సూపర్‌హీరో చిత్రంలో 'సాహో' బ్యూటీ
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన నటించింది శ్రద్ధా కపూర్. ఆ సినిమాలో శ్రద్ధా అందచందాలు, నటనకు అభిమానులు ముగ్ధులయ్యారు.
By: Tupaki Desk | 17 Dec 2024 12:30 AM GMTసాహో చిత్రంలో ప్రభాస్ సరసన నటించింది శ్రద్ధా కపూర్. ఆ సినిమాలో శ్రద్ధా అందచందాలు, నటనకు అభిమానులు ముగ్ధులయ్యారు. నిజానికి ఆషిఖి 2, ఏక్ విలన్ లాంటి చిత్రాలతో శ్రద్ధా ఇటు దక్షిణాదిలోను అభిమానులను సంపాదించుకుంది. ఈ బ్యూటీ ఇటీవలే స్త్రీ 2 లో నటించింది. ఈ సినిమా 2024లో బిగ్గెస్ట్ హిట్ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఈ ఏడాదిలో తూ జీ తూ మే మక్కర్, స్త్రీ 2 లాంటి హిట్ చిత్రాలతో అభిమానుల ముందుకు వచ్చిన ఈ బ్యూటీ తదుపరి చిత్రాన్ని ఇంకా ప్రకటించలేదు.
ప్రస్తుతం శ్రద్ధా ప్రకటన ఏమిటన్నది సస్పెన్స్ గా మారింది. నిజానికి సినిమాలకు సంతకం చేసే విషయంలో శ్రద్ధా కపూర్ చాలా సెలెక్టివ్‌గా ఉంది. 2020 చిత్రం స్ట్రీట్ డ్యాన్సర్ 3D తర్వాత `స్త్రీ 2`లో మాత్రమే కనిపించింది. ఆ తర్వాత మరో సినిమాని ప్రకటించలేదు. శ్రద్ధా కపూర్ ఓ సినిమాలో భాగమై నెలలు గడుస్తోంది. ఆమె సైన్ చేయబోయే తదుపరి ప్రాజెక్ట్ ఏది అనేది అంతు చిక్కక అభిమానులు ఉత్కంఠగా వేచి చూస్తున్నారు.
ఇంతలోనే రెడ్డిటర్లు తమకు తోచిన ఊహాగానాలను ప్రచారం చేస్తున్నారు. శ్రద్ధా గతంలో మాట్లాడిన ఒక వీడియోని వారు షేర్ చేసారు. ``కాబట్టి నా తదుపరి చిత్రం ఏమిటో ఇప్పుడే అధికారికంగా ప్రకటించలేను. జనవరిలో ప్రకటిస్తాను`` అని శ్రద్ధా అంటోంది వీడియోలో. ఇది విన్న తర్వాత శ్రద్ధా క్రిష్ 4లో భాగమవుతుందని అనుకుంటున్నట్టు నెటిజనులు ఊహించారు. క్రిష్ 4 గురించి జనవరిలో ప్రకటిస్తామని నిర్మాత రాకేష్ రోషన్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. దీంతో శ్రద్ధా ప్రకటన దానికి సమాంతరంగా ఉందని, క్రిష్ 4 గురించే ప్రకటిస్తుందని అంతా భావిస్తున్నారు. ఇంతలోనే ఈ బ్యూటీ దర్శకనిర్మాత సిద్ధార్థ్ ఆనంద్ కార్యాలయంలో కూడా కనిపించింది. సిద్ధార్థ్ ఆనంద్ తదుపరి టైగర్ వర్సెస్ పఠాన్ రూపకల్పనలో బిజీగా ఉన్నారు. ఈ సమయంలో అతడిని కలవడం అంటే కచ్ఛితంగా యష్ రాజ్ ఫిలింస్ లో శ్రద్ధా పని చేస్తోందని కూడా ఊహాగానాలు సాగుతున్నాయి. అలాగే ఏక్తాకపూర్ నిర్మించే నాగిన్ ఫ్రాంఛైజీలో కూడా శ్రద్ధా నటిస్తుందని ఊహాగానాలు సాగుతున్నాయి.