'సిరిమల్లె పువ్వా..'ని రీక్రియేట్ చేయడం కష్టమే కానీ..
ఈ పాట అప్పట్లో చేసిన మ్యాజిక్ అంతా ఇంతా కాదు. ఇప్పటికీ ఎవర్ గ్రీన్ సాంగ్‌గా నిలిచిన ఈ పాటని 'ఓటు'అనే సినిమా కోసం టీమ్ రీక్రియేట్ చేసింది.
By: Tupaki Desk | 5 Sep 2023 6:48 PM GMTకొన్నింటిని రీక్రెట్ చేసినా అందంగా ఉంటాయి..కానీ కొన్నింటిని మాత్రం రీక్రియేట్ చేయకపోవడమే బెటర్. ఎందుకంటే అవి యాంటిక్ పీస్ లాంటివి. వాటిని మళ్లీ రీక్రియేట్ చేయలేం. ఒకవేళ చేసినా.. బాడీని పునఃసృష్టించగలమే కానీ దాని సోల్‌ని మాత్రం తిరిగి తీసుకురాలేం. కొన్ని సినిమాలు, పాటలు కూడా అంతే. వాటిని అలాగే ఉంచాలి. మళ్లీ రీ క్రియేట్ చేయడానికి సహసించకూడదు. అలా చేస్తే దానికి కాపీ చేశారంటారే కానీ భలేగా చేశారు అనిపించుకోలేరు.
భారతీ రాజా దర్శకత్వంలో రూపొందించిన తమిళ చిత్రం '16 వయదినిలే'. కమల్ హాసన్, శ్రీదేవి, రజనీకాంత్ కీలక పాత్రల్లో నటించారు.1977లో విడుదలైన ఈ సినిమా అక్కడ సంచలన విజయం సాధించింది. అదే సినిమాని తెలుగులో 1978లో కె.రాఘవేంద్రరావు 'పదహారేళ్ల వయసు' పేరుతో రీమేక్ చేశారు. ఇందులో చంద్రమోహన్, శ్రీదేవి, మోహన్ బాబు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాలో శ్రీదేవిపై చిత్రీకరించిన 'సిరిమల్లె పువ్వూ..' ఇప్పటికీ ఎవర్ గ్రీన్ సాంగ్‌గా నిలిచింది. ఇదొక ఐకానిక్ సాంగ్. ఈ పాట గురించి తెలియగానే ముందుగా గుర్తొచ్చేది శ్రీదేవి పలికించిన హావ భావాలు, ఆమె అందం, ప్రముఖ సింగర్ జానకి మధుర గాత్రంతో చేసిన మ్యాజిక్ గుర్తొస్తాయి.
ఈ పాట అప్పట్లో చేసిన మ్యాజిక్ అంతా ఇంతా కాదు. ఇప్పటికీ ఎవర్ గ్రీన్ సాంగ్‌గా నిలిచిన ఈ పాటని 'ఓటు'అనే సినిమా కోసం టీమ్ రీక్రియేట్ చేసింది. ఇందులో హృతిక్ శౌర్య, తన్వినేగి జంటగా నటించారు. రవి దర్శకత్వం వహించిన ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇటీవలే సినిమా ప్రమోషన్స్ ప్రారంభించారు. ఇందులో భాగంగా ఈ సినిమా కోసం హీరోయిన్ తన్వి నేగిపై రీక్రియేట్ చేసిన 'సిరిమల్లె పువ్వా' లిరికల్ వీడియోని విడుదల చేశారు.
అప్పట్లో వేటూరి రాసిన అదే పాటని తీసుకున్న 'ఓటు' టీమ్ ఈ పాటని సునీతతో పాడించారు. తన వరకు బాగానే పాడినా జానకి గారి లాంటి లెజెండరీ సింగర్ ని మాత్రం మ్యాచ్ చేయడం హైలీ ఇంపాజిబుల్. కానీ చాలా వరకు సునీత ఈ పాటకు తనదైన గాత్రంతో మ్యాజిక్ చేశారని చెప్పొచ్చు. దర్శకుడు, మేకర్స్, ముఖ్యంగా సినిమా టీమ్, ఆర్ట్ డైరెక్టర్ 78లో వచ్చిన ఈ పాటకు తగ్గట్టుగా వాతావరణాన్ని రీక్రియేట్ చేయడంతో చాలా వరకు సక్సెస్ అయ్యారు అని చెప్పాలి. 'సిరిమల్లె పువ్వా' వంటి ఎవర్ గ్రీన్ సాంగ్‌ని యాజిటీజ్‌గా తెరపై ఆవిష్కరించలేకపోయినా ఆ ఫీల్‌ని మాత్రం తీసుకురాగలిగారు.
ఈ పాటలో శ్రీదేవిగా హీరోయిన్ తన్వి నేగిని పక్కాగా పోట్రేట్ చేశారు. అంతే కాకుండా చుట్టూ ఉన్న వాతావరణాన్ని కూడా అంతే అందంగా చూపించి ఔరా అనిపించారు. ఎవర్ గ్రీన్ పాపులర్ సాంగ్‌ని ఇన్నేళ్ల తరువాత రీక్రియేట్ చేయడం అనేది సాహసమే అయినా దాన్ని చాలా వరకు సక్సెస్ ఫుల్‌గా చేసినట్టుగా లిరికల్ వీడియో స్పష్టం చేస్తోంది. ఈ పాటని సిద్ధార్ధ్ రీమిక్స్ చేసిన తీరు కూడా బాగుంది. ఈ సాంగ్‌ని చూసిన ప్రతి ఒక్కరూ ఆ ఫీల్‌ని సహానుభూతి పొందుతారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.