Begin typing your search above and press return to search.

స్టార్ హీరోయిన్‌కి సిక్కుల బెదిరింపులు?

ఇలాంటి స‌మ‌యంలో కంగ‌న ఎమ‌ర్జెన్సీ రిలీజ్ చిక్కుల్లో ప‌డ‌టం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

By:  Tupaki Desk   |   29 Aug 2024 7:38 AM GMT
స్టార్ హీరోయిన్‌కి సిక్కుల బెదిరింపులు?
X

క్వీన్ కంగ‌న సిక్కుల నుంచి వ్య‌తిరేక‌త‌ను ఎదుర్కొంటోందా?.. అంటే అవున‌నే తాజా స‌న్నివేశం చెబుతోంది. ఎమ‌ర్జెన్సీ చిత్రంలో సిక్కుల‌ను వేర్పాటు వాదులుగా చూపించార‌నేది వారి ప్ర‌ధాన ఆరోప‌ణ‌. ఇందిరమ్మ చిత్రంలో త‌మ‌ను విల‌న్లుగా కంగ‌న చిత్రీక‌రించింద‌ని వ్య‌తిరేకిస్తున్నారు. కంగ‌న‌ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న‌ హిమ‌చ‌ల్ ప్ర‌దేశ్ `మండి`కి కూత‌వేటు దూరంలో ఉండే చంఢీఘ‌డ్, పంజాబ్ నుంచి సిక్కులు పెద్ద ఎత్తున భాజ‌పా నాయ‌కురాలు కం న‌టి అయిన కంగ‌న‌ను వ్య‌తిరేకిస్తున్నారు. అంతేకాదు కంగ‌న న‌టిస్తున్న తాజా చిత్రం ఎమ‌ర్జెన్సీ రిలీజ్ కి సిక్కు క‌మ్యూనిటీ అడ్డంకిగా మారింది. ఈ చిత్రం త‌మ‌పై కుట్ర‌పూరితంగా ఉద్ధేశ‌పూర్వ‌కంగా చిత్రీక‌రించిన‌ది అని వారు పేర్కొంటున్నారు. దిల్లీ ఉద్య‌మంలో సిక్కు రైతుల నిర‌శ‌న‌ల‌కు వ్య‌తిరేకంగా, భాజ‌పా ఎన్డీయేకు అనుకూలంగా వ్యాఖ్యానించిన కంగ‌న‌పై సిక్కులు చాలా కోపంగా ఉన్నార‌న్న‌ది ఇప్ప‌టికే జ‌గ‌మెరిగిన స‌త్యం. ఇలాంటి స‌మ‌యంలో కంగ‌న ఎమ‌ర్జెన్సీ రిలీజ్ చిక్కుల్లో ప‌డ‌టం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

కార‌ణం ఏదైనా కంగ‌న న‌టించిన `ఎమర్జెన్సీ` విడుదలకు ముందే లీగల్ నోటీసు అందుకుంది. మంగళవారం నాడు.. శిరోమణి గురుద్వారా పర్బంధక్ కమిటీ (SGPC) ఈ నెల ప్రారంభంలో విడుదల చేసిన ఎమ‌ర్జెన్సీ ట్రైలర్‌ను తొలగించాలని కోరుతూ కంగనా సహా చిత్ర నిర్మాతలకు నోటీసు పంపింది. ఎస్‌జిపిసి సెక్రటరీ పర్తాప్ సింగ్ ఈ చిత్రంపై తన అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. ఎమర్జెన్సీ చిత్రాన్ని నిషేధించాలని కేంద్ర సమాచార ప్రసార శాఖ‌ మంత్రికి, అలాగే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ చైర్‌పర్సన్‌కు వేర్వేరు లేఖలు కూడా రాసినట్లు వెల్లడించారు. సిక్కుల మనోభావాలను రనౌత్ దెబ్బతీశారని ఈ లేఖ‌ల్లో ఆరోపించారు. సినిమా ట్రైలర్ విడుదలైన తర్వాత అనేక `సిక్కు వ్యతిరేక సన్నివేశాలు వెలుగులోకి వచ్చాయని` వారు లేఖ‌ల్లో పేర్కొన్నారు.

