మంచు విష్ణు.. ఒక్క పాటతో పాజిటివ్ వైబ్స్
సినిమాపై ప్రేక్షకుల అభిప్రాయం ఒక్కరోజులో మారిపోవచ్చు. ట్రోల్స్, నెగటివ్ ప్రచారం ఎంతగా ఉన్నా, కంటెంట్ బలంగా ఉంటే ప్రేక్షకుల ప్రేమను పొందడం ఖాయం.
By: Tupaki Desk | 11 Feb 2025 5:50 AM GMTసినిమాపై ప్రేక్షకుల అభిప్రాయం ఒక్కరోజులో మారిపోవచ్చు. ట్రోల్స్, నెగటివ్ ప్రచారం ఎంతగా ఉన్నా, కంటెంట్ బలంగా ఉంటే ప్రేక్షకుల ప్రేమను పొందడం ఖాయం. అలాంటి ఉదాహరణగానే మారింది మంచు విష్ణు కన్నప్ప. మొదటి నుంచీ ఈ సినిమా గురించి భిన్నమైన కామెంట్స్ ఎక్కువగా వచ్చాయి. ముఖ్యంగా కొన్ని పోస్టర్స్ విడుదలయ్యాక ట్రోలింగ్ ఇంకా ఎక్కువైంది. కానీ ఇప్పుడు ఒక్క పాటతోనే అంచనాలు మారిపోయాయి. మంచు పవర్ఫుల్ కంటెంట్ తో రాబోతున్నట్లు క్లారిటీ ఇచ్చేశాడు.
కన్నప్ప నుంచి వచ్చిన మొదటి పాట శివ శివ శంకర ఆడియన్స్‌ని ఆశ్చర్యపరచింది. ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు రవిశంకర్ గురూజీ చేతుల మీదుగా విడుదలైన ఈ పాట ఇప్పటి వరకు వచ్చిన ట్రోలింగ్‌కు సరైన సమాధానం ఇచ్చింది. రామజోగయ్య శాస్త్రి అద్భుతమైన సాహిత్యం అందించగా, విజయ్ ప్రకాష్ తన గొంతుతో ఈ పాటను మరో స్థాయికి తీసుకెళ్లాడు. ప్రభుదేవా కొరియోగ్రఫీ, స్టీఫెన్ దేవస్సీ సంగీతం కలిసొచ్చి, ఈ పాటను ఓ పవర్‌ఫుల్ భక్తి గీతంగా మార్చాయి.
ఈ పాట విడుదలైన తరువాత కన్నప్ప గురించి నెగటివ్ కామెంట్స్ కంటే పొగడ్తలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో మంచు విష్ణు సెలెక్షన్ కు అద్భుతమైన ప్రశంసలు అందుతున్నాయి. దీంతో పాట ఎంతగా ప్రభావం చూపించిందో అర్థం చేసుకోవచ్చు. ఇది సినిమాపై ఉన్న ట్రోలింగ్‌ను పక్కన పెట్టి, ప్రేక్షకులను కొత్త కోణంలో ఆలోచించుకునేలా చేసింది. ఈ పాట చూసిన తర్వాత కన్నప్పను కొత్త దృష్టితో చూడాలనే అభిప్రాయం జనంలో పెరిగింది.
కేవలం పాట మాత్రమే కాదు, దానిలోని విజువల్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. మంచు విష్ణు యాక్టింగ్‌లో కనిపించిన భావోద్వేగం, ప్రభుదేవా సెట్ చేసిన స్టెప్పులు, కెమెరా వర్క్ అన్నీ కలిసి ఆ పాటను గ్రాండ్ విజువల్ ఫీస్ట్‌గా మార్చాయి. కేవలం కమర్షియల్ ఎలిమెంట్స్ మాత్రమే కాకుండా, కంటెంట్ పరంగా కూడా ఈ సినిమా ధీటైనదని ఈ పాట ద్వారా నిరూపితమైంది.
ఈ సినిమాను మోహన్ బాబు భారీ స్థాయిలో నిర్మిస్తుండగా, మోహన్‌లాల్, అక్షయ్ కుమార్, ప్రభాస్, కాజల్, శరత్‌కుమార్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటివరకు కన్నప్పపై కామెంట్స్ ఎలా ఉన్నా కూడా ఇప్పుడు వచ్చిన ఈ పాట సినిమాపై కొత్త అంచనాలు నెలకొల్పింది. ఇక ప్రభాస్ సినిమాలో స్పెషల్ పాత్రలో కనిపించబోతున్న విషయం తెలిసిందే. ఇక సినిమాపై పాన్ ఇండియా రేంజ్ లో కూడా హైప్ పెరుగుతోంది. ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న కన్నప్ప ఈ పాట ద్వారా మంచి పాజిటివ్ బజ్ తెచ్చుకుంది. మరి సినిమా రిలీజ్ అనంతరం బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంటుందో చూడాలి.