విడుదలకు ముందే హిట్ అయిన సినిమా వచ్చేది ఎప్పుడంటే..!
రాధిక ఆప్టే, అశోక్ పాఠక్, దేవ్ రాజ్, ఛాయా కదమ్ ముఖ్య పాత్రల్లో నటించిన 'సిస్టర్ మిడ్‌నైట్' సినిమా గత ఏడాది పలు ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో సందడి చేసింది.
By: Tupaki Desk | 11 March 2025 1:48 PM ISTరాధిక ఆప్టే, అశోక్ పాఠక్, దేవ్ రాజ్, ఛాయా కదమ్ ముఖ్య పాత్రల్లో నటించిన 'సిస్టర్ మిడ్‌నైట్' సినిమా గత ఏడాది పలు ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో సందడి చేసింది. ముఖ్యంగా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో డైరెక్టర్స్ ఫోర్ట్‌నైట్ విభాగంలో వరల్డ్ ప్రీమియర్ వేశారు. అంతే కాకుండా పలు విభాగాల్లోనూ ఈ సినిమా అవార్డులకు నామినేట్ అయింది. అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించబడిన ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శింపబడిన ఈ సినిమాను ఇండియాలో థియేటర్‌ల ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు గాను ఏర్పాట్లు చేశారు. విడుదలకు ముందే హిట్ అయిన ఈ సినిమాను మార్చి 14న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.
ఇప్పటికే సినిమాకు కావాల్సినంత ప్రమోషన్, పబ్లిసిటీ జరిగింది. కనుక సినిమాను చూడడానికి ప్రేక్షకులు ఆసక్తిగా ఉన్నారు. విభిన్నమైన జోనర్‌లో రూపొందిన ఈ సినిమాకు కరణ్ కాంధారి దర్శకత్వం వహించగా అన్నా గ్రిఫిన్ , అలస్టెయిర్ క్లార్క్ , అలాన్ మెక్‌అలెక్స్ సంయుక్తంగా నిర్మించారు. గత ఏడాదిలోనే సినిమాను థియేటర్‌ల ద్వారా విడుదల చేయాలని భావించినా కొన్ని కారణాల వల్ల ఆలస్యం అవుతూ వచ్చింది. అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటిన ఈ సినిమా ఇండియాలో థియేటర్‌ల ద్వారా విడుదల అయ్యి ఎలాంటి ఫలితాన్ని దక్కించుకుంటుంది అనే విషయం తెలియాలి అంటే ఈనెల 14 వరకు వెయిట్ చేయాల్సిందే.
రాధిక ఆప్టే ఇప్పటి వరకు ఎన్నో విభిన్నమైన పాత్రల్లో నటించిన విషయం తెల్సిందే. ఆమె ఈ సినిమాలో మరోసారి విభిన్నమైన పాత్రను పోషించింది. ముఖ్యంగా ముక్కుకు గాయం అయి పెద్ద బ్యాండేజ్ వేసుకున్న పోస్టర్స్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. నిరాశలో ఉన్న ఒక నవ వధువు ఏం చేసింది, ఆ పరిణామాలు ఏంటి అనేది సినిమా కథాంశంగా రూపొందించారు. పూర్తి స్థాయి వినోదాత్మకంగా సాగే ఈ సినిమాలో రాధిక ఆప్టే నటనకు మంచి మార్కులు దక్కాయి. ఒక సాధారణ అమ్మాయిగా రాధిక ఆప్టేను దర్శకుడు చూపించడంతో పాటు, ఆమె ఆలోచన విధానంను చూపించిన తీరు విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది.
పలు అవార్డులు సొంతం చేసుకున్న సినిమాలు ఎక్కువ శాతం కమర్షియల్‌గా విజయాన్ని సొంతం చేసుకున్న దాఖలాలు తక్కువగా ఉంటాయి. కానీ సిస్టర్ మిడ్‌నైట్ మాత్రం ఇతర సినిమాలకు భిన్నంగా ఉంటుంది. కమర్షియల్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉండటంతో పాటు, యూత్ ఆడియన్స్‌ను ఆలోచింపజేసే విధంగా ఉంటుంది అంటూ మేకర్స్ చెబుతున్నారు. అందుకే అవార్డులు దక్కించుకోవడం మాత్రమే కాకుండా ప్రేక్షకుల అభిమానం సొంతం చేసుకుని అత్యధిక వసూళ్లను రాబడుతుంది అనే నమ్మకంను మేకర్స్ వ్యక్తం చేస్తున్నారు. విడుదల తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో ప్రమోషన్ స్పీడ్ పెంచారు. విడుదలకు ముందే పలు అవార్డులు సొంతం చేసుకున్న ఈ సినిమా విడుదలైన తర్వాత వసూళ్లు ఏమేరకు రాబట్టేను అనేది చూడాలి.