గత వారం గురుద్వారా GDPC- అఖల్ తఖ్త్ సిక్కులకు వ్యతిరేకంగా సినిమా కథనాన్ని సృష్టించడం ద్వారా `క్యారెక్టర్ హత్య` చేయడానికి ప్రయత్నిస్తున్నారని పేర్కొంటూ, సినిమాపై వెంటనే నిషేధం విధించాలని వారు డిమాండ్ చేశారు. SGPC చీఫ్ హర్జిందర్ సింగ్ ధామి రనౌత్‌పై ఎఫ్‌ఐఆర్ న‌మోదు చేయాల‌ని కోరుతూ విలేకరుల సమావేశంలో ప్రసంగించారు. కంగ‌న తాజా చిత్రంపై తీవ్ర‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో కూడా సినిమాల్లో సిక్కు కమ్యూనిటీని తప్పుగా చూపించి మనోభావాలను దెబ్బతీసిన సందర్భాలు చాలా ఉన్నాయని పేర్కొన్నారు. సినిమాపై నిషేధం విధించాల‌ని కోరుతూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC)ని వారు నిందించారు. ప‌క్ష‌పాతం లేకుండా సెన్సార్ బోర్డులో సిక్కు సభ్యులను చేర్చాలని డిమాండ్ చేసారు.

ఎమ‌ర్జెన్సీ చిత్రంలో ``ఉద్దేశపూర్వకంగా సిక్కుల పాత్రను వేర్పాటువాదులుగా తప్పుగా చిత్రీకరించార‌ని.. ఇది పెద్ద‌ కుట్రలో భాగమ``ని అకల్ తఖ్త్‌కు చెందిన జతేదార్ (అధిపతి) గ్యానీ రఘ్‌బీర్ సింగ్ పేర్కొన్నారు. ఈ చిత్రం సమాజాన్ని అగౌరవపరుస్తుంది అని అతను వాదించాడు. కంగనా సిక్కులను `ఉద్దేశపూర్వకంగా క్యారెక్ట‌ర్ హత్య` చేసిందని ఆరోపించారు. ``జూన్ 1984 నాటి సిక్కు వ్యతిరేక క్రూరత్వాన్ని సమాజం ఎప్పటికీ మరచిపోలేం. కంగ‌న‌ రనౌత్ చిత్రం శ్రీ అకల్ తఖ్త్ సాహిబ్ చేత క్వామీ షాహీద్ (కమ్యూనిటీ అమరవీరుడు)గా ప్రకటించిన జర్నైల్ సింగ్ ఖల్సా భింద్రన్‌వాలే పాత్రను హత్య చేయడానికి ప్రయత్నిస్తోంది`` అని జ‌తేదార్ వివ‌రించారు.

కంగనా రనౌత్ 2021లో ఎమర్జెన్సీని ప్రకటించింది. అయితే ఇది రాజకీయ డ్రామా అయినప్పటికీ ఇందిరా గాంధీ బయోపిక్ కాదని స్పష్టం చేసింది. కంగ‌న‌ ఈ చిత్రంలో కథానాయికగా న‌టించ‌డ‌మే కాకుండా దర్శకత్వం కూడా చేస్తోంది. కంగనాతో పాటు ఎమర్జెన్సీలో అనుపమ్ ఖేర్, మిలింద్ సోమన్, మహిమా చౌదరి, శ్రేయాస్ తల్పాడే తదితరులు కూడా నటించారు. అటల్ బిహారీ వాజ్‌పేయి పాత్రలో శ్రేయాస్ తల్పడే కనిపించనుండగా, జయప్రకాష్ నారాయణ్ పాత్రలో అనుపమ్ ఖేర్ కనిపించనున్నారు. దివంగత నటుడు సతీష్ కౌశిక్ భారత మాజీ ఉప ప్రధాని జగ్జీవన్ రామ్‌గా కూడా కనిపించనున్నారు. ఎమర్జెన్సీ రిలీజ్ ప‌లుమార్లు వాయిదా ప‌డింది. ఇప్పుడు 6సెప్టెంబర్ 2024న థియేటర్లలోకి రానుంది.