Begin typing your search above and press return to search.

కొత్తవి లైట్.. పాతదానికి పిచ్చ క్రేజ్

ఐతే గత ఏడాది చిన్నా అనే అనువాద చిత్రంతో పలకరించిన సిద్ధుకు చేదు అనుభవం ఎదురైంది. దీనికి బిజినెస్ జరగక ఇబ్బంది పడుతూ

By:  Tupaki Desk   |   16 Feb 2024 10:18 AM GMT
కొత్తవి లైట్.. పాతదానికి పిచ్చ క్రేజ్
X

తమిళ నటుడు సిద్దార్థ్‌కు కెరీర్ బిగ్గెస్ట్ హిట్లన్నీ తెలుగులోనే వచ్చాయి. అతను స్టార్ హీరో హోదా అనుభవించింది, మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది తెలుగులోనే. నువ్వొస్తానంటే నేనొద్దంటానా లాంటి బ్లాక్ బస్టర్ మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన అతను.. ఆ తర్వాత బొమ్మరిల్లు రూపంలో మరో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఆ తర్వాత మరి కొన్ని చిత్రాలు బాగా ఆడాయి. కానీ ఒక దశ దాటాక వరుస డిజాస్టర్లతో అతను వెనుకబడిపోయాడు. చివరికి టాలీవుడ్‌ నుంచి ఖాళీ చేసి తన సొంత ఇండస్ట్రీ అయిన కోలీవుడ్‌కు వెళ్లిపోయాడు. అక్కడ కూడా కెరీర్ గొప్పగా ఏమీ లేదు కానీ.. బండి అయితే ఎలాగోలా నడుస్తోంది. కొన్నేళ్ల నుంచి అనువాద చిత్రాలతో తెలుగులో తిరిగి ఫాలోయింగ్ సంపాదించాలని చూస్తున్నాడు సిద్ధు. కానీ ఫలితం ఉండట్లేదు. స్ట్రెయిట్ మూవీ మహాసముద్రం కూడా నిరాశపరిచింది.

ఐతే గత ఏడాది చిన్నా అనే అనువాద చిత్రంతో పలకరించిన సిద్ధుకు చేదు అనుభవం ఎదురైంది. దీనికి బిజినెస్ జరగక ఇబ్బంది పడుతూ.. ఒకప్పటి తన వైభవాన్ని గుర్తు చేసుకుని ఫీలయ్యాడు సిద్ధు. ఈ ఒక్క సినిమా చూడండి, నచ్చకపోతే మళ్లీ ఇంకో సినిమాతో రాను అన్నాడు సిద్ధు. అతను అంత ఆవేదనతో మాట్లాడినా.. మంచి సినిమా అయిన చిన్నాను ఆదరించలేదు తెలుగు ప్రేక్షకులు. కట్ చేస్తే.. సిద్ధు పాత సినిమా, అది కూడా డిజాస్టర్ అయిన ‘ఓయ్’ని రీ రిలీజ్ చేస్తే అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. వేలంటైన్స్ డే వీకెండ్లో వేరే సినిమాలు కూడా రిలీజయ్యాయి కానీ.. ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది ఈ చిత్రమే. పలు థియేటర్లు హౌస్ ఫుల్స్‌తో నడిచాయి. ఈ రెస్పాన్స్ చూసి సిద్ధు సైతం హైదరాబాద్ వస్తున్నాడు. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ శాంతి థియేటర్లో అభిమానులతో కలిసి షో చూడబోతున్నాడు. ఈ షో చూస్తూ ఒకప్పటి తన వైభవాన్ని గుర్తు చేసుకుని సిద్ధు మరోసారి ఎమోషనల్ అవడం ఖాయం.