అత్యాచారం కేసులో గంటల్లోనే బెయిల్!
అత్యాచారం కేసులో మలయాళ నటుడు సిద్దీఖిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 7 Dec 2024 9:51 AM GMTఅత్యాచారం కేసులో మలయాళ నటుడు సిద్దీఖిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో ఆయనకు గంటల వ్యవధిలోనే బెయిల్ రావడం ఓ సంచలనం. కేసు నిమిత్తం ఆయన శుక్రవారం దర్యాప్తు సంస్థ ముందు హాజరయ్యారు. ఈ క్రమంలోనే ఆయన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో హాజరు పరిచారు. అక్కడ ఆయనకు బెయిల్ దొరకడంతో విడుదలయ్యారు.
నవంబర్ లోనే సిద్దీకికి సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ గడువు ముగియడంతోనే సిద్దీఖిని పోలీసులు అరెస్ట్ చేసారు. ఈ అరెస్ట్ ఇండస్ట్రీలో సంచలనమైంది. జస్టిస్ హేమ కమిటీ నివేదిక నేపథ్యంలో నటి రేవతి సిద్దీఖిపై అత్యాచారం ఆరోపణలు చేసారు. ఓ ప్రభుత్వ హోటల్ లో తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఇటీవల ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రతీగా సిద్దిఖీ కూడా రేవతిపై రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేసారు.
రేవతి కావాలనే ఇలాంటి ఆరోపణలు చేస్తుందని, తన పరువు ప్రతిష్టలు దిగజార్చాలనే ఇలాంటి కుట్ర పన్నిందని ఫిర్యాదు చేసారు. ఇప్పటికే ఆమె ఎన్నో సందర్బాల్లో ఇలాంటి ఆరోపణలు చేసిందని దీనిపై తగిన చర్యలు తీసుకో వాలని డీజీపీని కోరారు. రేవతి అత్యాచారం ఆరోపణలు నేపథ్యంలో సిద్దీకి ముందస్తు బెయిల్ పిటీషన్ కేరళ హైకోర్టులో వేయగా దాన్ని కోర్టు కొట్టేసింది. దీంతో సిద్దీఖి సుప్రీంకోర్టును ఆశ్రయించగా ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
జస్టిస్ హేమ కమిటీ నివేదిక ఆ మధ్య దేశ వ్యాప్తంగా ఎంత సంచలనమైందో తెలిసిందే. నివేదిక ఒక్కసారిగా అన్ని పరిశ్రమల్లోనూ కలకలం రేపింది. బాధిత మహిళలు ఒక్కొకరుగా బయటకు వచ్చి తమకు జరిగిన అన్యాయం గురించి చెబుతుంటే? అన్ని చిత్ర పరిశ్రమలు ముక్కున వేలేసుకున్నాయి. తమ ఇండస్ట్రీలో ఎలాంటి పరిస్థితులున్నాయో తెలుసుకునే ప్రయత్నం మొదలు పెట్టాయి.