Begin typing your search above and press return to search.

మంచి కథలనూ థియేటర్‌లో చూడటం లేదు

తాజాగా ఈ విషయమై బాలీవుడ్‌ ముద్దుగుమ్మ సిమ్రత్‌ కౌర్‌ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

By:  Tupaki Desk   |   21 March 2025 6:00 PM IST
మంచి కథలనూ థియేటర్‌లో చూడటం లేదు
X

ఒకప్పుడు సినిమాను థియేటర్‌లో మాత్రమే చూసే అవకాశం ఉండేది. ఆ తర్వాత టీవీ మాధ్యమం రావడంతో థియేటర్‌లో వచ్చిన కొన్ని నెలల తర్వాత అయినా టీవీలో వస్తుంది కదా అప్పుడు చూద్దాం అనుకునే వారు ఉండేవారు. థియేటర్‌ రిలీజ్ అయిన నెల, రెండు నెలల్లోనే టీవీలో టెలికాస్ట్‌ అయిన సందర్భాలు ఉన్నాయి. టీవీల తర్వాత ఓటీటీలు వచ్చాయి. గత ఐదు సంవత్సరాల్లో సినిమా పరిశ్రమను ఓటీటీ ఏ స్థాయిలో శాసించే స్థితికి చేరిందో అందరం చూస్తూనే ఉన్నాం. ఒకప్పుడు మినిమం వంద కోట్ల వసూళ్లు సాధించిన హీరోల సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడుతున్నాయి. కరోనా ముందు సినిమాల సక్సెస్‌ రేటుతో పోల్చితే ఈమధ్య కాలంలో సక్సెస్ రేటు మరీ దారుణంగా పడిపోయింది.

చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు అనే తేడా లేకుండా ఎక్కువ శాతం సినిమాలను థియేటర్‌ స్క్రీనింగ్‌ స్కిప్ చేసి ఓటీటీ స్ట్రీమింగ్‌ చేయాలని చాలా మంది కోరుకుంటున్నారు. సినిమా విడుదలైన వెంటనే ఒక అవగాహణకు వచ్చి థియేటర్‌లో చూడాలా.. లేదంటే ఓటీటీలో వచ్చే వరకు వెయిట్‌ చేయాలా అని నిర్ణయించుకుంటున్నారు. ఎక్కువ శాతం సినిమాలను ఓటీటీలో చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. దాంతో చాలా తక్కువ సినిమాలు మాత్రమే థియేట్రికల్‌ రిలీజ్‌లో మంచి విజయాన్ని సొంతం చేసుకుంటున్నాయి. తాజాగా ఈ విషయమై బాలీవుడ్‌ ముద్దుగుమ్మ సిమ్రత్‌ కౌర్‌ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

సిమ్రత్‌ కౌర్ మాట్లాడుతూ... ఓటీటీ మార్కెట్‌ పెరగడం వల్ల సినిమా ఇండస్ట్రీకి లాభంతో పాటు నష్టం కూడా ఉంటుంది. యానిమల్‌, గదర్‌ 2 వంటి యాక్షన్ సినిమాలను థియేటర్‌లో చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కానీ ఆ సినిమాల కంటే గొప్ప కథలు, మంచి కథలతో రూపొందిన '12త్‌ ఫెయిల్‌', 'లాపతా లేడీస్‌' సినిమాలను మాత్రం థియేటర్‌లలో చూడకుండా ఓటీటీలో ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తున్నారు. మంచి కథల సినిమాలు ఓటీటీలో వచ్చినప్పుడు మంచి స్పందన దక్కించుకుంటున్నాయి. ఆ సినిమాలు థియేట్రికల్‌ రిలీజ్‌లో మంచి విజయం సొంతం చేసుకోవడానికి స్కోప్‌ ఉన్నా ఆ స్థాయిలో ఫలితాన్ని దక్కించుకోవడంలో విఫలం అవుతున్నాయి.

యాక్షన్‌ కథలు, భారీ బడ్జెట్‌ సినిమాలను మాత్రమే జనాలు థియేటర్‌లో చూడాలని భావిస్తున్నారని, మంచి కథలతో రూపొందించిన చిన్న సినిమాలు, మంచి మెసేజ్ ఉన్న సినిమాలను ఓటీటీలో చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారని సిమ్రత్‌ పేర్కొంది. ఇది ఇండస్ట్రీకి పెద్ద నష్టంను కలిగిస్తుందనే అభిప్రాయంను ఆమె వ్యక్తం చేసింది. అందుకే ఓటీటీల వల్ల ఇండస్ట్రీకి ఎంత లాభం ఉందో అంతకు మించి నష్టం ఉందని చెప్పుకొచ్చింది. కొన్ని సినిమాలను మాత్రమే బిగ్‌ స్క్రీన్‌ పై చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. కనుక అలాంటి సినిమాలనే అందరు చేస్తే మంచి కథలను ఎవరు తీసుకు వస్తారని ఆమె ప్రశ్నించింది. అయితే సిమ్రత్‌ చేసిన వ్యాఖ్యలు కేవలం బాలీవుడ్‌ కే పరిమితం.

సౌత్‌లో ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిన్న సినిమాలకు, మంచి కథా చిత్రాలకు థియేటర్‌లో మంచి స్పందన దక్కుతుంది. ఇటీవల కోర్ట్‌ సినిమా అందుకు ఒక ఉదాహరణగా నిలుస్తుంది అనడంలో సందేహం లేదు. బాలీవుడ్‌లో మాత్రమే ప్రస్తుతం ఈ పరిస్థితి నెలకొందరు. ముందు ముందు అక్కడ కూడా చిన్న సినిమాలకు థియేట్రికల్‌ రెస్పాన్స్ దక్కుతుందని విశ్లేషకులు నమ్మకంగా ఉన్నారు.