రియల్ ఎస్టేట్‌లో స్టార్ హీరోయిన్ భారీ పెట్టుబడులు
కోట్లాది రూపాయలు వెచ్చించి అపార్ట్ మెంట్లు కొనడం, వాటిని తక్కువ సమయంలో భారీ లాభాలకు అమ్మడం బాలీవుడ్ స్టార్లకు అలవాటు వ్యాపకం.
By: Tupaki Desk | 23 Jan 2025 1:30 AM GMTకోట్లాది రూపాయలు వెచ్చించి అపార్ట్ మెంట్లు కొనడం, వాటిని తక్కువ సమయంలో భారీ లాభాలకు అమ్మడం బాలీవుడ్ స్టార్లకు అలవాటు వ్యాపకం. బిగ్ బి అమితాబ్ బచ్చన్- అభిషేక్ నుంచి కపూర్ ఫ్యామిలీ స్టార్టు, ఒబెరాయ్ లు రియల్ వ్యాపారంలో తలమునకలుగా ఉన్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ కూడా అదే బాటలో వెళుతున్నారు. తన తండ్రి శక్తికపూర్ తో కలిసి రియల్ వెంచర్లలో శ్రద్ధా భారీ పెట్టుబడులు పెడుతున్నారు. ఒక చోట పెట్టుబడి పెట్టడం, తిరిగి దానిని అమ్మడం, మళ్లీ తెలివిగా లాభదాయకమైన అపార్ట్ మెంట్ లో పెట్టుబడి పెట్టడం, దానిని మళ్లీ సేల్ చేయడం ఇది హిందీ స్టార్లకు నిత్యవ్యాపకం. తద్వారా వారి నికర ఆస్తుల విలువ అమాంతం పెరుగుతోంది.
స్త్రీ 2 గ్రాండ్ సక్సెస్ తర్వాత శ్రద్ధా కపూర్ భారీ ప్యాకేజీని అందుకుంది. ఇప్పుడు ఆ డబ్బును రియల్ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడిగా పెట్టింది. తండ్రి శక్తి కపూర్ తో కలిసి శ్రద్ధా ముంబైలో రూ.6.24 కోట్ల విలువైన లగ్జరీ అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేసినట్లు తెలిసింది. ఈ ఆస్తి ప్రతిష్టాత్మక పిరమల్ మహాలక్ష్మి సౌత్ టవర్‌లో ఉంది. 13 జనవరి 2025న రిజిస్ట్రేషన్ జరిగినట్లు ఆన్ లైన్ లో పత్రాలు చెబుతున్నాయి. ఈ అపార్ట్‌మెంట్ 1042.73 చదరపు అడుగుల కార్పెట్ ఏరియాను కలిగి ఉంది. రెండు బాల్కనీలు ఉన్నాయని, అపార్ట్‌మెంట్ చదరపు అడుగుకు రూ. 59,875 చెల్లించారని తెలుస్తోంది. గ్లైడర్ బిల్డ్‌కాన్ రియల్టర్స్ ప్రై.లిమిటెడ్ నుంచి దీనిని శ్రద్ధా కొనుగోలు చేసారు. రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టడం శ్రద్ధాకు ఇప్పుడే కొత్త కాదు. గతంలోను పలు అపార్ట్ మెంట్ కొనుగోళ్లకు సంబంధించిన వివరాలు అంతర్జాలంలో వెల్లడయ్యాయి. ఇప్పుడు కొత్త పెట్టుబడి దానికి అదనంగా జత అయింది.
కెరీర్ మ్యాటర్ కి వస్తే... స్త్రీ 2 ఘనవిజయం తర్వాత కూడా శ్రద్ధా ఆచితూచి సినిమాలకు సంతకాలు చేస్తోంది. నేను వరుసగా సినిమాలకు సైన్ చేయడానికి తొందరపడనని, తనకు నచ్చితేనే సినిమా చేస్తానని శ్రద్ధా ఇటీవల చెప్పింది. దర్శకనిర్మాత నిఖిల్ ద్వివేది నాగిన్ కథను వినిపించారని, దానికి శ్రద్ధా ఓకే చెప్పిందని ఇంతకుముందు కథనాలొచ్చాయి. నాగిన్ గా నటించడానికి శ్రద్ధా వేచి ఉండలేదని కూడా వార్తలొచ్చాయి. గతంలో ఓసారి తెరపై నాగిన్ పాత్ర పోషించడం ఆనందాన్నిస్తుందని, శ్రీదేవి మేడమ్ ని నాగిన్ గా చూస్తూ, ఆరాధిస్తూ పెరిగానని శ్రద్ధా కపూర్ పేర్కొంది. అందుకే ఈ ప్రాజెక్టుకు శ్రద్ధా ఓకే చేసిందని భావిస్తున్నారు. ఇంకా అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది.