తెలుగు రాష్ట్రాలకు సాయంలో తొలి తమిళ హీరో
తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితుల అష్టకష్టాలు అందరినీ కదిలిస్తున్నాయి. ఇప్పటికే టాలీవుడ్ స్టార్లు విరివిగా విరాళాల్ని ప్రకటించారు.
By: Tupaki Desk | 10 Sep 2024 6:04 AM GMTతెలుగు రాష్ట్రాల్లో వరద బాధితుల అష్టకష్టాలు అందరినీ కదిలిస్తున్నాయి. ఇప్పటికే టాలీవుడ్ స్టార్లు విరివిగా విరాళాల్ని ప్రకటించారు. తీసుకున్న దాని నుంచి కొంత తిరిగి ఇవ్వడం మన స్టార్లకు ఎప్పుడూ అలవాటు. ఒక్క మెగా కుటుంబం నుంచి సుమారు 8 కోట్లు పైగా సీఎం నిధికి విరాళం ఇవ్వడం చర్చనీయాంశమైంది. చిరంజీవి, రామ్ చరణ్, బన్ని, సాయిధరమ్ సహా పలువురు స్టార్లు విరివిగా విరాళాల్ని ప్రకటించారు. బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, మహేష్, ఎన్టీఆర్, ప్రభాస్, అశ్వనిదత్, రానా సహా చాలామంది సెలబ్రిటీలు ఏపీ, తెలంగాణలో వరద బాధితులను ఆదుకునేందుకు నిధుల్ని సమకూర్చారు.
అయితే ఇరుగు పొరుగు రాష్ట్రాల నుంచి స్టార్లు ఎవరైనా స్పందిస్తారేమోనని తెలుగు మీడియా ఎదురు చూసింది. కానీ ఇప్పటివరకూ ఎవరూ ఎలాంటి విరాళాల్ని ప్రకటించలేదు. తొలిసారి తెలుగు రాష్ట్రాల వరద బాధితుల సహాయార్థం విరాళం ఇచ్చిన తమిళ స్టార్‌గా శింబు నిలిచాడు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి రూ. 6 లక్షలు విరాళాన్ని అందించారు. శింబు ధాతృత్వం.. తెలుగు ప్రజలపై తనకు ఉన్న ప్రేమ, కృతజ్ఞతను తెలియజేస్తుంది. శింబు వ్యక్తిత్వాన్ని తెలుగు ప్రజలు కొనియాడుతున్నారు.
శింబు తమిళ చిత్ర రంగంలో ప్రతిభావంతుడైన నటుడు. అతడు నటించిన మన్మథన్ తెలుగులో మన్మథ పేరుతో విడుదలై విజయం సాధించింది. శింబు నటించిన చాలా తమిళ సినిమాలు తెలుగులో అనువాదమై రిలీజయ్యాయి. తనదైన ప్రతిభ, వైవిధ్యమైన నట ప్రదర్శనతో అతడు భారీ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నాడు. ఇక ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో భారీ మార్కెట్ ని, బాక్సాఫీస్ వసూళ్లను ఆశిస్తున్న చాలామంది పొరుగు స్టార్లు తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితుల కోసం ఇంకా ఎలాంటి సాయాన్ని ప్రకటించని సంగతి తెలిసినదే.