హౌస్ నుంచి బయటకొచ్చి.. శేఖర్ బాషా చెప్పిన రియల్.. ఫేక్ ముచ్చట్లు
అంచనాలకు తగ్గట్లే బిగ్ బాస్ 8లోనూ ఎలిమినేషన్ క్రతువు సాగుతోంది.
By: Tupaki Desk | 16 Sep 2024 4:57 AM GMTఅంచనాలకు తగ్గట్లే బిగ్ బాస్ 8లోనూ ఎలిమినేషన్ క్రతువు సాగుతోంది. తాజాగా రేడియో జాకీ శేఖర్ బాషా ఎలిమినేట్ అయ్యారు. ప్రాసెస్ ఏదైనా.. చివరకు హౌస్ నుంచి బయటకు వచ్చే పేరు ముందే లీక్ కావటం తెలిసింతే. గడిచిన కొన్ని సీజన్ల నుంచి ఇదే పరిస్థితి నెలకొంది. ఎవరు ఎలిమినేట్ అవుతారన్న విషయం ఒక రోజు ముందే బయటకు వచ్చేయటం.. అందుకు తగ్గట్లే జరగటం కొత్తేం కాదు. ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు శేఖర్ బాషా.
నామినేషన్స్ లో విష్ణుప్రియ, కిర్రాక్ సీత, ప్రథ్వీరాజ్, శేఖర్ బాషా, నైనిక, నిఖిల్, నాగ మణికంఠ, ఆదిత్య ఓం ఉండగా.. చివరకు ఆదిత్య ఓం.. శేఖర్ బాషా మిగిలారు. ఈ ఇద్దరిలో ఎవరు హౌస్ లో ఉండేందుకు అర్హులో చెబుతూ.. వారి మెడలో పూలదండ వేయమని నాగార్జున అడిగారు. దీంతో.. ఒక్కరు తప్ప (కిర్రాక్ సీత) మిగిలిన వారంతా ఆదిత్య ఓం మెడలో పూలదండ వేయటంతో శేఖర్ భాషా బయటకు రాక తప్పింది కాదు.
కింగ్ నాగార్జునతో ఎలిమినేట్ అయిన శేఖర్ బాషా మాట్లాడే వేళలో.. ఒక చిన్న గేమ్ ఆడారు. హౌస్ లోని ఆరుగురిలో ముగ్గురు ఫేక్.. ముగ్గురు రియల్ ఎవరో చెప్పాలని కోరారు. దీంతో శేఖర్ బాషా సీత, విష్ణుప్రియ, ప్రేరణలను రియల్ పీపుల్ గా చెప్పారు. అదే సమయంలో ఫేక్ పీపుల్ గా సోనియా, మణికంఠ, ఆదిత్యలను పేర్కొన్నారు. వారెందుకు ఫేక్ అన్న విషయాన్ని వివరణగా చెప్పుకొచ్చారు.
రియల్ పీపుల్
సీత: మనస్ఫూర్తిగా.. స్వచ్ఛంగా మాట్లాడుతుంది. నాకు చెల్లి లేకున్నా ఆమెను అలానే భావిస్తా. ముక్కుసూటి మనస్తత్వం.. ఫైటింగ్ నేచర్ కూడా ఉంది.
విష్ణుప్రియ: హౌస్ కు వచ్చే ముందు విష్ణుప్రియ గురించి ఏవేవో చెప్పి భయపెట్టారు. కానీ.. అమాయకురాలు అనే పదానికి డిక్షనరీలో అర్థం వెతికితే విష్ణుప్రియ అని రావాలి. ఆమెను చూసిన తర్వాత ఆమె.. నిజంగా అమాయకురాలుగా అనిపించింది. ఎలా బతుకుతుందో తెలీదు.
ప్రేరణ: కొన్నికోణాల్లో ఆమె నచ్చదు. కానీ.. చాలా విషయాల్లో నిజాయితీ కలిగిన వ్యక్తిగా అనిపించారు. ఆమెకు ఒక రోజు తెలివి.. వివేకానికి మధ్య భేదం చెప్పాను.వివేకంతో వ్యవహరిస్తే లాభనష్టాలు చూసుకుంటారు. తెలివిగాఅయితే మంచి చెడుల గురించి ఆలోచిస్తారు. చాలా ఎనర్జటిక్. స్వచ్ఛమైన మనసుతో మాట్లాడుతుంది. ఉత్సుకత కూడా ఎక్కువే.
ఫేక్ పీపుల్
సోనియా: హౌస్ లోకి వచ్చాక ఆమె నవ్వు చాలా ప్రశాంతంగా అనిపించింది. తర్వాతి రోజు నామినేషన్స్ లో మహంకాళి అవతారం చూశా. పూర్తి విరుద్ధమైన మైండ్ సెట్ కలిగిన వ్యక్తి.
మణికంఠ: ఏ సందర్భానికి ఎలా స్పందించాలో ఆలోచించి ఆ తర్వాత మాట్లాడతాడు. అందువల్ల అతడి నిజమైన ముఖం తెలీలేదు. ఒక వ్యక్తిపై కోపం ఉన్నా.. ఆ విషయం చెప్పడు. దాచి లెక్కలు వేసుకొని ఎవరితో ఎలా మాట్లాడాలో అలా మాట్లాడతాడు. కావాలని ఫేక్ ఫేస్ పెట్టుకుంటాడు.
ఆదిత్య: నన్ను మూడుసార్లు నామినేషన్ చేశాడు. తర్వాత తిరిగి ఒకసారి నామినేట్ నేను చేశాను. ఆ తర్వాత కొంచెం సూటిపోటి మాటలు మాట్లాడినట్లు అనిపించింది. అతడు నామినేట్ చేసినప్పుడు నేను తేలిగ్గా తీసుకున్నా. కానీ.. అతడు మాత్రం అలా తీసుకోలేదు.