బాహుబలి నిర్మాతకి హ్యాకర్స్ షాక్
సోషల్ మీడియా ద్వారా చాలా యాక్టివ్‌గా ఉండే శోభు యార్లగడ్డ ఎక్స్ ద్వారా తన వాట్సాప్ అకౌంట్ హ్యాక్ అయ్యింది అంటూ ప్రకటించారు.
By: Tupaki Desk | 6 Dec 2024 6:25 AM GMTఇండియన్ సినీ చరిత్రలో నిలిచి పోయే బాహుబలి వంటి భారీ చిత్రాన్ని నిర్మించిన నిర్మాతల్లో శోభు యార్లగడ్డ ఒకరు. అభిరుచి ఉన్న నిర్మాతగా శోభుకి మంచి పేరు ఉంది. కంటెంట్ ఓరియంటెడ్ చిన్న సినిమాలను నిర్మిస్తూ ఉన్న శోభు యార్లగడ్డతో రాజమౌళికి అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. రాజమౌళి ప్రతి సినిమాకు శోభు యార్లగడ్డ ఏదో ఒక బాధ్యత నిర్వర్తిస్తూనే ఉంటారు. ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ దక్కడంలో శోభు పాత్ర కీలకం అంటూ ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతూ ఉంటుంది.
రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుతో చేయబోతున్న సినిమాకు సైతం శోభు యార్లగడ్డ ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరించడంతో పాటు మార్కెటింగ్ వ్యవహారాలు, అంతర్జాతీయ స్థాయిలో ప్రమోషన్ విషయాలను శోభు చూసుకోబోతున్నారు. శోభుపై రాజమౌళికి చాలా నమ్మకం అని అంతా అంటూ ఉంటారు. సోషల్ మీడియా ద్వారా చాలా యాక్టివ్‌గా ఉండే శోభు యార్లగడ్డ ఎక్స్ ద్వారా తన వాట్సాప్ అకౌంట్ హ్యాక్ అయ్యింది అంటూ ప్రకటించారు. తన వాట్సాప్ ద్వారా ఏదైనా మెసేజ్ వచ్చినా పరిగణలోకి తీసుకోవద్దు అంటూ సన్నిహితులకు, తన కాంటాక్స్‌లో ఉండే వారికి సూచించారు.
తన వాట్సాప్ అకౌంట్ హ్యాకర్స్ చేతుల్లోకి వెళ్లిందని, తాను లాగిన్ అయ్యేందుకు ప్రయత్నిస్తూ ఉంటే ఎక్కువ సార్లు లాగిన్ పిన్ తప్పుగా ఎంట్రీ చేయడం వల్ల మీరు లాగిన్ కాలేక పోతున్నారు అంటూ మెసేజ్ వస్తుంది అంటూ ఆయన చెప్పుకొచ్చారు. తాను తప్పు పిన్ ఎంటర్ చేయలేదని, తన వాట్సాప్ ను ఎవరో హ్యాక్ చేయడం వల్లే ఇలా జరిగిందని ఆయన పేర్కొన్నారు. వెంటనే ఈ విషయమై చర్యలు తీసుకోవాలి అంటూ వాట్సాప్, మెటాలను ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియా ద్వారా ఆయన విజ్ఞప్తి చేయడం జరిగింది.
సినిమా తారల యొక్క సోషల్ మీడియా అకౌంట్స్ హ్యాక్ కావడం మనం రెగ్యులర్‌గా చూస్తూనే ఉంటాం. అయితే వాట్సాప్ హ్యాక్ అవ్వడం మాత్రం రేర్‌గా మాత్రమే చూస్తూ ఉంటాం. ఇప్పుడు బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ యొక్క వాట్సాప్ అకౌంట్ హ్యాక్ కావడంతో చర్చనీయాంశంగా మారింది. ప్రతి ఒక్కరూ వాట్సాప్ అకౌంట్‌తో జాగ్రత్తగా ఉండాలని , తమ పిన్ విషయంలో మరింత సెక్యూరిటీతో ఉండాలని టెక్ నిపుణులు సూచిస్తూ ఉన్నారు. వాట్సాప్ ద్వారా ఎక్కువగా ఆర్థిక పరమైన విషయాలను చర్చిస్తే ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది.