'కంగువ.. రూ.2 వేల కోట్లు వసూలు చేస్తుంది'
ఈ నేపథ్యంలో దర్శకుడు శివ, నిర్మాత కెఇ జ్ఞానవేల్ రాజా తాజాగా ఓ ఇంటర్వూలో మాట్లాడుతూ.. సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
By: Tupaki Desk | 15 Oct 2024 1:37 PM GMTకోలీవుడ్ స్టార్ హీరో సూర్య మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ "కంగువ". తమిళ మాస్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజ్ చేయబడిన ప్రమోషనల్ కంటెంట్ కు ఆడియన్స్ నుంచి అనూహ్య రెస్పాన్స్ వచ్చింది. వచ్చే నెలలో థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా విజయంపై నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా చాలా నమ్మకంగా ఉన్నాడు. బాక్సాఫీస్ వద్ద రూ.2 వేల కోట్లు వసూలు చేస్తుందని ధీమాగా చెబుతున్నాడు.
'కంగువ' సినిమా నవంబర్ 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో దర్శకుడు శివ, నిర్మాత కెఇ జ్ఞానవేల్ రాజా తాజాగా ఓ ఇంటర్వూలో మాట్లాడుతూ.. సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా తమిళ ఇండస్ట్రీ నుంచి రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరిన తొలి సినిమా కంగువ అవుతుందా? అని ప్రశ్నించగా.. తాను 2 వేల కోట్లు ఆశిస్తున్నానని నిర్మాత బదులిచ్చారు. ఎంత కలెక్ట్ చేసినా పారదర్శకత కోసం జీఎస్టీ చలాన్‌లను సోషల్ మీడియాలో షేర్ చేస్తానని, ఇతర నిర్మాతలు కూడా తమ జీఎస్టీ చలాన్‌లను పంచుకుంటే రియల్ బాక్సాఫీస్ ఫిగర్స్ వెల్లడవుతాయని పేర్కొన్నారు.
"కంగువ సినిమా రూ.500 కోట్లు సాధించినా, రూ.700 కోట్లు లేదా రూ.1000 కోట్లు కలెక్ట్ చేసినా నేను జీఎస్‌టీ చలాన్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాను. దీని తర్వాత నిర్మాతలందరినీ వారి జీఎస్‌టీ చలాన్‌లను పోస్ట్ చేయమని అడిగితే, కలెక్షన్స్ గురించి మీకు ఖచ్చితమైన సమాచారం వస్తుంది. నా వరకూ రూ. 2000 కోట్లు వసూలు చేస్తుందని భావిస్తున్నాను. మీరెందుకు తక్కువ నంబర్స్ అడిగి నన్ను అప్సెట్ చేస్తున్నారు" అని కెఇ జ్ఞానవేల్ రాజా నవ్వుతూ అన్నారు.
ఇండియన్ సినిమాలో రూ.1000 కోట్ల క్లబ్ బెంచ్ మార్క్ గా మారిపోయింది. ఇప్పటి వరకూ 7 భారతీయ చిత్రాలు మాత్రమే ఈ మైలురాయిని అందుకున్నాయి. ఇందులో 3 తెలుగు చిత్రాలు, 3 హిందీ సినిమాలు ఉంటే.. కన్నడ నుంచి ఒక్క సినిమా ఉంది. కానీ తమిళ్ సినిమా 1000 కోట్ల క్లబ్ కు చాలా దూరంలో ఆగిపోయింది. అయితే 'కంగువ' సినిమాకు వెయ్యి కోట్లు కలెక్ట్ చేసే సత్తా ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పుడు జ్ఞానవేల్ రాజా 2000 కోట్లు ఆశిస్తున్నాని అనడంతో, ఇది మరీ టూ మచ్ గా ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
'కంగువ' సినిమా రన్‌టైమ్ సుమారు 2 గంటల 26 నిమిషాలు వచ్చిందని డైరెక్టర్ శివ తెలిపారు. సినిమాలో దాదాపు 2 గంటల పాటు సాగే హిస్టారికల్ పోర్షన్స్‌లో సూర్య కంగువగా కనిపిస్తాడని, ప్రెజెంట్ స్టోరీ 25 నిమిషాల పాటు సాగుతుందని చెప్పారు. సూర్యను గతంలో ఎన్నడూ చూడని బెస్ట్ అవతార్ లో చూడబోతున్నారని అన్నారు. అవుట్‌పుట్‌పై టీమ్ మొత్తం చాలా నమ్మకంగా ఉందని దర్శకుడు చెప్పారు.
'కంగువా’ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా 10 భాషల్లో, 3D IMAX ఫార్మాట్‌లో రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేసుకుంటున్నారు. తమిళ్ మినహా మిగిలిన భాషల్లో సూర్య వాయిస్‌ని AI టెక్నాలజీతో డబ్బింగ్ చెప్పిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. దిశా పటానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలోబాబీ డియోల్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా భారీ బడ్జెట్ తో ఈ ఫాంటసీ యాక్షన్ మూవీని నిర్మిస్తున్నాయి.