బ్లాక్‌బస్టర్ అయింది. ఆ తర్వాత ప్రేమికుడు, భారతీయుడు, ఒకే ఒక్కడు, అపరిచితుడు, శివాజీ, రోబో.. ఇలా తిరుగులేని బ్లాక్‌బస్టర్లు అందుకున్న ఘనత ఆయన సొంతం.
మధ్య మధ్యలో తన స్థాయికి తగని సినిమాలు కూడా కొన్ని అందించాడు శంకర్. అందులో ‘బాయ్స్’ మొదటిది. అయినా ఆ చిత్రాన్ని ఫ్లాప్ అనలేం. ఉన్నంతలో బాగానే ఆడింది. ఆ తర్వాత ‘ఐ’తో నిరాశపరిచాడు. దానికీ మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. అందులో శంకర్ కష్టాన్ని జనం గుర్తించారు. ‘2.0’కు కూడా మిక్స్‌డ్ రెస్పాన్స్ వచ్చినా కలెక్షన్లకు ఢోకా లేకపోయింది.
మూడు దశాబ్దాల కెరీర్లో శంకర్‌కు ప్రేక్షకుల నుంచి పూర్తిగా తిరస్కారం ఎప్పుడూ రాలేదు. ఆయన సినిమాలకు మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చినా సరే..దర్శకుడిగా తన స్థాయి అమాంతం పడిపోలేదు. కానీ ఇప్పుడు మాత్రం ప్రేక్షకుల నుంచి ఔట్ రైట్ రిజెక్షన్ ఎదుర్కొన్నాడు శంకర్. ‘భారతీయుడు-2’కు ప్రేక్షకులు పూర్తిగా ముఖం చాటేశారు. అంతో ఇంతో తెలుగు ప్రేక్షకులే తొలి రోజు మంచి ఓపెనింగ్స్ ఇచ్చారు తప్ప.. ఓవరాల్‌గా చూస్తే ఇది ఆల్ టైం డిజాస్టర్లలో ఒకటైపోయింది. ఫుల్ రన్లో 50 కోట్ల గ్రాస్ రావడం కూడా కష్టమవుతోందంటే ప్రేక్షకులు ఈ సినిమా పట్ల ఎంత వ్యతిరేక భావాన్ని చూపించారో అర్థం చేసుకోవచ్చు.
తన కెరీర్లో శంకర్ ఎన్నడూ ఎదుర్కోని అత్యంత చేదు అనుభవమిది. కచ్చితంగా ఆయన ఈ ఫలితాన్ని జీర్ణించుకోలేకపోతుండొచ్చు. ఈ సినిమా దారుణ పరాజయాన్ని ఎదుర్కోవడంతో కొంచెం బెటర్ అనిపిస్తున్నప్పటికీ ‘ఇండియన్-3’ని జనం ఏమాత్రం పట్టించుకుంటారన్నది సందేహంగా మారింది. మరోవైపు ఆల్రెడీ పూర్తి కావచ్చిన ‘గేమ్ చేంజర్’ ఎలా ఉంటుందో అన్న భయాలు చరణ్ అభిమానులను వెంటాడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో రాబోయే రెండు చిత్రాలను విజయవంతం చేయడం శంకర్‌కు శక్తికి మించిన పనే. ఈ ఒత్తిడిలో ఆయన ఎలాంటి సినిమాలు డెలివర్ చేస్తాడో చూడాలి.