Begin typing your search above and press return to search.

అందరికీ ఆ అదృష్టం దక్కేనా?

పన్నెండు ఏళ్ల తర్వాత వచ్చిన సినిమా అయినా తమిళ్ ప్రేక్షకులు ఫ్రెష్‌గానే మూవీ ఉందనే అభిప్రాయం వ్యక్తం చేశారు.

By:  Tupaki Desk   |   23 Jan 2025 12:16 PM IST
అందరికీ ఆ అదృష్టం దక్కేనా?
X

తెలుగు ప్రేక్షకుల ముందుకు ఈ సంక్రాంతి సందర్భంగా గేమ్ ఛేంజర్‌, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు వచ్చాయి. మూడు సినిమాల్లో సంక్రాంతికి వస్తున్నాం సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ఇక తమిళనాట అదే సంక్రాంతి కానుకగా చాలా సినిమాలు వచ్చాయి. అజిత్ సినిమాను సంక్రాంతి రేసు నుంచి తప్పించడంతో చిన్న సినిమాలు సంక్రాంతి రేసులో నిలిచాయి. చిన్న పెద్ద సినిమాలు కలిపి దాదాపు అరడజను ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అన్ని సినిమాల్లోకి విశాల్‌ హీరోగా అంజలి, వరలక్ష్మి శరత్‌ కుమార్‌ హీరోయిన్స్‌గా నటించిన మదగజరాజా సినిమాకి అత్యధిక వసూళ్లు నమోదు అయ్యాయి.

ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన మదగజరాజా సినిమా బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.40 కోట్ల వసూళ్లు రాబట్టింది. దాదాపు 12 ఏళ్ల క్రితం సుందర్ సి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా కొన్ని కారణాల వల్ల విడుదల కాలేదు. ఈ సంక్రాంతికి పెద్ద సినిమాలు లేకపోవడంతో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. గత కొన్నాళ్లుగా వాయిదా వేస్తూ వచ్చినప్పటికీ విశాల్ ఈ సినిమా ప్రమోషన్ కోసం మీడియా ముందుకు వచ్చాడు. ఆ సమయంలో తీవ్రమైన జ్వరం ఉండటంతో విశాల్‌ కనీసం మాట్లాడలేక పోయారు. దాంతో సినిమా గురించి, ఆయన ఆరోగ్యం గురించి ప్రముఖంగా చర్చ జరిగింది. సినిమాకు మంచి పబ్లిసిటీ దక్కడంతో పాటు పాజిటివ్ టాక్ దక్కించుకుంది.

పన్నెండు ఏళ్ల తర్వాత వచ్చిన సినిమా అయినా తమిళ్ ప్రేక్షకులు ఫ్రెష్‌గానే మూవీ ఉందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. సినిమాను ఆదరించారు. మదగజరాజా సినిమాకు వచ్చిన స్పందనతో చాలా మంది ఫిల్మ్‌ మేకర్స్ తమ విడుదల కాని సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు రెడీ చేస్తున్నారు. అందులో కొన్ని లేడీ ఓరియంటెడ్‌ సినిమాలు సైతం ఉండటం విశేషం. కోలీవుడ్‌ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సమ్మర్‌లోనే దాదాపుగా పది సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు పనులు ప్రారంభం అయ్యాయి.

ఏవో కారణం వల్ల సినిమాలు ఆగిపోవడం మనం చూస్తూనే ఉంటాం. కొన్ని సినిమాలు షూటింగ్‌ ప్రారంభం అయిన వెంటనే ఆగిపోతే కొన్ని సినిమాలు మాత్రం సినిమాలు షూటింగ్‌ పూర్తి అయిన తర్వాత విడుదల కాకుండా ఆగిపోతాయి. షూటింగ్‌ పూర్తి చేసుకుని విడుదల కాకుండా ఉన్న సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే ఏర్పాట్లు కోలీవుడ్‌లో జరుగుతున్నాయి.

మదగజరాజా సినిమాకు కలిసి వచ్చినట్లుగానే తమ సినిమాలకు ఈ ఏడాది కలిసి వస్తుందేమో అని వారు ఆశ పడుతున్నారు. అయితే మదగజరాజా సినిమాకు దక్కిన విజయం అన్ని సినిమాలకు దక్కే అవకాశాలు తక్కువే.. అందరికీ అంతటి అదృష్టం దక్కుతుందా అనేది అనుమానమే. అయితే ప్రయత్నం చేయడం, సినిమాలను విడుదల చేయడం అనేది మంచి నిర్ణయం అని సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.