Begin typing your search above and press return to search.

'RC 16' కంటే ముందే శివన్న తెలుగులో సత్తా చాటుతాడా?

శివరాజ్ కుమార్ హీరోగా నటించిన తాజా చిత్రం "భైరతి రణగల్". బ్లాక్ బస్టర్ 'మఫ్తీ' మూవీకి ప్రీక్వెల్ గా టాలెంటెడ్ డైరెక్టర్ నర్తన్ తెరకెక్కించారు.

By:  Tupaki Desk   |   19 Nov 2024 9:53 AM GMT
RC 16 కంటే ముందే శివన్న తెలుగులో సత్తా చాటుతాడా?
X

కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కు తెలుగు, తమిళ భాషల్లోనూ మంచి గుర్తింపు ఉంది. 'కిల్లింగ్ వీరప్పన్' 'గౌతమీ పుత్ర శాతకర్ణి' వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన శివన్న.. గతేడాది 'జైలర్‌' 'కెప్టెన్ మిల్లర్' వంటి తమిళ సినిమాలలో అతిధి పాత్రల్లో మెరిశారు. ఈ చిత్రాల్లో తక్కువ స్క్రీన్ టైమ్ ఉన్నప్పటికీ తన ఇంటెన్స్ యాక్టింగ్ తో ఎక్కువ ఇంపాక్ట్ చూపించాడు. ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తున్న సీనియర్ హీరో.. మరికొన్ని రోజుల్లో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కనున్న 'RC 16' మూవీ సెట్స్ లో అడుగుపెట్టబోతున్నారు. అయితే ఈ సినిమా కంటే ముందుగానే టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటడానికి సిద్దమవుతున్నాడు శివన్న.

శివరాజ్ కుమార్ హీరోగా నటించిన తాజా చిత్రం "భైరతి రణగల్". బ్లాక్ బస్టర్ 'మఫ్తీ' మూవీకి ప్రీక్వెల్ గా టాలెంటెడ్ డైరెక్టర్ నర్తన్ తెరకెక్కించారు. ఇందులో రుక్మిణి వసంత్ కీలక పాత్ర పోషించింది. గీతా పిక్చర్స్ బ్యానర్ పై గీతా శివరాజ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. రవి బస్రూర్ సంగీతం సమకూర్చారు. ఇటీవలే కన్నడలో సైలెంట్ గా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా.. బాక్సాఫీస్ దగ్గర ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. డీసెంట్ కలెక్షన్స్ తో బ్లాక్ బస్టర్ హిట్ దిశగా పయనిస్తోంది. అయితే ఈ సినిమాని తెలుగులో డబ్బింగ్ చేసి రిలీజ్ చేయనున్నారు. అతి త్వరలోనే గ్రాండ్ గా తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నారు.

నిజానికి 'భైరతి రణగల్' చిత్రాన్ని ఇండిపెండెన్స్ డే స్పెషల్ గా ఆగస్టు 15వ తేదీన విడుదల చెయ్యాలని అనుకున్నారు. ముందుగా 'పుష్ప 2: ది రూల్' సినిమాని అదే డేట్ కి రిలీజ్ చేయాలని ప్లాన్ చెయ్యడంతో.. కన్నడలో అల్లు అర్జున్ సినిమా ఓపెనింగ్స్ పై ప్రభావం చూపుతుందేమో అని అందరూ ఆలోచించారు. అయితే ఈ రెండు సినిమాలూ అనుకున్న సమయానికి థియేటర్లలోకి రాలేదు. చివరకు నవంబర్ 15న విడుదల చెయ్యాలని నిర్ణయించుకున్నారు. కానీ ఒక రోజు ముందు భారీ హైప్ తో 'కంగువ' మూవీ రిలీజ్ అవుతుండటంతో.. శివన్న రిస్క్ చేస్తున్నారేమో అనే కామెంట్స్ వచ్చాయి. అయినా సరే వెనక్కి తగ్గకుండా కన్నడ వెర్షన్ ను ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చారు.

మామూలుగానే శివరాజ్ కుమార్ సినిమాలు టాక్ తో సంబంధం లేకుండా కర్ణాటకలో భారీ ఓపెనింగ్స్ రాబడుతుంటాయి. అందులోనూ ఇది 2017లో నర్తన్ తీసిన 'మఫ్టీ' చిత్రానికి ప్రీక్వెల్ కావడంతో, ట్రేడ్ లో మంచి క్రేజ్ ఏర్పడింది. దీనికి తగ్గట్టుగానే తొలి రోజే పాజిటివ్ టాక్ వచ్చింది. మరోవైపు 'కంగువ' చిత్రానికి మిక్స్డ్ టాక్ రావడం కూడా.. ఈ మూవీకి కలిసొచ్చింది. అయితే ఇదే సినిమాని తెలుగులోకి డబ్బింగ్ చేయాలని ప్లాన్ చేస్తుండటంతో.. 'RC 16' కంటే ముందే శివన్న తెలుగు స్టేట్స్ లో మంచి విజయం సాధిస్తాడని అభిమానులు భావిస్తున్నారు. అదే జరిగితే శివరాజ్ కు ఇక్కడ మరింత క్రేజ్ ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇది పరోక్షంగా చరణ్ సినిమాకి హెల్ప్ అవుతుంది.

బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్, జాన్వీ కపూర్ హీరోహీరోయిన్లుగా 'RC 16' సినిమా తెరకెక్కనుంది. ఇది ఉత్తరాంధ్ర రూర‌ల్ బ్యాక్ డ్రాప్ లో రా అండ్ ర‌స్టిక్ ఎమోషనల్ స్పోర్ట్స్‌ డ్రామాగా రూపొందనుంది. ఇందులో శివరాజ్ కుమార్ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని తెలుస్తోంది. 'గౌతమీ పుత్ర శాతకర్ణి' తర్వాత ఆయన కనిపించే స్ట్రెయిట్ తెలుగు సినిమా ఇదే. మైత్రీ మూవీ మేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ సమర్పణలో వృద్ధి సినిమాస్‌ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో ఈ పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మించనున్నారు.