తమిళ్, మలయాళంలో కష్టం... శ్రేయా ఘోషల్ షాకింగ్ కామెంట్స్
శ్రేయా ఘోషల్ త్వరలో చెన్నై, కోయంబత్తూర్‌లో జరగబోతున్న లైవ్ కాన్సర్ట్‌లో పాల్గొనబోతుంది. చెన్నైలో మార్చి 1న, కోయంబత్తూర్‌లో మార్చి 15న లైవ్ కాన్సర్ట్‌ను నిర్వహించబోతున్నారు.
By: Tupaki Desk | 22 Feb 2025 2:30 AM GMTబాలీవుడ్, టాలీవుడ్‌తో పాటు పలు భాషల్లో వందల కొద్ది పాటలు పాడిన ప్రముఖ సింగర్ శ్రేయా ఘోషల్ లైవ్ మ్యూజికల్ కాన్సర్ట్స్ చేస్తూ ఎప్పుడూ బిజీగా ఉంటారు. దేశంలోని అన్ని ముఖ్య పట్టణాల్లో, నగరాల్లోనూ ఈమె లైవ్ కాన్సర్ట్‌లు జరిగాయి. విదేశాల్లోనూ ఈమె లైవ్ కాన్సర్ట్‌లు నిర్వహించారు. గత ఏడాదిలో హైదరాబాద్‌లో ఈమె చేసిన లైవ్ కాన్సర్ట్‌కి మంచి స్పందన వచ్చింది. వేలాది మంది ఈమె అభిమానులు కాన్సర్ట్‌కి తరలి వచ్చారు. పెద్ద ఎత్తున సక్సెస్ అయిన లైవ్ కాన్సర్ట్‌తో నిర్వాహకులు భారీగా లాభం పొందినట్లు సమాచారం ప్రస్తుతం తమిళనాట లైవ్ కాన్సర్ట్‌కి ఈమె రెడీ అవుతోంది.
శ్రేయా ఘోషల్ త్వరలో చెన్నై, కోయంబత్తూర్‌లో జరగబోతున్న లైవ్ కాన్సర్ట్‌లో పాల్గొనబోతుంది. చెన్నైలో మార్చి 1న, కోయంబత్తూర్‌లో మార్చి 15న లైవ్ కాన్సర్ట్‌ను నిర్వహించబోతున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. లైవ్ కాన్సెర్ట్‌లో భాగంగా నేడు చెన్నైలో మీడియా సమావేశంలో పాల్గొంది. ఆ సందర్భంగా శ్రేయా ఘోషల్ మాట్లాడుతూ... ఇన్ని సంవత్సరాలుగా తన పాటలను ప్రేక్షకులు ఆధరించడం చాలా సంతోషంగా ఉంది. భవిష్యత్తులోనూ తన పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుందని నమ్మకం వ్యక్తం చేసింది.
హిందీతో పాటు ఇతర భాషల్లో పాటలను పాడటం ఎప్పుడు ఇబ్బంది అనిపించదు. కానీ మలయాళం, తమిళ్‌లో పాటలు పాడే సమయంలో మాత్రం కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. ఈ రెండు భాషల్లో పాటలు పాడటం అంత ఈజీ కాదు. ఆ రెండు భాషల్లో పాటలను పాడటం కోసం ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. అందుకోసం ఎక్కువ సమయం తీసుకుని ప్రాక్టీస్ చేస్తానని చెప్పుకొచ్చింది. బుల్లి తెర షోల ద్వారా పాపులారిటీని సొంతం చేసుకున్న ఈమె ఎక్కువ శాతం హిందీ ఇతర భాషల్లో పాటలను పాడి అలరించింది.
తెలుగులో ఈ అమ్మడు ఎన్నో పాటలు పాడింది. స్టార్ హీరోల సినిమాలకు మోస్ట్ వాంటెడ్ సింగర్‌గా ఈ అమ్మడు నిలిచింది. ఏ రాష్ట్రంలో ఈమె లైవ్ కాన్సర్ట్ చేసినా అత్యధిక జనాలు రావడం మనం చూస్తూ ఉంటాం. ప్రస్తుతం ఈమె చేయబోతున్న చెన్నై, కోయంబత్తూర్ లైవ్ కాన్సర్ట్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దశాబ్ద కాలంగా ఇండియన్ సినీ ప్రేమికులను తన గాత్రంతో అలరిస్తున్న శ్రేయా ఘోషల్ తెలుగులో మరిన్ని పాటలు పాడాలని కోరుకునే అభిమానులు చాలా మంది ఉన్నారు.