Begin typing your search above and press return to search.

గుంటూరు కారం ప్రీరిలీజ్ వేడుకలో గాయాలైన ఎస్ఐ.. ఇతరులు

దీంతో.. ఎంట్రన్స్ గేటు వద్ద ఫ్యాన్స్ పెద్ద ఎత్తున పోటెత్తారు. ఒక్కసారిగా పెరిగిన ఒత్తిడి వేళ.. ప్రధాన గేటును తెరిచారు. దీంతో.. పెద్ద ఎత్తున తోపులాట చోటు చేసుకుంది.

By:  Tupaki Desk   |   10 Jan 2024 4:26 AM GMT
గుంటూరు కారం ప్రీరిలీజ్ వేడుకలో గాయాలైన ఎస్ఐ.. ఇతరులు
X

మోస్ట ఎవైటింగ్ మూవీగా మారిన 'గుంటూరు కారం' ఇప్పుడు హాట్ టాపిక్ గా మారటం తెలిసిందే. సంక్రాంతి రేసులో భాగంగా విడుదల అవుతున్న ఈ మూవీ ప్రిరిలీజ్ ఫంక్షన్ ను గుంటూరు జిల్లా పెదకాకానిలోని నంబూరు శివారులో నిర్వహించారు. ఒక ప్రైవేటు స్థలంలో నిర్వహించిన ఈ వేడుకలో భారీ ఎత్తున వచ్చిన అభిమానుల కారణంగా తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ సందర్భంగా ఫ్యాన్స్ కే కాదు.. పోలీసులు గాయాల పాలయ్యారు. ఇంతకూ అలాంటి పరిస్థితి ఎందుకు చోటు చేసుకున్నదన్నది చూస్తే..

'గుంటూరు కారం' చిత్ర ప్రీరిలీజ్ వేడుక మంగళవారం సాయంత్రం ఆరు గంటల వేళలో ప్రారంభమైంది. దీనికి భారీగా అభిమానులు హాజరయ్యారు. దీంతో.. ఎంట్రన్స్ గేటు వద్ద ఫ్యాన్స్ పెద్ద ఎత్తున పోటెత్తారు. ఒక్కసారిగా పెరిగిన ఒత్తిడి వేళ.. ప్రధాన గేటును తెరిచారు. దీంతో.. పెద్ద ఎత్తున తోపులాట చోటు చేసుకుంది. ఈ సమయంలోనే అక్కడ ఏర్పాటు చేసిన ఇనుప బ్యారికేడ్ పడిపోవటంతో అక్కడే విధులు నిర్వర్తిస్తున్న ఓల్డ్ గుంటూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ వెంకట్రావు కాలి మీద పడింది. దీంతో.. ఆయన కాలు విరిగింది. వెంటనే ఆయన్ను గుంటూరులోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించి.. చికిత్స జరిపారు.

అభిమానుల్ని నియంత్రించే విషయంలో చోటు చేసుకున్నతప్పులు అభిమానులకు శాపంగా మారింది. రద్దీ పెరిగే వరకూ అభిమానుల్ని వేదిక ప్రాంతానికి అనుమతించకపోవటం ఒక ఎత్తు అయితే.. ఒక్కసారిగా అనుమతి ఇవ్వటంతో లోపలకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఈ వేదిక నేషనల్ హైవేకు సమీపంలో ఉండటంతో.. సామర్థ్యానికి మించి నిర్వాహకులు పాసులు జారీ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. చాలా కాలం తర్వాత విడుదలవుతున్న మహేశ్ బాబు సినిమా మీద ఆయన అభిమానుల అంచనాలు భారీగా ఉండటంతో పాటు.. పెద్ద ఎత్తున చేరుకోవటం.. వారి అత్యుత్సాహంతో పలువురు గాయపడినట్లుగా చెబుతున్నారు.

వేదికకు దగ్గర్లోని రేకుల షెడ్డు మీదకు ఎక్కిన అభిమానుల దెబ్బకు.. ఆ షెడ్డు కూలింది. ఈ ఉదంతంలో నలుగురు గాయపడ్డారు. గుంటూరు కారం ప్రీరిలీజ్ ఫంక్షన్ పుణ్యమా అని జాతీయ రహదారిపై వాహనాల రద్దీ భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలో టూవీలర్లు ఢీ కొన్న ఉదంతంలో మరో ఐదుగురు అభిమానులు గాయపడ్డారు. మొత్తంగా ప్రశాంతంగా.. ఫండుగ వాతావరణంలో జరగాల్సిన ప్రీరిలీజ్ ఫంక్షన్ రచ్చరచ్చగా మారిందంటున్నారు. సరైన ప్లానింగ్ లేకపోవటం.. ఈ కార్యక్రమానికి హాజరయ్యే అభిమానుల అంచనా ఎంతన్న విషయంలో జరిగిన తప్పులే ఈ మొత్తానికి కారణంగా చెబుతున్నారు.