రణబీర్ 'రామాయణం'లో శోభన కీలక పాత్ర!
కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన పద్మ పురస్కారాల్లో ప్రతిష్ఠాత్మక పద్మభూషణ్ అవార్డును అందుకున్నారు నటి, నర్తకి శోభన. రెండున్నర దశాబ్ధాల కెరీర్ లో ఐదు భాషల్లో శోభన దాదాపు 200 పైగా చిత్రాల్లో నటించారు.
By: Tupaki Desk | 29 Jan 2025 10:30 AM GMTకేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన పద్మ పురస్కారాల్లో ప్రతిష్ఠాత్మక పద్మభూషణ్ అవార్డును అందుకున్నారు నటి, నర్తకి శోభన. రెండున్నర దశాబ్ధాల కెరీర్ లో ఐదు భాషల్లో శోభన దాదాపు 200 పైగా చిత్రాల్లో నటించారు. కళ్లతోనే కోటిభావాలు పలికించగల అభినయనేత్రి మలయాళ చిత్రం మణిచిత్రతళు (1993), ఆంగ్ల చిత్రం మిత్ర- మై ఫ్రెండ్ ... లలో తన నటనకు ఉత్తమ నటిగా రెండు జాతీయ చలనచిత్ర అవార్డులను గెలుచుకున్నారు. జాతీయ పురస్కారాలతో పాటు, కెరీర్ లో ఎన్నో పురస్కారాలను సొంతం చేసుకున్నారు.
2025 పద్మ పురస్కారాల్లో పద్మభూషణ్ గుర్తింపు తర్వాత రణబీర్ కపూర్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న `రామాయణం`లో వెటరన్ నటి శోభన కీలక పాత్రకు ఎంపికైనట్టు కథనాలొస్తున్నాయి. నితీష్ తివారీ దర్శకత్వం వహిస్తున్న భారీ బడ్జెట్ చిత్రంలో శ్రీరాముడిగా రణబీర్ కపూర్ , సీతగా సాయి పల్లవి నటిస్తున్నారు. సన్నీడియోలో ఆంజనేయుడి పాత్రలో నటిస్తుండగా, బాబి డియోల్ ఓ కీలక పాత్రను పోషిస్తున్నారని కథనాలొచ్చాయి.
పాన్ ఇండియా కేటగిరీలో విడుదల కానున్న ఈ ప్రతిష్ఠాత్మక చిత్రంలో KGF ఫేమ్ యష్ రావణుడి పాత్రను పోషిస్తున్నారు. శోభన రావణుడి తల్లి కైకాశి పాత్రను పోషించనుందని, తన కెరీర్ లో మరపురాని పాత్రల్లో ఒకటిగా నిలుస్తుందని కథనాలొస్తున్నాయి. ఇటీవల పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్ కల్కి 2898 లో శోభన అతిథి పాత్రలో కనిపించారు. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ అవకాశాల్ని శోభన అందుకుంటున్నారు.
ప్రస్తుతం రామాయణం చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. రణబీర్ కపూర్ అభిమానులు ఘనమైన రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలో విజువల్ ఎఫెక్ట్స్, యానిమేషన్ కూడా ప్రధాన భూమికను పోషిస్తాయని కూడా తెలుస్తోంది. దీనికోసం నితీష్ బృందం అత్యంత భారీ బడ్జెట్‌ని కేటాయించింది. 2026 దీపావళి కానుకగా ఈ చిత్రం విడుదల కానుందని సమాచారం.