సూపర్ స్టార్ చివరి సినిమాలో శృతి ఎంట్రీ..!
దాంతో మరోసారి వీరి కాంబోలో సినిమా రాలేదు. మళ్లీ ఇన్నాళ్లకు విజయ్ చివరి సినిమాలో శృతి హాసన్‌కు నటించే అవకాశం దక్కింది.
By: Tupaki Desk | 10 Feb 2025 5:30 PM GMTతమిళ్ సూపర్ స్టార్ విజయ్ రాజకీయ అరంగేట్రం చేసిన నేపథ్యంలో సినిమాల నుంచి తప్పుకోబోతున్నాడు. చివరగా జన నాయగన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. షూటింగ్ స్పీడ్‌గా జరుగుతున్న ఈ సినిమాను ఇదే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు గాను ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్‌గా శృతి హాసన్ నటించబోతుందనే వార్తలు వస్తున్నాయి. దాదాపు పదేళ్ల క్రితం వీరిద్దరు కలిసి పులి అనే సినిమాలో నటించారు. బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. దాంతో మరోసారి వీరి కాంబోలో సినిమా రాలేదు. మళ్లీ ఇన్నాళ్లకు విజయ్ చివరి సినిమాలో శృతి హాసన్‌కు నటించే అవకాశం దక్కింది.
హెచ్ వినోద్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో ఒక హీరోయిన్‌గా ఇప్పటికే పూజా హెగ్డే నటిస్తున్న విషయం తెల్సిందే. పూజా హెగ్డే పై కొన్ని సీన్స్ సైతం చిత్రీకరణ చేశారు. ఈ సమయంలో మరో హీరోయిన్‌గా శృతి హాసన్ అంటూ వస్తున్న వార్తలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకునే విధంగా జన నాయగన్ సినిమాను రూపొందించే ఉద్దేశ్యంతో ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. పైగా ఈ సినిమా విజయ్ కెరీర్‌లో చివరి సినిమాగా నిలువబోతున్న కారణంగా ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. అందుకే ఈ సినిమాకు ఎక్కడా రాజీ పడటం లేదని దర్శకుడు వినోద్ చెప్పుకొచ్చారు.
తాజాగా సినిమాలో శృతి హాసన్ హీరోగా నటిస్తున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో స్టార్ కాస్టింగ్ విషయంలో ఏమాత్రం తగ్గడం లేదని తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్ నటుడు బాబీ డియోల్ ఈ సినిమాలో విలన్ రోల్‌లో కనిపించబోతున్నారు. ఇక విజయ్‌కి పలు మ్యూజికల్ హిట్స్‌ను అందించిన సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచంద్రన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నాడు. దాదాపుగా రూ.300 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాని తమిళ్‌లో మాత్రమే కాకుండా హిందీ, తెలుగు, మలయాళ భాషల్లోనూ అత్యధిక స్క్రీన్స్‌లో విడుదల చేసే విధంగా ముందు నుంచే ప్లాన్ చేస్తున్నారు. విజయ్ పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టిన తర్వాత వస్తున్న మొదటి, చివరి మూవీ ఇదే కావడంతో ఫ్యాన్స్‌లో ఆసక్తి నెలకొంది.
కమల్ నట వారసురాలు శృతి హాసన్ సౌత్‌తో పాటు బాలీవుడ్‌లోనూ వరుసగా సినిమాలు చేస్తుంది. స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు దక్కించుకున్నా ప్రతి సినిమాలోనూ హీరోయిన్‌గానే నటించాలి, ప్రతి సినిమాలోనూ అదిరి పోయే విధంగా నటించేందుకు స్కోప్ దక్కాలని శృతి హాసన్ కోరుకోదు. తనకు వచ్చిన ఆఫర్లను సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళ్లడం మాత్రమే చూస్తూ ఉంది. అందులో భాగంగానే జన నాయగన్ సినిమాలోనూ సెకండ్ హీరోయిన్ పాత్రకు ఓకే చెప్పి ఉంటుందనే టాక్ వినిపిస్తుంది. సినిమాలో ఆమె పాత్రపై క్లారిటీ రావాల్సి ఉంది. తెలుగులో శృతి హాసన్ కొత్త సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.