బాహుబలి 2@ 10 కోట్ల టికెట్లు... కేజీఎఫ్, ఆర్‌ఆర్‌ఆర్ సగమే!
ఈ విషయాన్ని స్వయంగా నిర్మాత శోభు యార్లగడ్డ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.
By: Tupaki Desk | 29 Oct 2024 8:30 PM GMTప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి 2 వచ్చి చాలా ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ ఆ సినిమా గురించి మాట్లాడుకుంటూనే ఉంటాం. సినిమాల కలెక్షన్స్ గురించిన చర్చ వచ్చిన సమయంలో బాహుబలి 2 సినిమా కలెక్షన్స్ ప్రస్థావన వస్తూనే ఉంటుంది. వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద రూ.1900 కోట్ల వసూళ్లు నమోదు చేసిన బాహుబలి 2 ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.1400 కోట్ల వసూళ్లు నమోదు చేసింది. వసూళ్ల విషయం పక్కన పెడితే బాహుబలి 2 సినిమాకు ఏకంగా 10 కోట్ల టికెట్లు అమ్మారట. ఈ విషయాన్ని స్వయంగా నిర్మాత శోభు యార్లగడ్డ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఇండియన్ సినీ చరిత్రలో ఇది అరుదైన రికార్డ్ అన్నారు.
శోభు యార్లగడ్డ ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... బాహుబలి 2 సినిమా 1900 కోట్ల రూపాయల వసూళ్లు నమోదు చేసింది. అప్పుడు టికెట్ల రేట్లు తక్కువగా ఉండేవి. సినిమాకు అంతటా కలిపి 10 కోట్లకు పైగా టికెట్లు అమ్మినట్లు ఆయన ప్రకటించారు. షోలే సినిమాకు అప్పట్లో 13 కోట్ల టికెట్లు అమ్ముడు పోయాయి అంటారు. ఆ తర్వాత ఆ స్థాయిలో ఏ సినిమాకు టికెట్లు అమ్ముడు పోలేదు. మళ్లీ బాహుబలి 2 సినిమా కు 10 కోట్ల టికెట్లు అమ్ముడు పోయాయి. ఇప్పటి వరకు మరే సినిమా ఆ దరిదాపుల్లోకి రాలేక పోయింది. ఆర్‌ఆర్‌ఆర్, కేజీఎఫ్ 2 సినిమాల వసూళ్లు కాస్త అటు ఇటుగా వచ్చినా, టికెట్లు మాత్రం అందులో కనీసం 50 శాతం కూడా కట్ అవ్వలేదు అన్నారు.
ఆర్‌ఆర్‌ఆర్, కేజీఎఫ్ 2 సినిమాలకు భారీ వసూళ్లు నమోదు అవ్వడానికి కారణం కచ్చితంగా టికెట్ల రేట్లు ఎక్కువ ఉండటం. టికెట్లు 10 కోట్లు అమ్ముడు అయ్యి ప్రస్తుతం ఉన్నట్లు టికెట్ల రేట్లు ఉంటే కచ్చితంగా మూడు వేల కోట్ల వసూళ్లు నమోదు అయినా ఆశ్చర్యం లేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మొత్తానికి బాహుబలి 2 రికార్డులు ఒకొక్కటి బ్రేక్ అవుతున్నాయని అంటున్నారు కానీ, 10 కోట్ల టికెట్ల అమ్మకాలు మాత్రం రాబోయే పదేళ్లలోనూ ఏ సినిమా బ్రేక్ చేయలేక పోవచ్చు. ఒక వేళ రాజమౌళి తన డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతంను రూపొందిస్తే అప్పుడు ఏమైనా ఆ రికార్డ్ బ్రేక్ అవుతుందేమో చూడాలి.
బాహుబలి 2 సినిమాలో ప్రభాస్ కు జోడీగా అనుష్క, తమన్నా లు నటించారు. తండ్రి కొడుకులుగా నటించిన ప్రభాస్ రెండు విభిన్నమైన పాత్రలో నటించి మెప్పించారు. కట్టప్ప పాత్రలో సత్యరాజ్ నటించారు. శివగామి దేవి పాత్రకు రమ్యకృష్ణ ప్రాణం పోశారు అనడంలో సందేహం లేదు. ఇక అత్యంత క్రూరమైన విలన్ పాత్రను రానా పోషించి ప్రతి ఒక్కరిని సర్‌ప్రైజ్ చేశాడు. భలాలదేవ పాత్ర రానా కెరీర్ బెస్ట్ గా ఎప్పటికీ నిలుస్తుంది అనడంలో సందేహం లేదు. బాహుబలి 2 సినిమా ఒక చరిత్రగా ఎప్పటికీ నిలుస్తుంది. తెలుగు సినిమా గురించి మాట్లాడుకున్న ప్రతి సారి బాహుబలి 2 గురించి మాట్లాడుకుంటూనే ఉంటారు అనడంలో సందేహం లేదు. బాహుబలి 2 సినిమాను తెలుగు సినిమాలే కాకుండా హిందీ సినిమాలు సైతం బీట్ చేయడం అసాధ్యం అని ప్రభాస్ ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు.