క్రికెటర్‌తో నటి డేటింగ్... మళ్లీ అవే పుకార్లు
టీం ఇండియా యువ స్టార్ క్రికెటర్ శుభ్‌మాన్ గిల్ ప్రేమలో ఉన్నాడనే వార్తలు చాలా రోజులుగా వస్తున్న విషయం తెల్సిందే.
By: Tupaki Desk | 11 March 2025 1:02 PM ISTటీం ఇండియా యువ స్టార్ క్రికెటర్ శుభ్‌మాన్ గిల్ ప్రేమలో ఉన్నాడనే వార్తలు చాలా రోజులుగా వస్తున్న విషయం తెల్సిందే. నటి అవనీత్ కౌర్‌తో గిల్ డేటింగ్‌లో ఉన్నాడంటూ గత కొన్నాళ్లుగా మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇద్దరు కలిసి ఉన్న ఫోటోలు ఒకటి రెండు సోషల్ మీడియాలో కనిపించడంతో పుకార్లు పుట్టుకు వస్తున్నాయి. అవనీత్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేసిన ఒక ఫోటో కారణంగా గిల్ తో డేటింగ్‌లో ఉందంటూ ప్రచారం మొదలైంది. ఇటీవల దుబాయ్‌లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌ను చూసేందుకు గాను అవనీత్ దుబాయ్ వెళ్లింది. దాంతో మరోసారి వీరి గురించి బాలీవుడ్ మీడియా పెద్ద ఎత్తున కథనాలు అల్లేస్తుంది.
అత్యంత కీలకమైన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌కి టీం ఇండియా క్రికెటర్స్‌కి చెందిన ఫ్యామిలీ మెంబర్స్ హాజరు అయ్యారు. పెళ్లి చేసుకున్న వారి భార్యలు, వారి పిల్లలు హాజరు అయితే, పెళ్లి కాని క్రికెటర్ యొక్క కుటుంబ సభ్యులు, ప్రేమలో ఉంటే లవర్స్ హాజరు అయ్యారు. కొందరు రహస్యంగా తమ ప్రియుడిని చీర్స్ చేసేందుకు వెళ్తే, కొందరు మాత్రం బాహాటంగానే కనిపించారు. గిల్ కోసం అవనీత్ వెళ్లిందని బాలీవుడ్ మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వస్తున్నాయి. ఆమె మాత్రం తాను క్రికెట్‌ను ఆస్వాదించేందుకు వచ్చాను అన్నట్లుగా సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది.
గతంలో వీరిద్దరూ కలిసి దిగిన ఫోటో ఆధారంగా వీరు ప్రేమలో ఉన్నారని కన్ఫర్మ్ చేస్తూ బాలీవుడ్ మీడియా గతంలోనే వార్తలను ప్రచారం చేసింది. ఆ సమయంలోనే అవనీత్ సోషల్ మీడియా ద్వారా పుకార్లను కొట్టి పారేసింది. అయినా మీడియాలో కథనాలు మాత్రం ఆగడం లేదు. అవనీత్, రాఘవ్ శర్మతో ప్రేమలో ఉందనే వార్తలు వచ్చాయి. అయితే కొన్ని కారణాల వల్ల విడిపోయారు. గిల్ ను రాఘవ్ శర్మ ద్వారానే అవనీత్ కలిసిందని, పరిచయం ఏర్పడిందని బాలీవుడ్ మీడియా వర్గాల వారు అంటూ ఉంటారు. అసలు విషయం ఏంటి అనేది అవనీత్, గిల్‌కే తెలియాలి.
అవనీత్ కౌర్ ఇటీవల దుబాయ్‌కి వెళ్లి క్రికెట్ మ్యాచ్ చూడటంతో బాలీవుడ్ మీడియాలో మరింత బలంగా ఈ వార్తలు వస్తున్నాయి. ఇంతకు మించిన సాక్ష్యం ఏం కావాలి అన్నట్లుగా కొందరు సోషల్ మీడియా ద్వారా గిల్, అవనీత్ డేటింగ్ పుకార్లు ప్రచారం చేస్తున్నారు. ఇద్దరు పదే పదే ఏం లేదని చెప్తున్నా మళ్లీ మళ్లీ అవే పుకార్లు పుట్టుకు వస్తున్నాయి. ప్రస్తుతానికి గిల్ తన దృష్టి మొత్తం ఆట మీదే కేంద్రీకృతం చేశాడు. కనుక ప్రేమ విషయమై ఇప్పట్లో ఆలోచన చేయక పోవచ్చు అని ఆయన సన్నిహితులు అంటూ ఉంటారు. ఈ పుకార్లకు మరోసారి గిల్ లేదా అవనీత్ స్పందిస్తారేమో చూడాలి.