Begin typing your search above and press return to search.

డైరెక్ట‌ర్లు పాట‌లు రాయ‌కూడ‌దా?

ఒక‌ప్పుడు ద‌ర్శ‌కులంటే కేవ‌లం ఆన్ సెట్స్ లో మాత్ర‌మే క‌నిపించేవారు

By:  Tupaki Desk   |   10 Aug 2023 9:21 AM GMT
డైరెక్ట‌ర్లు పాట‌లు రాయ‌కూడ‌దా?
X

ఒక‌ప్పుడు ద‌ర్శ‌కులంటే కేవ‌లం ఆన్ సెట్స్ లో మాత్ర‌మే క‌నిపించేవారు. ర‌చ‌యిత‌ల మీద ఆధార‌ప‌డి సినిమాలు చేసే వారు. అవ‌స‌ర‌మైతే అప్ప‌టిక‌ప్పుడు ద‌ర్శ‌కుడి విజన్ కి త‌గ్గ‌ట్టు సెట్స్ లోనే మార్పులు చేసేవారు. కానీ ఇప్పుడా సీన్ లేదు. ద‌ర్శ‌కులే ర‌చ‌యిత‌లు. ర‌చ‌యిత‌లుగా ఉన్న‌వాళ్లే ద‌ర్శ‌కులుగానూ స‌క్సెస్ అవుతున్నారు. క‌థ‌..మాట‌లు..క‌థ‌నం అన్ని రాసుకునే స‌త్తా ఉన్న వాళ్ల‌కే హీరోలు డేట్లు ఇస్తున్నారు. ఇంత‌కు ముందులా డైరెక్ష‌న్ మాత్ర‌మే చేస్తానంటే? అవ‌కాశాలు క‌ష్టంగానే ఉన్నాయి.

హీరోలు అలాంటి టెక్నిషీయ‌న్ల‌నే ప్రోత్స‌హించ‌డం లేదు. ద‌ర్శ‌క‌-ర‌చ‌యిత‌ల్లో ఎబిలిటీస్ చూసి అవ‌కాశాలు ఇస్తున్నారు. ఇంకా చాలా మంది ద‌ర్శ‌కులు పాట‌లు కూడా రాస్తున్నారు. పూరి జ‌గ‌న్నాధ్...త్రివిక్ర‌మ్ స‌హా కొంత మంది మేధావులు త‌మ సినిమాల‌కు ద‌ర్శ‌క‌త్వ బాధ్య‌త‌ల‌తో పాటు సాహితి వేత్త‌ల‌గానూ మారిపోతు న్నారు. అవ‌సర‌మైతే అప్ప‌టిక‌ప్పుడు సెట్స్ లో కూర్చిని పాట‌లు రాస్తున్నారు. అలాగే యంగ్ ట్యాలెంటెడ్ మేక‌ర్ శివ నిర్వాణ కూడా మంచి గీత రచ‌యిత‌.

తొలి సినిమాతోనే డైరెక్ట‌ర్ గా మంచి పేరు గుర్తింపు ద‌క్కించుకున్నాడు. 'నిన్నుకోరి'..'మ‌జిలీ' లాంటి చిత్రాల‌కు స్వ‌యంగా కొన్ని పాట‌లు కూడా రాసాడు. తాజాగా తెర‌కెక్కిస్తోన్న 'ఖుషీ' సినిమాలో నాలుగు పాట‌లు ఆయ‌నే స్వ‌యంగా రాసాడు. ఇప్ప‌టికే రిలీజ్ అయిన ఆ పాట‌లు శ్రోత‌ల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటున్నాయి. అయితే ద‌ర్శ‌కుడే ఇలా సినిమాల పాట‌ల‌న్నింటిలో భాగ‌మ‌వ్వ‌డంపై కొంత నెగిటివిటీ తెర‌పైకి వ‌చ్చింది. గీత ర‌చ‌యిత‌ల‌కు అవ‌కాశం ఇవ్వ‌కుండా త‌నే అన్ని అయ్యాడు? అన్న‌ట్లు!

ఈ నేప‌థ్యంలో ఇలాంటి ప్ర‌శ్నే ఆయ‌న ముందుకెళ్లే అంతే ధీటుగా ఆస‌క్తిక‌ర స‌మాధానం ఇచ్చారు. 'సన్నివేశానికి త‌గ్గ‌ట్టు ఫ‌లానా సాహిత్యంతో పాట రాస్తే బాగుంటుంద‌నిపిస్తే నేనే రాసేస్తాను. నిన్ను కోరి..మ‌జిలీలో అలాగే రాసాను. ఈ సినిమాలో పాట‌లు కూడా నేను రాసేలా ప్రేరేపించాయి. అలా కానీ ప‌క్షంలో బ‌య‌ట ర‌చ‌యిత‌ల‌తో రాయించుకుంటాను. అన్నీ నేనే రాయ‌ల‌ని లేదు..బ‌య‌ట వారు మాత్రమే ప‌నిచేయాల‌ని లేదు. అప్ప‌టి స‌న్నివేశాన్ని బ‌ట్టి అలా జరిగిపోతుంది. నేను తెలుగు టీచ‌ర్ గా ప‌నిచేసాను. ఆ అనుభవం పాట‌ల‌కు ప‌నికొస్తుంది' అని అన్నారు.