పివి సింధు- దత్తసాయి జంట ఆస్తి ఎంత?
రెండుసార్లు ఒలింపిక్ విజేత పివి సింధు డిసెంబర్ 22 న హైదరాబాద్ కి చెందిన టెక్ ఎగ్జిక్యూటివ్ వెంకట దత్త సాయిని వివాహమాడిన సంగతి తెలిసిందే
By: Tupaki Desk | 27 Dec 2024 3:49 AM GMTరెండుసార్లు ఒలింపిక్ విజేత పివి సింధు డిసెంబర్ 22 న హైదరాబాద్ కి చెందిన టెక్ ఎగ్జిక్యూటివ్ వెంకట దత్త సాయిని వివాహమాడిన సంగతి తెలిసిందే. రాజస్థాన్ ఉదయ్ పూర్ లో ఈ వివాహం జరిగింది. అనంతరం విందు కార్యక్రమం హైదరాబాద్ లో జరిగింది. ఇక సాయితో సింధు వివాహం విందుకి సంబంధించిన ఫోటోలు ఇప్పటికే వైరల్ అయ్యాయి. పెళ్లి తర్వాత తొలిసారి మాట్లాడిన సింధు తాను జీవితంలో స్థిరత్వం కోసం ప్రయత్నమిదని ..అందుకే పారిస్ ఒలింపిక్స్ తర్వాత 2024లో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నానని వెల్లడించింది.
వివాహం అంటే స్థిరత్వం..నేను మరింత మెరుగ్గా పని చేయడంలో సహాయపడేది స్థిరత్వం అని సింధు పేర్కొంది. అత్యున్నత స్థాయిలో పోటీకి దిగడం చాలా డిమాండ్లతో కూడుకున్నది. ఆ భద్రత, మద్దతు పెళ్లితో దక్కుతుంది. జీవితంలో ఈ కొత్త దశ చాలా ప్రత్యేకంగా అనిపించింది అని సింధు వ్యాఖ్యానించింది.
ప్రస్తుతం పివి సింధు, దత్తసాయి జంట నికర ఆస్తుల గురించి అభిమానుల్లో తెలుసుకోవాలనే ఆసక్తి నెలకొంది. మీడియా కథనాల ప్రకారం.. సింధు నికర ఆస్తుల విలువ రూ.59 కోట్లు (7.1 మిలియన్ డాలర్లు). భారతదేశంలో అత్యధికంగా సంపాదిస్తున్న మహిళా అథ్లెట్లలో ఒకరిగా పి.వి.సింధు పేరు వినిపిస్తోంది. ఆట సహా వాణిజ్య ప్రకటనలతోను సింధు భారీగా ఆర్జిస్తోంది. సింధు హైదరాబాద్‌లో విలాసవంతమైన హిల్‌టాప్ హోమ్ ని కూడా సొంతం చేసుకుంది. రియల్ ఎస్టేట్‌లో సింధు పెట్టుబడులు పెట్టారు. నాగార్జున అక్కినేని బహుమతిగా ఇచ్చిన బిఎండబ్ల్యూ ఎక్స్5, ఆనంద్ మహీంద్రా కానుకిచ్చిన మహీంద్రా థార్ సహా పలు కార్లను కలిగి ఉంది. 2019లో సింధు చైనీస్ బ్రాండ్ లీ నింగ్‌తో రూ.50 కోట్ల ఒప్పందంపై సంతకం చేసింది. మేబెల్లైన్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఏషియన్ పెయింట్స్ సహా పలు బ్రాండ్ లకు అంబాసిడర్. సింధుకు 4 మిలియన్లకు పైగా ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లు ఉన్నారు.
సింధు భర్త వెంకట దత్త సాయి పోసిడెక్స్ టెక్నాలజీస్‌లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. అతడి నికర ఆస్తుల విలువ రూ.150 కోట్లు. వెంకట దత్త సాయికి క్రీడాభిరుచి ఉంది. తన కార్పొరేట్ నైపుణ్యాన్ని క్రీడలతో మిళితం చేశాడు.ఐపిఎల్ ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్‌కు మాజీ ఆపరేషన్ లీడ్‌గా పనిచేశారు. సింధు- దత్తసాయి ఆస్తుల విలువ సుమారు 200 కోట్లుగా ఉంది.