మస్తాన్ సాయి డ్రగ్స్ వ్యవహారంలో నయా ట్విస్ట్!
హీరో రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య కేసు ఇప్పుడు మరో కీలక మలుపు తిరుగుతోంది.
By: Tupaki Desk | 7 Feb 2025 5:31 AM GMTహీరో రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య కేసు ఇప్పుడు మరో కీలక మలుపు తిరుగుతోంది. టాలీవుడ్ లో తీవ్ర సంచలనం రేపిన ఈ వ్యవహారంలో మస్తాన్ సాయిని పోలీసులు ముందే అదుపులోకి తీసుకున్నారు. లావణ్య పోలీసులకు అందజేసిన హార్డ్ డ్రైవ్ లో అనేక కీలక ఆధారాలు లభ్యమైనట్లు సమాచారం. మస్తాన్ సాయి రికార్డ్ చేసిన డ్రగ్స్ పార్టీ వీడియోల్లో ఉన్న వారిపై పోలీసులు దృష్టి పెట్టారు. ఈ వీడియోలు బయటకు వస్తే మరెంతమంది అసలైన నిజాలు వెలుగులోకి వస్తాయో అనే ఉత్కంఠ నెలకొంది.
పోలీసుల దర్యాప్తులో కొత్త విషయాలు బయటకొస్తున్నాయి. మస్తాన్ సాయి, అతని సహచరుడు చింటూ బెంగళూరు నుంచి హైదరాబాద్ కు డ్రగ్స్ రవాణా చేయాలని గుంటూరులో ఉన్న రాహుల్ అనే వ్యక్తికి ఆదేశాలు ఇచ్చినట్లు తేలింది. 130 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ ను రాహుల్ హైదరాబాద్ కు పంపగా, ఖాజా అనే వ్యక్తి లావణ్య ఇంట్లో పెట్టేందుకు వినియోగించినట్లు తెలుస్తోంది. ఇందుకోసం పక్కా స్కెచ్ వేసిన మస్తాన్ సాయి, లావణ్యను బ్లాక్ మెయిల్ చేసే ఉద్దేశంతోనే ఈ పథకం అమలు చేసినట్లు అధికారులు గుర్తించారు.
తాజా విచారణలో ఖాజాను పోలీసులు అదుపులోకి తీసుకుని 41A నోటీసులు ఇచ్చి వదిలివేశారు. అయితే, ఇక్కడే అసలైన ట్విస్ట్ చోటు చేసుకుంది. ఖాజా విచారణ అనంతరం తప్పించుకున్నాడని, ప్రస్తుతం అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారని తెలుస్తోంది. అంతేకాదు, ఖాజాతో పాటు ఈ డ్రగ్స్ వ్యవహారంలో మరో 10 మంది నిందితులు ఉండవచ్చని పోలీసుల అనుమానం. వీరి గురించి మరింత సమాచారం రాబట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
డ్రగ్స్ కేసులో ఇంత పెద్ద నెట్ వర్క్ బయటకు రావడం షాకింగ్ గా మారింది. మస్తాన్ సాయి గ్యాంగ్ ఇప్పటి వరకు ఎంత మందిని బలిపశువులను చేసిందో తెలియాల్సి ఉంది. లావణ్య ఇచ్చిన ఆధారాలతో విచారణ మరింత లోతుగా సాగుతుండగా, మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది. గతంలోనూ సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ వ్యవహారం తలెత్తగా, పెద్దగా ప్రగతి కనిపించలేదు. కానీ ఇప్పుడు లావణ్య ఫిర్యాదు, హార్డ్ డ్రైవ్ ఆధారంగా అధికారులు మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నారు.
పోలీసుల దర్యాప్తు వేగంగా కొనసాగుతున్న నేపథ్యంలో టాలీవుడ్ లో గుబులు రేగుతోంది. మరిన్ని పేర్లు బయటపడతాయా? మరెవరెవరు ఈ కేసులో ఇరుక్కొనబోతున్నారు? అనే ప్రశ్నలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఖాజా తప్పించుకోవడం వెనుక ఎవరైనా ఉన్నారా? అతని నుంచి మరిన్ని కీలక సమాచారం రాబట్టే అవకాశముందా? అన్న అంశాలపై పోలీసులు మరింత దృష్టి సారించినట్లు సమాచారం. ఈ డ్రగ్స్ కేసు టాలీవుడ్ ను కుదిపేస్తుందా.. సినీ రంగంలో మత్తు మాఫియా ఎంతవరకు ప్రభావం చూపుతోంది అనే ప్రశ్నలకు సమాధానం దొరికేంతవరకు విచారణ కొనసాగనుంది. మస్తాన్ సాయి, ఖాజా, చింటూ లింకులపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. దీంతో ఈ కేసు ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.