ఆ నటి అక్కడ నుంచి ఇక్కడికెలా?
సినిమా ఇండస్ట్రీలో ఛాన్స్ అన్నది ఎంత కష్టమో చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో ఒక్క ఛాన్స్ అంటూ కాళ్లరిగేలా తిరిగే వాళ్లకే ఇక్కడ కష్టాలు తెలుస్తాయి
By: Tupaki Desk | 7 March 2024 5:30 PM GMTసినిమా ఇండస్ట్రీలో ఛాన్స్ అన్నది ఎంత కష్టమో చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో ఒక్క ఛాన్స్ అంటూ కాళ్లరిగేలా తిరిగే వాళ్లకే ఇక్కడ కష్టాలు తెలుస్తాయి. ఆ కష్టం వెనుక ఎంతో ఫ్యాషన్ ఉంటే తప్ప రాణించ లేని రంగం కూడా ఇదే. బ్యాక్ గ్రౌండ్ ఉన్న వాళ్ల కంటే ఎలాంటి సపోర్ట్ లేకుండా వచ్చి సక్సెస్ అయిన వాళ్లకి ఇక్కడ మరింత ప్రత్యేకమైన గౌరవం..గుర్తింపు దక్కుతుంది. అలా ఎలాంటి సపోర్ట్ లేకుండా ఎదిగిన నటి శరణ్య ప్రదీప్. ఈ అమ్మడి పేరిప్పుడు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.
'ఫిదా' నుంచి 'అంబాజీపేట మ్యారేజీ బ్యాండు' వరకూ ఆమె పోషించిన పాత్రలు అమ్మడికి ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొచ్చాయి. సహజమైన ఆమె నటన .. డైలాగ్ డెలివరీ తో తనకంటూ ఓ ప్రత్యేకత ఉందని ప్రూవ్ చేసుకుంది. సోషల్ మీడియాలో ఆమె ఫాలోయింగ్ కూడా రెట్టింపు అవుతుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూ లో శరణ్య తన కొన్ని ఆసక్తిర విషయాలు పంచుకున్నారు. ఆవేంటో ఆమె మాటల్లోనే..
'మాది నిజామాబాద్ .. మా నాన్న ఒక ప్రైవేట్ ఉద్యోగి . అమ్మ హౌస్ వైఫ్ .
బీఎస్సీ చేశాను . నాకు ఒక చెల్లెలు ఉంది. మా అమ్మ కుట్టు మిషన్ పై పని చేస్తూ ఉండేది. నాన్న సంపాదన అలా సరిపోయేది. అంటే ఉన్నంతలో సర్దుకుపోయే వాళ్లం. ఏదైనా కొనుక్కోవాలంటే ముందు నుంచి డబ్బులు దాచుకునే వాళ్లం. అప్పటికప్పుడు పండగ చేసుకోవడం అంటే మాకు సాధ్యపడదు. అమ్మ తాను దాచుకున్న డబ్బులతో మాకు బట్టలు కొనేది. ఈలోగా కజిన్స్ బట్టలు .. బ్యాగులు వాడుకునే వాళ్లం. తొలి నుంచి కూడా సినిమాలంటే చాలా ఇష్టం.
సినిమాలను చూసొచ్చి అందులో నటీనటుల్ని అనుకరించేదాన్ని. ఆ తర్వాత కొన్నాళ్లకి మా ఊళ్లోనే లోకల్ ఛానల్ లో పనిచేసే అవకాశం వచ్చింది. ఆ తరువాత హైదరాబాద్ లో ఓ ప్రముఖ ఛానల్ లో చేసే అవకాశం వచ్చింది. అక్కడే మా వారు పరిచయం కావడం జరిగింది. ఆయన ప్రోత్సాహంతోనే 'ఫిదా' ఆడిషన్స్ కి వెళ్లాను. అందువల్లనే ఈ రోజున ఇక్కడ ఉన్నాను. లేదంటే నా జర్నీ ఇంతవకూ వచ్చేది కాదు' అని తెలిపింది.