Begin typing your search above and press return to search.

వైవాహిక జీవితంలో విభేదాలు.. టాలీవుడ్ కో డైరెక్టర్ ఆత్మహత్య!

టాలీవుడ్ చిత్రాలకు స్క్రిప్టు రైటర్ గా.. కో డైరెక్టర్ గా పని చేసిన ఒకరు తాజాగా ఆత్మహత్యకు పాల్పడిన వైనం వెలుగు చూసింది.

By:  Tupaki Desk   |   12 Jun 2024 4:29 AM GMT
వైవాహిక జీవితంలో విభేదాలు.. టాలీవుడ్ కో డైరెక్టర్ ఆత్మహత్య!
X

టాలీవుడ్ చిత్రాలకు స్క్రిప్టు రైటర్ గా.. కో డైరెక్టర్ గా పని చేసిన ఒకరు తాజాగా ఆత్మహత్యకు పాల్పడిన వైనం వెలుగు చూసింది. హైదరాబాద్ లోని బోరబండలో ఈ విషాద ఉదంతం చోటు చేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా కో డైరెక్టర్ గా పని చేసిన 65 ఏళ్ల ఎస్ శివ ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లుగా గుర్తించారు. పలు టాలీవుడ్ చిత్రాలకు కో డైరెక్టర్ గా.. స్క్రిప్టు రైటర్ గా పని చేసిన శివకు భార్య.. ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

వారిద్దరికి పెళ్లిళ్లు అయ్యాయి. భార్యతో విభేదాల కారణంగా విడిగా ఉంటున్నారు. చాలా కాలం పాటు శ్రీక్రిష్ణ నగర్ లో ఉన్న ఆయన గత మార్చి నుంచి మకాం మార్చారు. బోరబండలోని రాజ్ నగర్ బస్తీలో ఒక ఇంటిని అద్దెకు తీసుకొని ఉంటున్నారు. అయితే.. రెండు రోజులుగా అతను ఉంటున్న ఇంటినుంచి దుర్గంధం వస్తోంది. అది మరింత పెరగటంతో అనుమానం వచ్చిన యజమాని పోలీసులకు సమాచారం అందించారు.

దీంతో పోలీసులు వచ్చి ఇంటి తలుపు తీసి చూడగా.. శివ ఉరి వేసుకున్న విషయాన్ని గుర్తించారు. అక్కడే ఐదు పేజీల లేఖ కనిపించింది. దాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసు వర్గాల అంచనా ప్రకారం శివ మరణించి మూడు రోజులు అయి ఉండొచ్చని.. అనారోగ్యం.. ఒంటరితనంతోనే ఆత్మహత్య చేసుకొని ఉంటారని భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న బోరబండ పోలీసులు విచారణ జరుపుతున్నారు.