కన్నడ కంఠీరవ వారసుడికి పాన్ ఇండియా సవాల్
కన్నడ కంఠీరవగా గొప్ప పాపులారిటీ ఉన్న డా.రాజ్ కుమార్ కుటుంబం నుంచి వచ్చిన నటుడు శివరాజ్ కుమార్
By: Tupaki Desk | 12 Oct 2023 3:57 AM GMTకన్నడ కంఠీరవగా గొప్ప పాపులారిటీ ఉన్న డా.రాజ్ కుమార్ కుటుంబం నుంచి వచ్చిన నటుడు శివరాజ్ కుమార్. కన్నడ ఇండస్ట్రీని ఏలిన స్టార్ హీరో ఆయన. కానీ ఇప్పుడు పాన్ ఇండియా రేస్ లో తన సత్తాను చాటుకునే తరుణంలో చాలా ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నాడు. కంఠీరవ వంశంలో అతడు దమ్మున్నోడే. చాలా కాలంగా పాన్ ఇండియా ప్రయత్నాల్లో ఉన్నాడు. అతడు తొలుత కన్నడ రంగంలో రాణించాక, నెమ్మదిగా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవాలని ప్రయత్నించాడు. శివన్న నటించిన కొన్ని సినిమాలు అనువాదమై తెలుగులోను విడుదలయ్యాయి. కానీ ఇక్కడ సరిగా ఆడలేదు. ఇప్పుడు ఘోస్ట్ అనే పాన్ ఇండియా సినిమాతో తెలుగు-తమిళ మార్కెట్లోకి దూసుకెళ్లాలని శివరాజ్ కుమార్ ప్రయత్నిస్తున్నాడు.
కానీ రకరకాల కారణాలతో ఇప్పుడు 'ఘోస్ట్'కి చిక్కొచ్చి పడిందని తెలిసింది. దసరా బరిలో తెలుగు తమిళం నుంచి క్రేజీ సినిమాలు విడుదలవుతున్నాయి. భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావు, లియో లాంటి భారీ క్రేజ్ ఉన్న చిత్రాలు ఈ సీజన్ లో రంగంలోకి దిగతుండగా, మరోవైపు హిందీ నుంచి గణపత్ లాంటి పెద్ద చిత్రం విడుదలవుతోంది. దీంతో థియేటర్ల పరంగా సమస్యలు తలెత్తాయి. ఉన్న కొద్దిపాటి థియేటర్లను ఆ నలుగురికి పంచాల్సిన పరిస్థితి ఉంది. ఇలాంటి సమయంలో శివరాజ్ కుమార్ అలియాస్ శివన్న నటించిన ఘోస్ట్ కోసం తమిళనాడు, తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లను కేటాయించే పరిస్థితి లేదని గుసగుస వినిపిస్తోంది. మల్టీప్లెక్సుల్లో గణపత్ కి పట్టంగడతారని కూడా అంచనా ఉంది.
దసరా బరిలో థియేటర్ల కోసం కొట్లాట పీక్స్ కు చేరుకోవడం ఘోస్ట్ కి ఇబ్బందిగా మారింది. శివరాజ్ కుమార్ ఘోస్ట్ అక్టోబర్ 22న వస్తుందా లేదా థియేటర్ల సమస్య వల్ల తెలుగు-తమిళంలో వారం ఆలస్యంగా అక్టోబర్ 27న వస్తుందా? అన్నది తేలలేదు. కన్నడలో మాత్రం అక్టోబర్ 22న ఈ చిత్రం విడుదలవుతోంది. అయితే రెండు వేర్వేరు తేదీల్లో విడుదలైతే ఆ సినిమాకి పాన్ ఇండియా రీచ్ ఉండడం కష్టమే. బ్లాక్ బస్టర్, సూపర్ డూపర్ హిట్ అంటే తప్ప ఇరుగు పొరుగు భాషల్లో ఆదరణ దక్కదు.
ఒక వారం ముందే ఘోస్ట్ రివ్యూలు వచ్చేస్తే, యావరేజ్ టాక్ వచ్చినా పొరుగు రాష్ట్రాల జనం దానికోసం థియేటర్లకు వెళ్లరు. అందువల్ల ఘోస్ట్ పాన్ ఇండియా ప్లాన్ వర్కవుటవ్వదని విశ్లేషిస్తున్నారు. అయితే ఘోస్ట్ మూవీ కోసం శివరాజ్ కుమార్ తీవ్రంగా శ్రమించారు. బడ్జెట్ల పరంగాను రాజీకి రాకుండా భారీ పెట్టుబడుల్ని పెట్టారు. కానీ ఇప్పుడు అమాంతం పెరిగిన పోటీవల్ల ఈ సినిమాని సజావుగా అనుకున్న రీతిలో రిలీజ్ చేయలేకపోతున్నారు. కంఠీరవ రాజ్ కుమార్ వారసుడి కంటే ముందే కేజీఎఫ్ స్టార్ యష్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. అందుకే ఇప్పుడు కాంపిటీషన్ లో నిలబడి శివన్న కూడా సత్తా చాటాల్సి ఉంటుందని విశ్లేషిస్తున్నారు.