డాడ్‌ని పొగిడేందుకు ఇతర హీరోలను తగ్గించాలా?
కానీ పాపులర్ సౌత్ స్టార్ హీరోయిన్ తన తండ్రిలోని విలక్షణత వైవిధ్యాన్ని కీర్తించేందుకు ఇతర హీరోలను తగ్గించి మాట్లాడటం ఇప్పుడు సదరు హీరోల అభిమానుల్లో చర్చకు కారణమైంది.
By: Tupaki Desk | 17 Feb 2024 6:30 PM GMTఒకరిని పొగిడేందుకు ఇంకొకరిని కించపరచడం సరైనది కాదు. కానీ పాపులర్ సౌత్ స్టార్ హీరోయిన్ తన తండ్రిలోని విలక్షణత వైవిధ్యాన్ని కీర్తించేందుకు ఇతర హీరోలను తగ్గించి మాట్లాడటం ఇప్పుడు సదరు హీరోల అభిమానుల్లో చర్చకు కారణమైంది. ఇంతకీ ఆ స్టార్ హీరోయిన్ ఏమని కామెంట్ చేసారు? అంటే...
చాలా మంది హీరోలకు కొత్తగా ప్రయత్నించే ధైర్యం ఉండదు. చాలా మంది స్టార్లు కొత్త తరహా పాత్రలతో ఇతర ప్రాంతాల్లో రాణించాలని కోరుకుంటారు.. కానీ కొందరు ధైర్యం లేక అలా చేయలేకపోతున్నారు. ఇక్కడే మా నాన్న కమల్ హాసన్ ప్రత్యేకంగా నిలుస్తారు. ఆయన కథల ఎంపిక ఇతర నటీనటులకు భిన్నంగా ఉంటుంది. ఆయన ధైర్యం తనను మిగతా వారి కంటే ప్రత్యేకంగా ఉంచుతుంది! అని శృతి హాసన్ చెప్పారు.
అలాగే తన తల్లిగారైన సారిక ధైర్యాన్ని కూడా శ్రుతి ప్రశంసించింది. ప్రస్తుత పరిస్థితుల్లో తన తల్లి కథానాయికగా ఉండి ఉంటే తన కెరీర్ మరోలా ఉండేదని అభిప్రాయపడింది. శృతి తన తల్లిని చాలా ధైర్యవంతురాలిగా అభివర్ణించారు.
అయితే తన తల్లిదండ్రుల ధైర్యసాహసాల గురించి ప్రస్థావించడం బావున్నా కానీ, ఇతర హీరోలను తగ్గించడం సరికాదనే అభిప్రాయం ఉంది. కమల్ హాసన్ కెరీర్ లో లెక్కలేనన్ని ప్రయోగాలు చేసారు. కానీ చిరంజీవి, నాగార్జున, విక్రమ్, సూర్య సహా చాలా మంది అగ్ర హీరోలు కూడా తమ కెరీర్ లో ప్రయోగాత్మక సినిమాలతో మెప్పించిన సందర్భాలున్నాయని కూడా అభిమానులు విశ్లేషిస్తున్నారు. నేటితరం హీరోలు చాలా ధైర్యంగా ప్రయోగాత్మక కంటెంట్ తో ముందుకు సాగడాన్ని అందరూ గమనిస్తున్నారు.
కెరీర్ విషయానికొస్తే.. ప్రస్తుతం అడివి శేష్ సరసన `డెకాయిట్` అనే చిత్రంలో శ్రుతి నటిస్తోంది. `చెన్నై స్టోరీ`..`సలార్ పార్ట్-2` లోను నటిస్తోంది. సంగీతం విషయంలోను తన ప్రాధాన్యత కొనసాగుతుందని శ్రుతి ఈ సందర్భంగా తెలిపింది.