కామెడీ కోసం చేస్తే, కొంప ముంచుతోందిగా..!
బ్రో మూవీ లో అంబటి ని ఇమిటేట్ చేశారు, కామెడీ డ్యాన్సులు వేయించారు అనే విషయం తప్పితే, మిగిలిన సినిమా గురించి ఎవరూ చర్చించుకోవడం లేదు.
By: Tupaki Desk | 2 Aug 2023 1:06 PM GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే చాలు ఫ్యాన్స్ ఎగపడి థియేటర్లలోకి అడుగుపెడుతూ ఉంటారు. స్పెషల్ గా అన్ని సినిమాల కు లాగా ప్రమోషన్స్ చేయాల్సిన అవసరం పెద్దగా ఉండదు. దాదాపు ఆయన మూవీ ల ప్రమోషన్స్ చాలా తక్కువగా జరుగుతూ ఉంటాయి. ఒకవేళ చేసినా, ఆయన అసలు పాల్గొనరు. ఆ బాధ్యతను మిగిలినవారు తీసుకుంటారు. వకీల్ సాబ్ సమయం లో నివేదా థామస్, అంజలి ఆ బాధ్యతను తీసుకున్నారు. ఇక బ్రో మూవీ విషయంలో సాయి ధరమ్ తేజ్ మూవీ ని జనాల్లోకి పాజిటివ్ గా తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఓవైపు తేజ్ ఈ మూవీ చాలా బాగుందని, ఎమోషనల్ గా సాగుతుంది అని అందరూ చూడాలి అంటూ కోరుతుంటే, మరో వైపు ఒక్క సీన్ కారణంగా, ఈ మూవీ పై నెగిటివ్ ఇంప్రెషన్ పెరుగుతుండటం గమనార్హం. అదే శ్యాంబాబు టాపిక్. నిజానికి ఈ మూవీ ఒక వ్యక్తి కి చనిపోయిన తర్వాత, మళ్లీ మరో ఛాన్స్ అంటూ జీవితం లభిస్తుంది. అలాంటి సమయాన్ని అతను ఎలా ఉపయోగించుకున్నాడు అనేదే ఈ కథ. అయితే, ఇంత ఎమోషనల్ మూవీ లో స్పెషల్ గా ఏదో బలవంతంగా చొప్పించినట్లుగా ఈ శ్యాంబాబు క్యారెక్టర్ ని ప్రవేశపెట్టారు.
మూవీ లో ఆ సీన్ చూడటానికి సరదాగానే ఉంది. కానీ, దానిని మంత్రి అంబటి రాంబాబు ని ఇమిటేట్ చేస్తూ పెట్టడం ఇప్పుడు వివాదానికి కారణమైంది. నిజానికి శ్యాంబాబు పాత్ర పెట్టాల్సిన అవసరం లేదు. కానీ, పెట్టారు. అలా పెట్టిన దానిని చూసీ, చూడనట్లుగా వదిలేయకుండా, మంత్రి అంబటి దాని ని జీడిపాకం లాగా లాగుతూనే ఉన్నారు.
ప్రెస్ మీట్లు పెట్టి మరీ పవన్ ని , డైరెక్టర్ త్రివిక్రమ్ ని తిడుతూ వార్నింగ్ లు ఇస్తున్నారు. అంతేకాకుండా, సినిమా ప్లాప్ అని, వసూళ్లు కూడా రావు అంటూ, నిర్మాత బ్లాక్ మనీ ఈ సినిమా కోసం పెట్టాడు అంటూ కూడా చెప్పాడు. అసలు ఆ పాత్ర అంబటి గురించి కాదు అని నిర్మాత చెప్పే ప్రయత్నం చేస్తున్నా ఆయన వినిపించుకోవడం లేదు. ఆయనే కాదు, అది అంబటి ని ఇమిటేట్ చేసేలా పెట్టలేదు అంటే ఎవరూ నమ్మరు.
అయితే, ఇప్పుడు ఈ విషయం ఎలా మారింది అంటే, బ్రో మూవీ లో అంబటి ని ఇమిటేట్ చేశారు, కామెడీ డ్యాన్సులు వేయించారు అనే విషయం తప్పితే, మిగిలిన సినిమా గురించి ఎవరూ చర్చించుకోవడం లేదు. సినిమా లోని మొయిన్ కంటెంట్ వదిలేసి, జనాలు కూడా కేవలం దీని గురించే చర్చించుకోవడం విశేషం. ఈ రకం ప్రచారం, మూవీ కలెక్షన్ల పై ఎక్కువ ప్రభావం చూపుతోందని తెలుస్తోంది. మరి ఈ వివాదానికి పులిస్టాప్ పడేది ఎప్పుడో.