‘సింబా’ ట్రైలర్: హత్యలు చేసే ప్రకృతి ప్రేమికులుగా జగపతిబాబు, అనసూయ!
ప్రపంచ వ్యాప్తంగా ఎయిర్ పొల్యూషన్ వల్ల 65 శాతం మంది చనిపోతున్నారని.. దమ్ము మందు కంటే దుమ్ము వల్ల చనిపోయేవాళ్ళ శాతం పాతిక రెట్లు ఎక్కువ అని ఈ ట్రైలర్ లో వివరించారు.
By: Tupaki Desk | 24 July 2024 7:58 AM GMTటాలీవుడ్ సీనియర్ నటుడు జగపతి బాబు, అనసూయ భరద్వాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'సింబా'. దీనికి 'ది ఫారెస్ట్ మ్యాన్' అనేది ట్యాగ్ లైన్. రెండేళ్ల క్రితం ప్రపంచ పర్యావరణం దినోత్సవం సందర్భంగా ఈ మూవీ ఫస్ట్ లుక్ ను లాంఛ్ చేశారు. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. ప్రమోషన్స్ లో భాగంగా మేకర్స్ తాజాగా ట్రైలర్ ను ఆవిష్కరించారు.
"స్టేజ్ ముందున్న పెద్దవాళ్ళ దగ్గర నుంచి సెంటర్ డోర్ ఓపెన్ చేసే సెక్యూరిటీ వరకూ.. ఇక్కడున్న హంతకులందరికీ వార్మ్ డెత్" అంటూ జగపతిబాబు చెప్పే డైలాగ్ తో ప్రారంభమైన ఈ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. పర్యావరణాన్ని రక్షించుకుంటే అది మనల్ని రక్షిస్తుంది అనే కాన్సెప్ట్ తో 'సింబా' సినిమా తీసినట్లు అర్థమవుతోంది. కాకపోతే దానికి మర్డర్ మిస్టరీని జోడించి, ఒక సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌గా తీర్చిదిద్దే ప్రయత్నం జరిగినట్లు తెలుస్తోంది.
ప్రపంచ వ్యాప్తంగా ఎయిర్ పొల్యూషన్ వల్ల 65 శాతం మంది చనిపోతున్నారని.. దమ్ము మందు కంటే దుమ్ము వల్ల చనిపోయేవాళ్ళ శాతం పాతిక రెట్లు ఎక్కువ అని ఈ ట్రైలర్ లో వివరించారు. ఇక ఈ సినిమాలో జగపతి బాబు, అనసూయ భరద్వాజ్ ప్రకృతి ప్రేమికులుగా కనిపిస్తున్నారు. జగపతి బాబు భారతీయుడు లెవల్లో ఫైట్స్ చేయడాన్ని మనం చూడొచ్చు. అనసూయ సమాజంలో మార్పు రావాలని కోరుకునే ఒక టీచర్ గా కనిపిస్తూనే, మరోవైపు డేరింగ్ అండ్ డాషింగ్ గా కనిపించింది. చీరకట్టులో ఆమె చేసే యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి.
పర్యావరణానికి హాని కలిగించే వారందరినీ టార్గెట్ చేసి చంపుతున్నట్లుగా ట్రెయిలర్ లో చూపించారు. మదర్ నేచర్ ను కాపాడుతున్నానని జగపతిబాబూ అంటే.. ఇంకో మదర్ కు దుఃఖాన్ని మిగులుస్తూ కాపాడటం కరెక్ట్ కాదని అతని భార్య సుకన్య చెప్తోంది. అయితే ఆ మర్డర్స్ అన్నీ అనసూయే చేస్తున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. కానీ బయోలాజికల్ మెమరీ అంటూ ఆమె తనకు తెలియకుండానే హత్యలు చేస్తోందా? అనే సందేహాలు కలిగించారు. ఈ మర్డర్స్ వెనకున్న మిస్టరీ ఏంటి? జగపతి బాబు, అనసూయలకు లింకేంటి? అసలు ఈ హత్యలు చేస్తున్నదెవరు? అనేది తెలియాలంటే ఈ సినిమా వచ్చే వరకూ ఆగాల్సిందే.
ఓవరాల్ గా ఓ బలమైన సామాజిక అంశానికి, కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి 'సింబా' సినిమా రూపొందించినట్లు ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది. ఇందులో గౌతమీ, కస్తూరీ, వశిష్ఠ సింహా, శ్రీనాథ్ మాగంటి, బిగ్ బాస్ దివి వధ్య, కబీర్ సింగ్, అనీష్ కురివిల్ల తదితరులు కీలక పాత్రలు పోషించారు. డి.కృష్ణ సౌరభ్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి కృష్ణప్రసాద్ సినిమాటోగ్రఫీ బాధ్యతలను నిర్వహించారు. తమ్మిరాజు ఎడిటింగ్ వర్క్ చేశారు.
'సింబా' చిత్రానికి మురళీ మోహన్ రెడ్డి దర్శకత్వం వహించారు. ప్రముఖ దర్శకుడు సంపత్ నంది కథ అందించడమే కాదు, నిర్మాతగానూ వ్యవహరించారు. సంపత్ నంది టీమ్ వర్క్స్, రాజ్ దాసరి ప్రొడక్షన్స్ బ్యానర్‌లపై ఈ సినిమా రూపొందింది. ఆగస్టు 9న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.