Begin typing your search above and press return to search.

నాకు సినిమా త‌ల్లి లాంటిది: శింగ‌న‌మ‌ల ర‌మేష్

శ్రీ క‌న‌క‌ర‌త్న మూవీస్ బ్యాన‌ర్ అధినేత శింగ‌న‌మ‌ల ర‌మేష్ గురించి టాలీవుడ్ ఆడియ‌న్స్ అంద‌రికీ ప‌రిచ‌య‌మే.

By:  Tupaki Desk   |   5 Feb 2025 11:30 PM GMT
నాకు సినిమా త‌ల్లి లాంటిది: శింగ‌న‌మ‌ల ర‌మేష్
X

శ్రీ క‌న‌క‌ర‌త్న మూవీస్ బ్యాన‌ర్ అధినేత శింగ‌న‌మ‌ల ర‌మేష్ గురించి టాలీవుడ్ ఆడియ‌న్స్ అంద‌రికీ ప‌రిచ‌య‌మే. గ‌త కొంత కాలంగా సినీ నిర్మాణానికి దూరంగా ఉన్న ఆయ‌న ఇవాళ ఉన్న‌ట్టుండి ప్రెస్ మీట్ పెట్టారు. సినీ రంగంలో మూవీ ఫైనాన్షియ‌ర్ గా కెరీర్ ను స్టార్ట్ చేసిన ఆయ‌న‌, త‌ర్వాత సినిమా మీదున్న ప్యాష‌న్ తో నిర్మాత‌గా మారారు. ఎంత మంది ఎన్ని కుట్ర‌లు చేసినా నిజం మీద అబ‌ద్దం ఎప్ప‌టికీ గెల‌వ‌లేద‌ని శింగ‌న‌మ‌ల ర‌మేష్ అన్నారు.

మ‌హాబ‌లిపురంలో ఉన్న 10 ఎక‌రాల స్థలాన్ని ఒక‌రికి తెలియ‌కుండా మ‌రొక‌రికి అమ్మాన‌ని త‌న‌పై త‌ప్పుడు కేసు పెట్టి అన్యాయంగా త‌న‌ను జైలుకి పంపార‌ని, కానీ కోర్టు త‌న‌ను నిర్దోషిగా తేల్చింద‌ని,కోర్టు ముందు త‌ప్పుడు కేసులు నిల‌బ‌డ‌వ‌ని, 14 ఏళ్ల పాటూ తాను చేసిన న్యాయ పోరాటం గెలిచింద‌ని ర‌మేష్ తెలిపారు.

అలా అని త‌న‌పై కేసు పెట్టిన వారిపై త‌న‌కేమీ క‌క్షలు లేవ‌ని, ఏది ఉన్నా న్యాయ ప‌రంగానే పోరాటం చేస్తాన‌ని ఆయ‌న తెలిపారు. ఆయ‌న నిర్మాణంలో సినిమాలొచ్చి చాలా కాల‌మైంది. గ్యాప్ రావ‌డంతో చాలా మంది తాను సినీ రంగం నుంచి త‌ప్పుకున్నార‌నుకున్నారు. కానీ నాకు సినిమా త‌ల్లి లాంటిద‌ని, ఫ్యూచ‌ర్ లో కూడా ఇదే సినీ రంగంలో కంటిన్యూ అవుతాన‌ని, త‌న ఇద్ద‌రి పిల్ల‌లు ఇప్ప‌టికే హీరోలుగా న‌టించి హిట్ అందుకున్నార‌ని, ఇప్పుడు వారికి రైటింగ్, డైరెక్ష‌న్ వైపు ఇంట్రెస్ట్ ఉంది. తాను నిర్మాత‌గా, ఫైనాన్షియ‌ర్ గా సినిమాలు చేస్తాన‌ని ఆయ‌న అన్నారు.

అప్ప‌ట్లో సినిమాలు ఆరు నెల‌లు, వ‌న్ ఇయ‌ర్ లోపు పూర్త‌య్యేవి కానీ తాను తెర‌కెక్కించిన కొన్ని పెద్ద హీరోల సినిమాలు దాదాపు మూడేళ్ల వ‌ర‌కు షూటింగ్ లోనే ఉన్నాయ‌ని, షూటింగ్ లేట‌వ‌డంతో తాను రూ.100 కోట్ల వ‌ర‌కు న‌ష్ట‌పోయిన‌ట్టు ఆయ‌న తెలిపాడు. అంత న‌ష్ట‌మొచ్చినా స‌ద‌రు పెద్ద హీరోలు అస‌లు స్పందించ‌లేద‌ని ఆ హీరోలపై అసంతృప్తి వెల్ల‌డించాడు.

ఈ సంద‌ర్భంగా మీడియా నుంచి ఒక‌రు మీ క‌థ‌నే సినిమా క‌థ‌లా ఉంది క‌దా. దానితో సినిమా చేసే ఛాన్సుందా అని అడ‌గ్గా త‌న‌ క‌థ‌ను వెబ్ సిరీస్ చేస్తే వెయ్యి ఎపిసోడ్స్ అవుతాయ‌ని, అయినా త‌న క‌థ‌ను ఎవ‌రు చూస్తార‌న్నారు.

ఫైనాన్స్ బిజినెస్ వ‌ల్లే త‌మ ఫ్యామిలీ ఇవాళ ఈ స్థాయిలో ఉంద‌ని, త‌న నాన్న గారి నుంచి అది ఆయ‌న‌కు వ‌చ్చింద‌ని, కానీ ఫిల్మ్ మేకింగ్ జూదం లాంటిద‌ని, దాని వ‌ల్లే త‌న‌కు రెండు సినిమాల్లో రూ.100 కోట్లు పోయాయ‌ని అన్నారు. అయితే ప్ర‌స్తుతం సినీ నిర్మాణం బావుందంటున్నారు. నిర్మాత‌ల‌కు డ‌బ్బులు మిగులుతున్నాయ‌ని బ‌య‌ట అంటున్నారు. త‌న క‌ష్టాల్లో దేవుడు తోడుగా నిల‌వ‌డం వల్లే ఇవాళ నిర్దోషిగా బ‌య‌ట‌ప‌డ్డాన‌ని, భ‌విష్య‌త్తులో క‌థ‌ను న‌మ్ముకుని సినిమా చేస్తాన‌ని, త్వ‌ర‌లోనే ఓ ప్రాజెక్టును అనౌన్స్ చేసే అవ‌కాశ‌మున్న‌ట్టు ఆయ‌న ఈ సంద‌ర్భంగా అన్నారు.