శొంఠినేని శివాజీ.. ఎన్నాళ్లకెన్నాళ్లకు మెగాస్టార్ తో మళ్లీ ఆ నవ్వులు
అయితే టాలెంట్ నే నమ్ముకుని వచ్చి.. విజయం కోసం కష్టపడే వారిని ఎప్పుడూ సినీ ఇండస్ట్రీ వదులుకోదు.. ఇది ఎందరి విషయంలోనే రుజువైంది.
By: Tupaki Desk | 31 March 2025 11:58 AMసినిమా ఇండస్ట్రీలో ఎవరికి ఎవరు ఏమవుతారు? అంటే ఏమీ చెప్పలేం.. కేవలం డబ్బు.. సక్సెస్ మాత్రమే ప్రధాన పాత్ర పోషించే ఇండస్ట్రీలో మిగతావన్నీ ఆ తర్వాతే. అయితే టాలెంట్ నే నమ్ముకుని వచ్చి.. విజయం కోసం కష్టపడే వారిని ఎప్పుడూ సినీ ఇండస్ట్రీ వదులుకోదు.. ఇది ఎందరి విషయంలోనే రుజువైంది.
శొంఠినేని శివాజీ.. ఈ పేరుతో కంటే గరుడ పురాణం శివాజీగా బాగా ప్రసిద్ధులైన యాక్టర్ శివాజీ. గుంటూరు జిల్లా నరసరావుపేట నుంచి హైదరాబాద్ వచ్చి టీవీలో పనిచేస్తూ.. సినిమాల్లో లక్ ను పరీక్షించుకుని సక్సెస్ అయిన వ్యక్తి. సినీ ఇండస్ట్రీలో 1990ల చివర్లో కష్టపడి గుర్తింపు పొందారు. 2000 సంవత్సరం తర్వాత శివాజీ టైమ్ బాగుంది. సపోర్టింగ్ క్యారెక్టర్ల నుంచి ఫ్యామిలీ, కామెడీ హీరోగా ఎదిగారు.
రూ.10 వేల చిరుసాయం..
ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటున్న సమయంలోనే మెగాస్టార్ చిరంజీవి సినిమాలో నటించే అవకాశం దక్కించుకున్నారు శివాజీ. క్రమశిక్షణ, జీవితంలో స్థిరపడాలనే లక్ష్యం ఉన్న శివాజీని చిరంజీవి కూడా గుర్తించారు. ఓ దశలో రూ.10 వేల సాయం కూడా చేశారు. మెగాస్టార్ కెరీర్ లో అతిపెద్ద హిట్ అయిన ‘ఇంద్ర’లో శివాజీది చాలా కీలక పాత్ర కావడం గమనార్హం. ఇక చిరు తమ్ముడు పవన్ కల్యాణ్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ఖుషీలోనూ శివాజీ రోల్ చాలా కీలకం అనే సంగతి తెలిసిందే. వీరిద్దరితో ఆ సమయంలో అత్యంత సన్నిహితంగా మెలిగిన శివాజీ దీనిని కొనసాగించలేదు.
కాగా, చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించాక సినీ రంగం నుంచి వైదొలగారు. ఇక ఆ సమయంలో ఇండస్ట్రీలోని చాలామంది లాగానే శివాజీ తన మద్దతు ప్రకటించలేదు. ఈ గ్యాప్ అలాఅలా పెరుగుతూనే వచ్చింది.
చిన్నతనంలో పెద్ద ఎన్టీఆర్ ను, చదువుకునే రోజుల్లో మెగాస్టార్ ను అభిమానించారు శివాజీ. కానీ, మెగాస్టార్ పార్టీకే కాదు కాలక్రమంలో వ్యక్తిగతంగానూ దూరమయ్యారు. ఓ దశలో విమర్శనాత్మకంగానూ మాట్లాడారు. ఇదంతా కలిసి 15 ఏళ్లుగా జరుగుతోంది.
తాజాగా శొంఠినేని శివాజీ మెగాస్టార్ ను కలిశారు. నటుడిగా గత ఏడాది మంచి ఫలితాలు అందుకున్న ఆయన ఇటీవల కోర్ట్ అనే సినిమాలో కఠిన మనస్తత్వం ఉన్న వ్యక్తిగా కనిపించారు. ఈ సినిమాను హీరో నిర్మించారు. కోర్ట్ మంచి విజయం సాధించడంతో చిరంజీవి ఆ సినిమా నటులను తన ఇంటికి ఆహ్వానించారు. ఇందులో భాగంగా శివాజీ మెగాస్టార్ ను కలిశారు. సినిమాలో ఆయన పాత్రను చిరంజీవి పొగిడారు. అలా.. ఒకప్పటి శివాజీ మళ్లీ కనిపించారు.